అబ్బాయికి బాబాయ్ ఝలక్
లక్నో: సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో ఏర్పడ్డ విబేధాలు ఆయన జోక్యంతో సమసిపోయినట్టు కనిపించినా అంతర్గత పోరు కొనసాగుతోంది. ములాయం కొడుకు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్.. ఆయన సోదరుడు, సీనియర్ కేబినెట్ మంత్రి, యూపీ ఎస్పీ చీఫ్ శివపాల్ సింగ్ యాదవ్ల మధ్య కొత్త వివాదం ఏర్పడింది.
వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం శివపాల్ యాదవ్ తొమ్మిదిమంది ఎస్పీ అభ్యర్థులను ప్రకటించారు. మరో 14 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు. హత్య కేసులో నిందితుడిగా ఉన్న అమర్మణి త్రిపాఠి కుమారుడికి టికెట్ ఇచ్చారు. కాగా అఖిలేష్కు తెలియకుండానే ఈ జాబితాను విడుదల చేశారు. దీనిపై అఖిలేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అభ్యర్థుల ఎంపిక గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని, భవిష్యత్లో చాలా మంది అభ్యర్థులను మారుస్తామని చెప్పారు. కాగా ఈ రోజు ఉదయం ములాయం ఇంట్లో జరిగిన సమావేశంలో శివపాల్ యాదవ్, అఖిలేష్ పాల్గొన్నారు. అయినా అఖిలేష్కు తెలియకుండా శివపాల్ అభ్యర్థుల జాబితా ప్రకటించారు.