బాక్సింగులో గెలిచాడు.. 45 కోట్లతో కార్లు కొన్నాడు!
క్రీడాకారులకు, వాహనాలకు ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లుంది. సచిన్ టెండూల్కర్కు ఫెరారీ కారంటే భలే ఇష్టం. మహేంద్రసింగ్ ధోనీకి బైకులంటే ఎక్కడలేని ప్రేమ. ఇక ఇటీవలే ప్రపంచంలో అత్యంత ఖరీదైన బాక్సింగ్ ఫైటులో విజయం సాధించి దాదాపు రూ. 1200 కోట్లు గెలుచుకున్న ఫ్లాయిడ్ మేవెదర్.. ఆ డబ్బుతో ముందుగా ఏం చేశాడో తెలుసా? అందులో దాదాపు 45 కోట్ల రూపాయలు పెట్టి మంచి ఖరీదైన కార్లు ఓ పది కొని పారేశాడట.
జుట్టున్న అమ్మ ఎన్ని కొప్పులైనా పెట్టుకుంటుందని నానుడి. అలా.. చేతినిండా డబ్బుంది కాబట్టి ఎన్ని కార్లయినా కొంటాడన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రపంచంలో ధనవంతుల్లోకెల్లా ధనవంతులు అనుకున్నవాళ్లు కూడా ఇన్ని కార్లు, అదీ అన్నీ ఖరీదైన కార్లు కొని ఉండరని టాక్.
ఆయన కొన్న కార్ల జాబితా ఇదీ..
- రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్హెడ్ కూప్
- రోల్స్ రాయిస్ ఘోస్ట్
- మెర్సిడిస్ మేబాష్ ఎస్600
- మెర్సిడిస్ జి63 ఏఎంజీ వి8 బైటర్బో
- బెంట్లీ ఫ్లయింగ్ స్పర్
- బుగట్టి గ్రాండ్ స్పోర్ట్
- బుగట్టి వేరాన్
- ఫెరారీ 458 స్పైడర్
- మెక్లారెన్ 650ఎస్ స్పైడర్
- లాంబోర్గిని అవెంటాడర్ ఎల్పీ700-4 రోడ్స్టర్