అమెరికా మహిళపై గ్యాంగ్‌రేప్.. నలుగురి అరెస్టు
అమెరికా మహిళపై గ్యాంగ్‌రేప్.. నలుగురి అరెస్టు
Published Tue, Dec 27 2016 9:48 AM | Last Updated on Thu, Apr 4 2019 3:21 PM
భారతదేశంలో పర్యటిద్దామని వచ్చిన అమెరికన్ మహిళపై గ్యాంగ్‌రేప్ చేసిన కేసులో నలుగురు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వాస్తవానికి ఈ నేరం గురించి అక్టోబర్‌లో ఫిర్యాదు చేసినా, ఎఫ్ఐఆర్ మాత్రం డిసెంబర్ 3వ తేదీన దాఖలైంది. అనుమానితుల్లో ఒక టూరిస్టు గైడు, డ్రైవర్, క్లీనర్, హోటల్ సిబ్బందిలో ఒకరు ఉన్నారు. వీరిని ఐదు గంటల పాటు ప్రశ్నించి, ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఈలోపు కూడా పలు సందర్భాలలో వీళ్లందరినీ విచారించారు. వారి పాస్‌పోర్టులను సీజ్ చేసి, అనుమతి లేకుండా నగరం వదిలి వెళ్లకూడదని ఆంక్షలు విధించారు.
డిసెంబర్ 8న నేపాల్ నుంచి తిరిగొచ్చిన టూరిస్టు గైడ్‌ను విచారించగా, అతడు తనపై ఆరోపణలు తప్పని చెప్పాడు. కానీ బాధితురాలు మాత్రం.. అతడు కూడా అత్యాచారం చేసినట్లు చెప్పింది. ఇంతకుముందు కూడా వీరిని అనుమానించినా, వాళ్లు పనిచేసిన ట్రావెల్ ఏజెన్సీ విచారణ జరిపి.. వాళ్లకు క్లీన్ చిట్ ఇవ్వడంతో అరెస్టు చేయలేదు. దాంతోపాటు బాధితురాలు కూడా మేజిస్ట్రేట్ ముందు తన వాంగ్మూలం ఏమీ చెప్పలేదు. ఆమె ఆరోపణలన్నీ తప్పని.. తాము అత్యాచారం చేసినట్లుగా ఆమె చెబుతున్న తర్వాత రోజు తమతో కలిసి ఆమె ఆగ్రా వచ్చిందని వాళ్లు అంటున్నారు. అందుకు సాక్ష్యంగా ఫొటోలపు చూపించారు. కానీ, తర్వాత బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ మళ్లీ అమెరికా నుంచి ఢిల్లీ వచ్చి పోలీసుల వద్ద తన వాంగ్మూలం రికార్డు చేసింది.
ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు చూపించిన గైడు మొదట్లో తనతో స్నేహంగా ఉండేవాడని, తర్వాత ఏప్రిల్ 8న మర్నాటి కార్యక్రమం గురించి మాట్లాడే నెపంతో తన స్నేహితులతో కలిసి రూంలోకి వచ్చి, మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చి ఒకరి తర్వాత ఒకరుగా తనపై అత్యాచారం చేశారని బాధితురాలు ఆరోపించింది. తర్వాతి రోజు కూడా తనపై అత్యాచారం చేశారని, ఈ విషయం ఎక్కడైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించారని చెప్పింది. నిందితుల వద్ద అత్యాచారానికి సంబంధించిన వీడియో కూడా ఉన్నట్లు ఆమె ఆరోపించింది. పోలీసులకు చెబితే దాన్ని బయటపెడతామని బెదిరించినట్లు తెలిపింది.
Advertisement
Advertisement