బాబోయ్... నకిలీ ఓటర్లు | Fake voters to investgated State Chief Electoral Officer Rajesh lakhani | Sakshi
Sakshi News home page

బాబోయ్... నకిలీ ఓటర్లు

Published Tue, Feb 9 2016 2:22 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 PM

Fake voters to investgated State Chief Electoral Officer Rajesh lakhani

చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రస్తుత చట్టసభ పదవీకాలం ఈ ఏడాది మే 22వ తేదీతో ముగియనుంది. ఈ ఏడాది జనవరి 1వ తేదీని ఓటు హక్కు కలిగే రోజుగా పరిగణించి 18 ఏళ్లు నిండిన వారిద్వారా దరఖాస్తులు స్వీకరించారు. కొత్త ఓటర్లుగా ఓటర్ల జాబితాలో చేర్చారు. కొత్త ఓటర్ల జాబితాను గత నెల 20వ తేదీన ప్రకటించారు. ఈ జాబితాలో 40 లక్షల వరకు నకిలీ ఓటర్లు ఉన్నట్లు డీఎంకే అధినేత కరుణానిధి ఆనాడే విమర్శించారు. అలాగే నకిలీ ఓటర్లను తొలగించాల్సిందిగా డీఎంకే నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వినతిపత్రం సమర్పించగా, కొందరు కోర్టులో పిటిషన్లు వేసారు.

ఇదిలా ఉండగా, ఓటర్ల జాబితాల్లో మార్పులు చేర్పులకై గత నెల 31, ఈనెల 6వ తేదీన ప్రత్యేక శిబిరాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. ఈ రెండు రోజుల్లో సుమారు 8 లక్షల మంది ఓటర్లు పలు అంశాల్లో మార్పులు, చేర్పులపై దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల కమిషన్ సైతం నకిలీ ఓటర్లను ఏరివేసేందుకు చర్యలు చేపట్టింది. సుమారు 75వేల మంది అనేక చోట్ల తమకు ఓటు ఉన్నదని, వాటిని తొలగించాలని దరఖాస్తు చేసుకున్నారు.

2009 నుండి తమిళనాడులో నివసించే వారి జాబితాను పోల్చిచూస్తూ నకలీ ఓటర్ల ఏరివేతకు పూనుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి రాజేష్ లఖానీ సోమవారం చెప్పారు. గత జాబితాతో పోల్చుకుంటే చనిపోయిన లక్షమంది ఓటర్ల పేర్లు చెన్నై జాబితాలో ఉన్నట్లు తేలిందని తెలిపారు. నకిలీ ఓటర్ల తొలగింపుకు అనేక చర్యలను చేపట్టామని అన్నారు. ప్రతి జిల్లా కలెక్టర్‌కు చనిపోయిన ఓటర్ల జాబితాను అందజేశామని చెప్పారు.

అలాగే జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో పార్టీ నేతలకు సైతం ఈ పేర్ల జాబితాను అందజేస్తామని అన్నారు. నేతలు ఆ జాబితాను పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఈ లెక్కన రాష్ట్రం మొత్తం మీద సుమారు 6 లక్షల మంది నకిలీ (చనిపోయిన వారు) ఓటర్లు ఉన్నట్లు భావిస్తున్నారు.
 
రాష్ట్రవ్యాప్తంగా అఖిలపక్ష సమావేశాలు:
ఇదిలా ఉండగా, ఎన్నికల కమిషన్ నేతృత్వంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అఖిలపక్ష సమావేశాలను నిర్వహించారు. చెన్నైలోని రిప్పన్ బిల్డింగ్‌లో మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన సమావేశంలో అన్నాడీఎంకే, డీఎంకే, డీఎండీకే, కాంగ్రెస్, పీఎంకే, ఎండీఎంకే, వీసీకే, వామపక్షాల నేతలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement