సెన్సెక్స్ 189 పాయింట్ల ర్యాలీ | FBI clears Clinton | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్ 189 పాయింట్ల ర్యాలీ

Published Tue, Nov 8 2016 12:55 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM

సెన్సెక్స్ 189 పాయింట్ల ర్యాలీ - Sakshi

సెన్సెక్స్ 189 పాయింట్ల ర్యాలీ

ఐదు రోజుల నష్టాలకు తెర
 క్లింటన్‌కు ఎఫ్‌బీఐ క్లీన్‌చిట్‌తో మార్కెట్లలో ఉత్సాహం

 
 ముంబై: ఎఫ్‌బీఐ క్లీన్‌చిట్‌తో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ విజయావకాశాలు మెరుగుపడతాయన్న తాజా అంచనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ర్యాలీ జరిపాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగడంతో సెన్సెక్స్ 185 పాయింట్లు లాభపడి 27,458.99 వద్ద ముగియగా, అటు నిఫ్టీ సైతం 63 పాయింట్లు లాభపడి 8,497.05 వద్ద క్లోజయింది. గత వారం ఎన్నికల ముందస్తు అంచనాల్లో డోనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలోకి రావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు నష్టాలను చవిచూడటం తెలిసిందే. కానీ, ఎన్నికకు మరో రెండు రోజుల సమయం ఉందనగా... వ్యక్తిగత ఈ మెయిల్ వాడకం విషయంలో హిల్లరీ క్లింటన్‌పై నేరారోపణలు నమోదు చేసేందుకు ఎటువంటి ఆధారాలు లేవని ఎఫ్‌బీఐ క్లీన్‌చిట్ ఇవ్వడం ఇన్వెస్టర్లలో ఉత్సాహానికి దారి తీసింది. దీంతో స్పెక్యులేటర్లు తమ షార్ట్ పొజిషన్లను కవర్ చేసుకునేందుకు మొగ్గు చూపడం ఈక్విటీ మార్కెట్ల ర్యాలీకి తోడ్పడింది.
 
  హిల్లరీకి ఎఫ్‌బీఐ క్లిన్‌చిట్ ఇవ్వడంతో మార్కెట్లు సానుకూలంగా స్పందించినట్టు జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. తుది పోరు విషయంలో ఆందోళనగా ఉన్న ఇన్వెస్టర్లు తాజా పరిణామంతో ఊపిరి పీల్చుకున్నారని చెప్పారాయన. ఫార్మా, బ్యాంకు స్టాక్స్‌లో షార్ట్ కవరింగ్ సైతం ర్యాలీకి మద్దతుగా నిలిచినట్టు చెప్పారు. గత ఐదు ట్రేడింగ్ దినాల్లో సెన్సెక్స్ 667 పాయింట్ల మేర నష్టపోయిన విషయం తెలిసిందే. క్యాపిటల్ గూడ్‌‌స మినహా అన్ని సూచీలు లాభాల్లోనే ముగియడం కొనుగోళ్ల ఉత్సాహాన్ని సూచిస్తోంది. రంగాల వారీగా చూస్తే మెటల్స్, హెల్త్‌కేర్ 2 శాతం చొప్పున, బ్యాంకెక్స్ 1.70 శాతం, రియల్టీ 1.50 శాతం, స్మాల్ క్యాప్ 1.19 శాతం, మిడ్ క్యాప్ 0.59 శాతం మేర లాభపడ్డాయి. కాగా, గత శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు నికరంగా రూ.343 కోట్ల మేర విక్రయాలు జరిపారు.
 
 7 శాతం పెరిగిన లుపిన్ స్టాక్
 ఎఫ్‌డీఏ తనిఖీలను విజయవంతంగా పూర్తి చేసుకున్నట్టు ఫార్మా కంపెనీ లుపిన్ ప్రకటించడం ఆ షేరుకు కలసివచ్చింది. 7 శాతం లాభపడి బీఎస్‌ఈలో రూ.1,519 వద్ద ముగిసింది. ఎస్‌బీఐ 4 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 3.36 శాతం, ఐటీసీ 3 శాతం, టాటా స్టీల్ 2 శాతం, హీరో మోటో కార్ప్, అదానీ పోర్‌ట్స్ 2 శాతం మేర లాభాలను ఆర్జించాయి. టీసీఎస్ 2 శాతం, ఎల్‌అండ్‌టీ 1.34 శాతం, హెచ్‌యూఎల్, టాటా మోటార్స్, ఓఎన్‌జీసీ ఒక శాతం వరకు నష్టపోయాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement