తూర్పు గోదావరిలో మానవ మృగం
రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లాలో మానవ మృగం కన్న కూతురినే చిదిమేసింది. రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరు సంతోష్‌నగర్‌లో చోటుచేసుకున్న ఈ దురాగతంపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..
కొంతమూరులో ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటూ జీవించే వ్యక్తికి 15 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి 14 ఏళ్ల కొడుకు, 11 ఏళ్ల కూతురు ఉన్నారు. అతను చెడు వ్యసనాలకు బానిసై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తుండటంతో మూడేళ్ల కిందట భార్య అతణ్ని వదిలేసింది. పిల్లల్ని కాకినాడలోని తన తల్లి ఇంట్లో ఉంచిన ఆ ఇల్లాలు ఉపాధి కోసం కువైత్ వెళ్లింది. పిల్లలిద్దరూ అమ్మమ్మ దగ్గరే ఉంటూ చదువుకుంటున్నారు. అతను మాత్రం కొంతమూరులోనే తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. గత నెల 13న అమ్మమ్మ విజ్ఞప్తి మేరకు బాధిత బాలిక.. అన్నయ్యతో కలిసి తండ్రి వద్దకు వెళ్లారు. గురువారం రాత్రి కరెంట్ పోవడంతో అందరూ ఆరుబయట నిద్రిస్తుండగా బాలిక ఒక్కతే ఇంట్లో నిద్రించింది. రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చిన తండ్రి.. కూతురి నోటిని అదిమిపట్టి అత్యాచారం చేశాడు.
బాధను భరించలేని ఆ బాలిక.. తండ్రి చేసిన అకృత్యాన్ని అమ్మమ్మకు చెప్పింది. చుట్టుపక్కలవారి సహాయంతో శుక్రవారం ఉదయం రాజానగరం పోలీసులకు ఫిర్యాదు చేసిందా అమ్మమ్మ. బాలికను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని సీఐ కె.వరప్రసాద్ తెలిపారు.
కిరోసిన్ తాగిన నిందితుడు: కాగా అకృత్యానికి పాల్పడిన నిందితుడు శుక్రవారం ఉదయం కిరోసిన్ తాగడంతో అదే ఆస్పత్రిలో చేర్చారు. ఈస్ట్ జోన్ డీఎస్సీ రమేష్‌బాబు ఆస్పత్రిలో బాలిక వద్ద వివరాలు సేకరించారు. వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆస్పత్రికి వెళ్లి బాలికను పరామర్శించి ధైర్యం చెప్పారు. సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. ఆమె వెంట ఆ పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి ఉన్నారు.