వారు ఊరు విడిచి వెళ్లిపోయారు!
కతిహార్: కులాంతర వివాహం చేసుకున్న ఓ జంట ప్రాణభయంతో ఊరిని విడిచి వెళ్లిపోయింది. తమ వివాహాన్ని ఆమోదించేందుకు పంచాయతీ పెద్దలు రూ. 50 వేల పన్ను విధించడంతో భయపడిన నవజంట ఊరిని వదలిపెట్టింది. బీహార్ లోని కతిహార్ జిల్లాలోని గోగ్రా గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
గోగ్రా గ్రామానికి చెందిన చోటు కుమార్ యాదవ్ తన పక్క గ్రామం రోహియాకు చెందిన సోని దేవిని కులాంతర వివాహం చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన పంచాయతీ పెద్దలు రూ. 50 వేలు పన్ను కట్టాలని హుకుం జారీచేశారు. దీంతో భయపడిపోయిన చోటు, సోని ఊరి విడిచి వెళ్లిపోయారు. ప్రాణభయంతోనే వారు ఊరు వదిలి వెళ్లిపోయారని అరిహనా పంచాయతీ పెద్ద మహేందర్ రవిదాస్ తెలిపారు. చోటు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భయంతో ఇంట్లోంచి బయటకు రావడం లేదన్నారు.