దేశభక్తి నిరూపించుకోమంటే ఏడుపొచ్చింది
న్యూఢిల్లీ: ‘నా దేశభక్తిని నిరూపించుకోమన్నప్పడు ఏడుపొచ్చినట్టయింది. దేశంలో నా కంటే గొప్ప దేశభక్తిపరుడు ఎవరూ లేరు’ అని బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ అన్నారు. అసహనంపై చేసిన వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కున్న షారుక్ ఇటీవల ‘ఆప్ కీ అదాలత్’లో పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘నా సినిమా ‘ఫ్యాన్’ హిట్టయినా, కాకున్నా.. నా కంటే గొప్ప దేశభక్తుడు ఎవరూ ఉండరని నేను చివరిసారిగా చెప్పాలనుకుంటున్నా. ఈ విషయం మళ్లీ మళ్లీ చెప్పను’ అని భావోద్వేగంతో అన్నారు. తన కుటుంబమే మినీ ఇండియా అని తెలిపారు. దేశం మోదీని ప్రధానిగా ఎన్నుకుందని.. మనమంతా ఆయనకు మద్దతివ్వాలన్నారు. యువత సహనంతో ఉండాలని.. జాతి పురోగమనానికి బాటలు వేసేలా కృషి చేయాలని తెలిపారు. ‘మతం, కులం, వర్ణం, వర్గం, ప్రాంతం తదితర విషయాల్లో అసహనం వద్దు. నటనను వ్యాపారంగా తీసుకోను. సినిమాల హిట్టయితే వీలైనంత ఇవ్వమని నిర్మాతలకు చెబుతాను. ఒప్పందాలు, ఈవెంట్లు, షోలకే ఫీజు వసూలు చేస్తాను’ అని అన్నారు.
అమితాబ్‌కంటే మంచి నటుడినని 22 ఏళ్ల క్రితం చేసిన వ్యాఖ్యను గుర్తుచేయగా.. అది వయసులో చేసిన దురహంకార వ్యాఖ్యగా, బాల్యచేష్ట అని చెప్పారు. ఏది గొప్ప నటుడిని చేస్తుందన్నది తనకు తెలియదని.. 22 ఏళ్ల తర్వాత ఇప్పటికి తెలుసుకున్నానని చెప్పారు. 50 ఏళ్ల వయసులో ఇప్పటికీ కొన్నిసార్లు తనలోని చిన్నపిల్లాడి తత్వం బయటపడుతుందని షారుక్ తెలిపారు.