
కశ్మీర్‌లో ఉగ్రచిచ్చు పెట్టాం
పాక్ మాజీ అధ్యక్షుడు ముషార్రఫ్ వెల్లడి
లాహోర్: కశ్మీర్‌లో మత తీవ్రవాదాన్ని రెచ్చగొట్టేందుకు లష్కరే తోయిబాతో పాటు పలు ఉగ్రవాద సంస్థలకు శిక్షణతోపాటు పూర్తి మద్దతిచ్చినట్లు పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ తెలిపారు. పాక్ మాజీ మిలటరీ చీఫ్ కూడా అయిన ముషార్రఫ్ 1990ల్లో కశ్మీర్‌లో కల్లోలం సృష్టించేందుకు ఉగ్రవాద సంస్థలను సృష్టించి, శిక్షణ ఇచ్చినట్లు ఓ టీవీ చానల్‌తో అన్నారు. ఉగ్రవాద నాయకులైన లాడెన్, హక్కానీ, అల్ జవహరీ, లష్కరే నాయకులు హఫీజ్ సయీద్, లఖ్వీ తదితరులను పాక్ ప్రజలు హీరోలుగా గుర్తించారన్నారు.
‘1990ల్లో ‘స్వతంత్ర కశ్మీర్’ ఉద్యమం మొదలైనప్పుడు లష్కరేతోపాటు 11, 12 చిన్న చిన్న తీవ్రవాద సంస్థలు పుట్టుకొచ్చాయి. ప్రాణాలకు తెగించి పోరాడేలా వారికి శిక్షణతో పాటు పూర్తి మద్దతిచ్చాం’ అని తెలిపారు. ‘మతతీవ్రవాదం కోసం వారిని పుట్టిస్తే.. అదే ఇప్పుడు ఉగ్రవాదమై మన వారినే చంపుతోంది. అందుకే దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.