తొలి దేశీ ఐఎఫ్‌ఎస్‌సీ ప్రారంభం
లాంఛనంగా ప్రారంభించిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ
ఎకానమీకి ఊతమివ్వగలదని ఆశాభావం
మార్గదర్శకాలు విడుదల
గాంధీనగర్: దేశీయంగా తొలి అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం (ఐఎఫ్‌ఎస్‌సీ) శుక్రవారం కార్యకలాపాలు ప్రారంభించింది. ఇక్కడి గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ (గిఫ్ట్) సిటీలో దీన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌ఎస్‌సీ నియమ, నిబంధనలను ఆయన ఆవిష్కరించారు. ఇది గుజరాత్ ఎకానమీతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతమివ్వగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఎఫ్‌ఎస్‌సీకి అనుమతులివ్వడంలో గత యూపీయే ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించిందంటూ జైట్లీ విమర్శలు గుప్పించారు. అయితే, కొత్త ప్రభుత్వం అన్ని అనుమతులు ఇవ్వడంతో పనులు చురుగ్గా సాగాయని, ఐఎఫ్‌ఎస్‌సీ సాకారమైందని ఆయన చెప్పారు. ప్రస్తుతం గిఫ్ట్ సిటీలో తొలి దశ పనులు పూర్తయ్యాయని, మరో రెండు దశల పనులు తదుపరి చేపట్టనున్నట్లు తెలిపారు. దేశాన్ని అధిక వృద్ధి బాట పట్టించే దిశగా.. కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు నియమ, నిబంధనలను సరళతరం చేస్తున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయి పన్ను విధానాలను అమలు చేయడంపై దృష్టి పెడుతున్నామన్నారు. సెబీ చైర్మన్ యూకే సిన్హా, ఆర్‌బీఐ డిప్యుటీ గవర్నర్ ఆర్ గాంధీ, ఐఆర్‌డీఏ చైర్మన్ టి. విజయన్, గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దుబాయ్, సింగపూర్ వెళ్లక్కర్లేదు..
ఐఎఫ్‌ఎస్‌సీ అందుబాటులోకి వచ్చినందున ఇన్వెస్టర్లు, వ్యాపారవేత్తలు ఇకపై దుబాయ్, సింగపూర్ వంటి అంతర్జాతీయ ఆర్థిక హబ్‌లకు వెళ్లాల్సిన అవసరం ఉండదని సెబీ చైర్మన్ యూకే సిన్హా పేర్కొన్నారు. ఇటీవల ఏర్పాటైన అనేక స్టార్టప్ సంస్థలు దేశీ యంగా నిధుల సమీకరణ కష్టతరంగా ఉండటంతో విదేశాల వైపు చూస్తున్నాయని ఆయన చెప్పారు. ఆయా సంస్థలు విదేశీ బాట పట్టకుండా దేశంలోనే ఉండే విధంగా తగు తోడ్పాటు అవసర మన్నారు. ఐఎఫ్‌ఎస్‌సీ ద్వారా ప్రవాస భారతీయులు (ఎన్నారై) విదేశీ కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతిస్తున్నామని, అలాగే భారత్‌లోనే ఉంటూ విదేశీ మారకంలో నిధులు సమీకరించుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని సిన్హా పేర్కొన్నారు.
మార్గదర్శకాలు...
కరెన్సీ, షేర్లలో ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ లావాదేవీల కోసం ఇన్వెస్టర్లు విదేశీ ఫైనాన్షియల్ హబ్‌లకు తరలిపోకుండా .. ఇక్కడే అవకాశాలు కల్పించేందుకు ఐఎఫ్‌ఎస్‌సీని ప్రతిపాదించారు. దుబాయ్, సింగపూర్‌లోని ఆర్థిక సర్వీసుల కేంద్రాలతో పోటీపడే రీతిలో ఐఎఫ్‌ఎస్‌సీ మార్గదర్శకాలను రూపొందించారు. వీటి ప్రకారం.. విదేశాల్లో ఏర్పాటైన సంస్థలు ఐఎఫ్‌ఎస్‌సీలోని స్టాక్ ఎక్స్చేంజీల్లో తమ షేర్లను లిస్టింగ్ చేయొచ్చు. విదేశీ మారకంలో నిధులు సమీకరించవచ్చు. ఎన్నారైలతో పాటు దేశ, విదేశాలకు చెందిన వ్యక్తులు, సంస్థాగత ఇన్వెస్టర్లు ఈ షేర్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు.