జైలు ఊచలు లెక్కపెట్టనున్న తొలి సీఐఏ అధికారిణి | Former CIA officer could go to jail for a notorious 'rendition' case | Sakshi
Sakshi News home page

జైలు ఊచలు లెక్కపెట్టనున్న తొలి సీఐఏ అధికారిణి

Published Thu, Jun 30 2016 4:15 PM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM

జైలు ఊచలు లెక్కపెట్టనున్న తొలి సీఐఏ అధికారిణి

జైలు ఊచలు లెక్కపెట్టనున్న తొలి సీఐఏ అధికారిణి

వాషింగ్టన్: ఒకప్పుడు సంచలనం సృష్టించిన వివాదాస్పద కౌంటర్ టైజమ్ కేసులో అమెరికా సీఐఏ రిటైర్డ్ అధికారిణి సబ్రినా డి సౌసాకు ఇటలీలో జైలు శిక్ష పడనుంది. ప్రస్తుతం పోర్చుగల్‌లో ఉన్న ఆమెను ఇటిలీకి తీసుకెళ్లి నాలుగేళ్లపాటు జైల్లో నిర్బంధించనున్నారు. అదేగనుక జరిగితే కౌంటర్ టెర్రరిస్టుల కార్యకాలాపాల్లో జైలు శిక్ష పడిన తొలి సీఐఏ అధికారి ఆమె అవుతుంది.

2001లో అమెరికాపై టెర్రరిస్టులు జరిపిన సెప్టెంబర్ దాడుల అనంతరం ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్టులను మట్టుపెట్టాలన్న లక్ష్యంతో అమెరికా సీఐఏ పలు దేశాల్లో రహస్య ఆపరేషన్లను నిర్వహించింది. ఎంతోమంది అనుమానితులను కిడ్నాప్‌చేసి వారిని కోర్టు ముందు హాజరుపర్చకుండానే రహస్య జైళ్లలో నిర్బంధించింది. ఇలాంటి కౌంటర్ టెర్రరిస్టు చర్యల్లో భాగంగానే 2003లో ఇటలీలోని మిలన్‌లో మసీదుకు వెళుతున్న అబూ ఒమర్ అనే ముస్లిం మత గురువును కిడ్నాప్ చేసింది. అప్పుడు ఈ కిడ్నాప్ కేసు ఎంతో సంచలనం సృష్టించింది.

ఈజిప్టుకు చెందిన అబూ ఒమర్ 2001లో ఇటలీలో ఆశ్రయం పొందడంతో ఆయనకు టెర్రరిస్టులతో సంబంధం ఉందని అనుమానించిన సీఐఏ అధికారులు, ఇటలీ ఇంటెలిజెన్స్ అధికారులతో కలసి రహస్య ఆపరేషన్ నిర్వహించారు. అందులో భాగంగా 2003, ఫిబ్రవరి 17వ తేదీన ముస్లిం మత గురువు అబూ ఒమర్‌ను కిడ్నాప్ చేశారు. రహస్య స్థలంలో నిర్బంధించి ఆయన్ని చిత్రహింసలకు గురిచేశారు. 2007 వరకు జైల్లో నిర్బంధించి ఆ తర్వాత విడుదల చేశారు. ఈ కిడ్నాప్ జరిగిన కొన్ని రోజుల్లోనే అమెరికా సీఐఏ అధికారులే కిడ్నాప్ చేశారనే విషయాన్ని మీడియా బయటపెట్టింది. ఈ కిడ్నాప్ వెనక అమెరికా ప్రభుత్వం హస్తం ఉందన్న కారణంగా ఈ సంఘటన సంచలనం సృష్టించలేదు. సీఐఏ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే సంచలనం సృష్టించింది.

సీఐఏ అధికారులు వెళ్లిన ప్రతి చోట, బస చేసిన హోటళ్లలో ఆధారాలు వదిలిపెట్టారు. ట్రేస్ చేయడానికి వీలున్న సెల్యూలార్ ఫోన్లలో మాట్లాడుకున్నారు. వారి టెలిఫోన్ నెంబర్లు, బస చేసిన హోటళ్ల బిల్లులు సహా పలు ఆధారాలు దొరికాయి. అప్పుడు ఇటలీలోనే సీఐఏ అధికారిగా పనిచేస్తున్న సబ్రినా డి సౌసౌకు ఈ ఆపరేషన్‌తో సంబంధం ఉందనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది. తొలుత ఈ కేసును ఇటలీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదు. తర్వాత వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు దర్యాప్తు చేపట్టింది. 26 మంది అమెరికా సీఐఏ అధికారులు ఈ కిడ్నాప్ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు తేలింది.

అప్పటికే కిడ్నాప్ కేసుతో సంబంధం ఉన్న సబ్రినా సహా పలువురు అధికారులు దేశం విడిచి వెళ్లిపోయారు. కోర్టులో ఈ కేసు విచారణ నిందితులు లేకుండానే జరిగింది. 2007లో వారిని దోషులుగా ఇటలీ కోర్టు ప్రకటించింది. 26 మందిలో 23 మందికి జైలు శిక్ష విధిస్తూ ఇటలీ కోర్టు 2009లో తీర్పు చెప్పింది. ఇటలీలోనే ఉద్యోగం చేసిన కారణంగా సబ్రినా, మరో ఇద్దరు సీఐఏ అధికారుల వివరాలు మాత్రం కేసులో నమోదై ఉన్నాయి. మిగతా వారి వివరాలు లేవు. వారెవరో కూడా తెలియదు.

2009లోనే రిటైర్డ్ అయిన సబ్రినాకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. భారత్‌లో పుట్టి అమెరికా పౌరసత్వం కలిగిన సబ్రినా రిటైరయ్యాక అమెరికాలోనే ఉంటున్నారు. ఆమె తన కుటుంబ సభ్యులను కలసుకునేందుకు పోర్చుగల్‌లోని లిస్బాన్‌కు 2015, ఏప్రిల్ నెలలో వెళ్లారు. అక్కడి నుంచి అక్టోబర్ నెలలో భారత్‌లోని గోవాకు వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లగా పోర్చుగీసు అధికారులు ఆమెను అరెస్టు చేశారు. ఆమెను ఇటలీకి అప్పగించే ప్రయత్నాల్లో పోర్చుగీసు అధికారులు ఉండగా, ఆమె తన కేసును మళ్లీ విచారించాలంటూ ఇటలీ కోర్టులో అమెరికా న్యాయవాది ద్వారా అప్పీల్ చేసుకున్నారు.

సీఐఏ ఇప్పుడు తనకు అండగా నిలబడే పరిస్థితి కనిపించడం లేదని, ఇటలీకి వెళ్లాక తనను నాలుగేళ్లపాటు జైల్లో పెట్టవచ్చని ఆమె అక్కడి నుంచి టెలిఫోన్ ద్వారా అమెరికా మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇదే కేసులో తనకన్నా ముందు అరెస్టైన ఇద్దరు సీఐఏ సీనియర్ అధికారులకు ఇటలీ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టిందని, తనకు అలాంటి అవకాశం కనిపించడం లేదని సబ్రినా వాపోయారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటలీ అధ్యక్షుడితో జరిపిన చర్చల కారణంగా ఆ ఇద్దరు అధికారులకు క్షమాభిక్ష లభించింది.

Advertisement
Advertisement