న్యూఢిల్లీ: భారత దేశంలో నేడు వ్యవసాయం చేయడమన్నది ఉగ్రవాదం కన్నా ప్రమాదకరంగా పరిణమించింది. ఉగ్రవాద దాడుల్లో ఎవరైనా మరణించవచ్చు. వ్యవసాయం వల్ల రైతులు, వారిని నమ్ముకున్న కుటుంబ సభ్యులు ప్రాణాలు విడుస్తున్నారు. పంట ఎదిగే కాలంలో 20 డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరిగే ప్రతి డిగ్రీకి 67 మంది రైతుల చొప్పున ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (పీఎన్‌ఏఎస్)’ ఓ నివేదికలో వెల్లడించింది.
2050 నాటికి దేశంలో భూతాపోన్నతి మరో మూడు డిగ్రీలు పెరుగుతుందని, అప్పటికీ పంటల పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో, వాటిపై ఆధారపడి జీవించే రైతుల పరిస్థితి మరెంత దారుణంగా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో 130 కోట్ల జనాభా ఉండగా, వారిలో 58 శాతం మంది రైతులు ఉన్నారు. వారిలో వాతావరణ పరిస్థితులు అనుకూలించగా పంటలు దెబ్బతిని అప్పులపాలై ఏటా 1,30,000 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దేశంలో ఒకప్పుడు జాతీయ స్థూల ఆదాయంలో మూడోవంతు భాగం వ్యవసాయ రంగానిదే ఉండేది. ఇప్పుడది 226 కోట్ల డాలర్ల మొత్తం జాతీయ స్థూల ఆదాయంలో కేవలం 15 శాతానికి చేరుకుంది.
భూతాపోన్నతి, వాతావరణంలో వస్తున్న మార్పులు, పర్యవసానంగా ఏర్పడుతున్న అతివష్టి, అనావష్టి ఫలితంగా పంటులు దెబ్బతింటున్నాయి. దేశవ్యాప్తంగా ఏకరీతి ప్రణాళికాబద్ధమైన వ్యవసాయ విధానం లోపించడం, పండిన పంటలకు గిట్టుబాటు ధర లభించక పోవడం వల్ల బ్రతుకుదెరువులేక రైతులు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బాస్టన్‌లోని హార్వర్డ్ మెడికల్ స్కూల్లో పనిచేస్తున్న సైకియాట్రిస్ట్ విక్రమ్ పటేల్ తెలియజేస్తున్నారు. ప్రధానంగా పంటలు దెబ్బతినడం, అధిక దిగుబడి వచ్చినా గిట్టుబాటు ధరలు లేక రైతులు దేశంలో తీవ్రంగా నష్టపోతున్నారు. పంటల కోసం చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు.
అలాంటి వారికి తోటి రైతుల నుంచి సరైన మద్దతు లభించక పోవడం, ఇతర ఉపాధి అవకాశాల ద్వారా కుటుంబ భారాన్ని పంచుకునేవారు లేక పోవడం, ప్రాణాంతకమైన క్రిమిసంహారక మందులు అందుబాటులో ఉండడం వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విక్రమ్ పటేల్ విశ్లేషించారు. కొన్ని చోట్ల నష్టపరిహారం కూడా రైతులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భూతాపోన్నతిని మనం అరికట్టలేక పోవచ్చుగానీ, రైతులను అన్ని విధాల ఆదుకోవడం ద్వారా వారిని ఆత్మహత్యల నుంచి రక్షించవచ్చని డాక్టర్ విక్రమ్ పటేల్ చెబుతున్నారు.
భూతాపోన్నతి పెరగడం వల్ల గత మూడు దశాబ్దాలుగానే రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అంతకుముందుకన్నా భారత్‌లో 6.8 శాతం రైతుల ఆత్మహత్యలు పెరిగాయని కాలిఫోర్నియా యూనివర్శిటీలో వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థపై అధ్యయనం చేసిన టమ్మా కార్లేటాన్ తెలిపారు. 1995కు ముందు భారత క్రైమ్ బ్యూరో అన్ని ఆత్మహత్యలను ఒకటిగానే పేర్కొనేది. 1995 నుంచే రైతుల ఆత్మహత్యలను విడిగా నమోదు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే దేశంలోని 21 రాష్ట్రాల్లో ఇటీవల రైతులు ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. ఇప్పటికీ మానవ పుర్రెలతో రైతులు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నారు. ఈ ఏడాది కూడా దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఒకే తీరుగాలేక కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కువగా, కొన్ని రాష్ట్రాల్లో అతి తక్కువగా పడుతున్నాయి.
యమ డేంజర్‌గా మారిన వ్యవసాయం
Published Wed, Aug 2 2017 8:23 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement