సినిమా స్క్రిప్టుకు ఏమాత్రం తీసిపోదు | Film director Kidnapped to the Assistant | Sakshi
Sakshi News home page

సినిమా స్క్రిప్టుకు ఏమాత్రం తీసిపోదు

Published Sun, May 28 2017 8:42 AM | Last Updated on Tue, Sep 5 2017 12:13 PM

నిందితుల్లో డైరెక్టర్‌ చలపతి ఎరడు( ఎడమ నుంచి మొదటి వ్యక్తి)

నిందితుల్లో డైరెక్టర్‌ చలపతి ఎరడు( ఎడమ నుంచి మొదటి వ్యక్తి)

► సినిమా ప్రచారంలో విభేదాలు
►వ్యక్తి కిడ్నాప్, చిత్రహింసలు
►కేసు ఛేదించిన ఖాకీలు


ఇది సినిమా స్క్రిప్టుకు ఏమాత్రం తీసిపోదు. డైరెక్టర్‌ సినిమా తెలివితేటలను నిజ జీవితంలో ఉపయోగించాడు. తన చిత్రానికి ప్రచార బాధ్యతలు చూస్తున్న వ్యక్తిని సినీ ఫక్కీలో కిడ్నాప్‌ చేసి మూడురోజులు హింసించిన నేరానికి కటకటాల పాలయ్యాడు. ఇలా అనుకోకుండానే తన సినిమాకు ప్రచారాన్ని సంపాదించుకున్నాడనడంలో సందేహం లేదు.

జయనగర:  సినిమా (అడ్వర్‌డైజింగ్‌) ప్రకటనల విభాగం డైరెక్టర్‌ పరమేశ్‌ను కిడ్నాప్‌ చేసిన ‘వేగ’ సినిమా డైరెక్టర్‌తో పాటు ఐదుగురిని బెంగళూరు మాగడిరోడ్డు పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు డీసీపీ ఎంఎన్‌.అనుచేత్‌ తెలిపారు. శనివారం ఆయన మీడియా భేటీలో వివరాలను వెల్లడించిన మేరకు... వేగ అనే కన్నడ సినిమాకు డైరెక్టర్‌ చలపతి ఎరడు.

అతను కనసు సినిమా డైరెక్టర్, నిర్మాత అయిన మదన్‌ సలహా మేరకు సినిమా ప్రచారం బాధ్యతలను పరమేశ్‌ అనే వ్యక్తికి అప్పగించి రూ.16 లక్షల అందజేశాడు. కాని పరమేశ్‌ ప్రచారం సక్రమంగా నిర్వహించలేదని గొడవకు దిగిన డైరెక్టర్‌ చలపతి రూ.8 లక్షలు తిరిగి ఇవ్వాలని పరమేశ్‌ను అడిగాడు. ప్రచారం కోసం ఇప్పటికే రూ.13 లక్షలు ఖర్చు అయిందని అతను సమాధానమిచ్చాడు. ఈ విషయం పై ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది.

తోటలో బంధించి
గొడవలో తీవ్రకోపోద్రిక్తుడైన చలపతి తన అనుచరులైన కృష్ణరాజపురం నివాసి కిరణ్, శెట్టిగెరె కు చెందిన మూర్తి, మోహన్, కాడయరప్పనహళ్లి నివాసి మదన్‌ అనే నలుగురితో పరమేశ్‌ కిడ్నాప్‌నకు పథకం వేశాడు. 24వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో బసవేశ్వరనగర పుష్పాంజలి థియేటర్‌ వద్ద పరమేశ్‌ను కారులో కిడ్నాప్‌ చేసి దేవనహళ్లి సమీపంలోని కాడయరప్పనహళ్లిలో ఉన్న తోటలోకి తీసుకెళ్లి గదిలో బంధించారు. మూడురోజుల పాటు పరమేశ్వర్‌ను తీవ్రంగా కొట్టి రూ.8 లక్షల నగదు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

రెండురోజుల పాటు పరమేశ్‌ ఆచూకీ కనబడకపోవడంతో కుటుంబసభ్యులు శుక్రవారం మధ్యాహ్నం మాగడిరోడ్డు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న మాగడిపోలీస్‌స్టేషన్‌ సర్కిల్‌ ఇన్స్‌స్పెక్టర్‌ హరీశ్‌ పోలీస్‌బృందం తీవ్రంగా గాలించి తోటలోని ఇంటిపై దాడిచేసి పరమేశ్‌ను విడుదల చేయించారు. వేగ సినిమా డైరెక్టర్‌ చలపతి, మూర్తి, మోహన్, మదన్, కిరణ్‌ అనే ఐదుగురిని అరెస్టుచేసి, ఒక క్వాలిస్‌కారు, 5 సెల్‌ఫోన్లును స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement