
పారిస్ మృతులకు ఫ్రాన్స్ నివాళి
పారిస్: రెండువారాల క్రితం ఫ్రాన్స్ రాజధాని నగరం పారిస్‌లో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంలో అసువులు బాసిన 130 మంది ప్రజలకు ఫ్రాన్స్ శుక్రవారం ఘనంగా నివాళి అర్పించింది. పారిస్‌లోని లె ఇన్‌వాలిడెస్ నేషనల్ మాన్యుమెంట్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రెండువేల మంది హాజరయ్యారు. ఇందులో మృతుల బంధువులతోపాటు దాడుల్లో గాయపడి కోలుకున్నవారు, మంత్రులు, అధికారులు, ఇతర ప్రముఖులు ఉన్నారు. ఈ సందర్భంగా చనిపోయిన వారందరి పేర్లను, వారి వయస్సు వివరాలను వరుసగా చదివి వినిపించారు.
వారికి సైనిక వందనం సమర్పించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌వ్యాప్తంగా భవనాలు, ఇళ్లు, దుకాణాల్లో కిటికీలు, తలుపులను ఫ్రాన్స్ జాతీయ జెండాలోని రంగులతో అలంకరించి మృతులకు నివాళులర్పించారు.