రైతుకు లాభం చేకూర్చడంపై దృష్టిపెట్టండి: నాగిరెడ్డి | Focus to the benefit of farmers, says Nagi reddy | Sakshi
Sakshi News home page

రైతుకు లాభం చేకూర్చడంపై దృష్టిపెట్టండి: నాగిరెడ్డి

Published Thu, Jan 16 2014 4:26 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

రైతుకు లాభం చేకూర్చడంపై దృష్టిపెట్టండి: నాగిరెడ్డి - Sakshi

రైతుకు లాభం చేకూర్చడంపై దృష్టిపెట్టండి: నాగిరెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ ఉత్పత్తులకే ప్రాధాన్యమివ్వకుండా.. రైతుకు లాభం చేకూర్చడంపై దృష్టి పెట్టాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ఐసీఏఆర్) సభ్యుడు, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ దిగుబడుల్లో వృద్ధి ఉంటున్నా.. రైతుకు కనీస మద్దతు ధర లభించట్లేదని, రైతు కుటుంబానికి ఆహారం, వైద్యం, వారి పిల్లలకు విద్య అందక ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
 
  రైతును ఆదుకునేలా పరిశోధనలు జరగాలని విన్నవించారు. కేంద్ర వ్యవసాయమంత్రి శరద్ పవార్ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన ఐసీఏఆర్ సమావేశంలో నాగిరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలోని వ్యవసాయ సంక్షోభంపై పలు అంశాలు లేవనెత్తారు. వ్యవసాయ పరిశోధన కేంద్రాలు లేకపోవడంతో రైతాంగానికి జరుగుతున్న నష్టాన్ని పవార్ దృష్టికి తీసుకెళ్లారు. వ్యవసాయ సంక్షోభ నివారణకు ప్రాంత పరిస్థితులు, పంటకు అనుగుణంగా యాంత్రీకరణ అవసరమని, ఆ దిశగా సదరన్ రీజియన్‌లో ఆంధ్రప్రదేశ్‌లో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
 
 రాష్ట్రంలోని మెట్టప్రాంతాల్లో సీతాఫలం, రేగు, నేరేడు సాగవుతుందని, వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని  చెబుతూ... వీటి ఉత్పత్తికి పరిశోధన కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని సూచించారు. మత్స్య పరిశ్రమకు సంబంధించి దేశంలో 14 పరిశోధన కేంద్రాలుండగా, రాష్ట్రంలో ఒక్కటీ లేదన్నారు. చేపల ఉత్పత్తి బాగా జరిగే తూర్పుగోదావరి జిల్లాలో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు లాభం చేకూర్చడానికి ఎగుమతులు, దిగుమతుల్ల విధానాల్లో మార్పులు తీసుకురావడానికి, పంట బీమా వ్యవహారాలకు సంబంధించి ఆర్థిక విధానాల రూపకల్పనకు ఎకనామిక్ పాలసీ రీసెర్చ్ కేంద్రాన్ని 8 రీజియన్లలో పెట్టాలన్నారు. కాగా, ఐసీఏఆర్ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గైర్హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement