హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రానికి చెందిన ఔషధ కంపెనీ పోష్ కెమికల్స్‌కు యూఎస్ ఎఫ్‌డీఏ షాకిచ్చింది. తనిఖీ సందర్భంగా పోష్‌కు చెందిన తయారీ ప్లాంటులో పలు లోపాలను గుర్తించామని, వీటిని సరిదిద్ది, తిరిగి తమ ఆమోదం పొందేంత వరకు కంపెనీ దాఖలు చేసే కొత్త అప్లికేషన్లు, సప్లిమెంట్లపై అనుమతిని నిలిపివేస్తామని ఎఫ్‌డీఏ హెచ్చరించింది.
ఉత్తమ తయారీ విధానాలను ఉల్లంఘించారని, తద్వారా కంపెనీ ఉత్పత్తి చేస్తున్న యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ కల్తీ అయ్యేందుకు ఆస్కారం ఉందని పేర్కొంది. కంప్యూటర్‌లో ఉన్న సమాచారాన్ని అనధికార వ్యక్తులు వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోలేదని, ఔషధ పరీక్షల విధానం సాంకేతికంగా పటిష్టంగా లేదన్న విషయం తమ తనిఖీల్లో తేలిందని తెలిపింది. పోష్ కెమికల్స్‌కు మేడ్చల్, జీడిమెట్లలో ప్లాంట్లున్నాయి. కాగా, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన సెంటిస్ ఫార్మాకు ఎఫ్‌డీఏ ఇదే విధమైన హెచ్చరిక చేసింది.