UP CM Akhilesh Yadav
-
మళ్లీ కస్సుమన్న బాబాయ్
లక్నో: పట్టుమని వారం రోజులైనా ప్రశాంతత నెలకొందోలేదో.. సమాజ్ వాదీ పార్టీలో మళ్లీ విమర్శల పర్వం మొదలైంది. పార్టీ కంటే ప్రభుత్వం గొప్పది కాదంటూ బాబాయ్ శివపాల్ యాదవ్.. అబ్బాయి అఖిలేశ్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం లక్నోలో మీడియాతో మాట్లాడిన శివపాల్.. '2019 ఎన్నికల్లో బీజేపీని నిలువరించేలా మహా కూటమి ఏర్పాటుచేయాలనుకున్నాం. కానీ పార్టీలోని కొందరు ఆ ప్రయత్నాలను విచ్ఛిన్నం చేశారు. పార్టీని చీల్చే కుట్రలు చేశారు. నన్ను ఎంత అవమానించినా భరిస్తా. కానీ నేతాజీ(ములాయం)ను ఒక్క మాటన్నా సహించను. తిరుగుబాటుదారుల అంతు చూస్తా'అని పరోక్షంగా అఖిలేశ్ వర్గానికి తీవ్ర హెచ్చరికలు చేశారు. సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు ఇప్పటికే బాబాయ్, అబ్బాయ్ వర్గాలుగా చీలిపోయిన నేపథ్యంలో గురువారం(నవంబర్ 3) నుంచి ప్రారంభం కానున్న సీఎం అఖిలేశ్ రథయాత్ర ఏమేరకు విజయవంతం అవుతుందనేదానిపైనా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే మొదటి రోజు యాత్ర జరుగనున్న (లక్నో నుంచి ఉన్నావ్ వరకు) 60 కిలోమీటర్ల మార్గంలో ఇప్పటికే పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు ఏర్పాటయ్యాయి. శివపాల్ వర్గీయులు కూడా కొన్ని చోట్ల అఖిలేశ్ ను స్వాగతిస్తూ బ్యానర్లు ఏర్పాటుచేయడం గమనార్హం. 'శివపాల్ ఆశీస్సులతో అఖిలేశ్ కు మరోసారి పట్టాభిషేకం' అనే నినాదాలు పలు చోట్ల కనిపించాయి. మరోవైపు సమాజ్ వాదీ సుప్రిమో ములాయం మహా కూటమి ఏర్పాటు యత్నాలను ముమ్మరం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మంగళవారం ములాయంతో దాదాపు రెండు గంటలపాటు సమావేశం అయ్యారు. నవంబర్ 5న సమాజ్ వాదీ పార్టీ రజతోత్సవ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఇప్పటికే జనతా పరివార్ పార్టీల ముఖ్యులందరికీ ఆహ్వానాలు అందాయి. ఎస్పీ యూపీ చీఫ్ శివపాల్ యాదవే స్వయంగా ఆహ్వానపత్రికలు అందజేశారు. ఆ వేదికపై నుంచే మహా కూటమి ఏర్పాటు ప్రకటన వెలువడుతుందని సమాచారం. అయితే జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్.. ఎస్పీ వేడుకలకు వెళ్లబోనని ప్రకటించిన దరిమిలా మహాకూటమి ఏర్పాటుపై సందిగ్ధత నెలకొంది. మరి కొద్ది గంటల్లో యూపీ ఎన్నికల్లో ఎవరెవరు కలిసి పోరాడేది తేలిపోనుంది. -
బీజేపీ నేతలకు అఖిలేశ్ బంపర్ ఆఫర్
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయవతిపై గతంలో అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నేతకు ప్రస్తుత సీఎం అఖిలేశ్ యాదవ్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. శుక్రవారం లక్నోలో నిర్వహించిన ఓ అవార్డు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అఖిలేశ్.. అదే కార్యక్రమానికి దయాశంకర్, ఆయన సతీమణి, ప్రస్తుత యూపీ మహిళా మోర్ఛా అధ్యక్షురాలు స్వాతి సింగ్ లను సమాజ్ వాదీ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అఖిలేశ్ మాట్లాడుతూ.. 'బువా జీ(మాయవతి) మిమ్మల్ని (దయాశంకర్ ను) అరెస్ట్ చేయమని పదేపదే నాపై ఒత్తిడి తెచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. అప్పుడుగానీ, ఇప్పుడుగానీ బీజేపీ మిమ్మల్ని ఆదుకోలేదు, ఆదుకోదు. కాబట్టి అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోన్న సమాజ్ వాదీ పార్టీలోకి రండి' అని అన్నారు. (మాయవతిపై మొరటు వ్యాఖ్యలు) బహిష్కృతుడు అయ్యేనాటికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడైన దయాశంకర్ సింగ్ కు యూపీ రాజకీయాల్లో మంచి పట్టుంది. అతని భార్య స్వాతి సింగ్ సైతం చురుకైనా నాయకురాలు. వారిని తన మనుషులుగా సమాజ్ వాదీ పార్టీలోకి చేర్చుకుంటే ఎంతోకొంత లాభం జరుగుతుందనే సీఎం అఖిలేశ్ బహిరంగ ఆహ్వానం పలికారు. దీనిపై భిన్నస్వరాలు వ్యక్తం అవుతున్నాయి. (నోరు జారాడు.. పదవి పోయింది) -
సీఎం దగ్గర పని చేయట్లేదు కాబట్టి..
న్యూడిల్లీ: ములాయం సింగ్ యాదవ్ 'ఆల్ ఈజ్ వెల్' ప్రకటనతో సమాజ్ వాదీ పార్టీలో ఆధిపత్యపోరు తాత్కాలికంగా సర్దుమణిగినా.. వచ్చేవారం ఆ పార్టీకి సంబంధించిన రెండు కీలక ఘట్టాలు పాతగొడవల్ని తట్టిలేపుతాయని సర్వత్రా అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒకటి నవంబర్ 3నుంచి ప్రారంభం కానున్న అఖిలేశ్ రథయాత్ర, రెండు నవంబర్ 5న జరగనున్న పార్టీ రజతోత్సవ వేడుక. సరిగ్గా ఇదే సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్ శుక్రవారం ఢిల్లీలో మాట్లాడుతూ.. నవంబర్ 3 నుంచి ప్రారంభం కానున్న రథయాత్రకు తాను కూడా హాజరవుతానని, అయితే అఖిలేశ్ స్వయంగా ఆహ్వానిస్తేనే ఆ అక్కడికి వెళతానని అన్నారు. రథయాత్రపై విలేకరులు అడిగి ప్రశ్నలకు బదులిచ్చిన శివపాల్..'నన్ను మంత్రి వర్గం నుంచి తొలగించారు. అంటే ఇప్పుడు నేను సీఎం దగ్గర పనిచేయడం లేదు. కాబట్టి రథయాత్రకు విధిగా వెళ్లను. పిలిస్తేనే వెళతా'అని వ్యాఖ్యానించారు. అఖిలేశ్ తండ్రి మాట వినాలని హితవుపలికారు. సమాజ్ వాదీ పార్టీ 25ఏళ్ల వేడుకకు సంబంధించి ఇప్పటికే ఆహ్వానపత్రికలు పంచుతున్నారు. అందులో భాగంగా పార్టీ యూపీ అధ్యక్షుడు శివపాల్ శుక్రవారం ఢిల్లీలో రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్ డీ) చీఫ్ అజిత్ సింగ్ ను కలుసుకుకుని, ఆహ్వాన పత్రిక అందజేశారు. జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితిశ్ కుమార్ తోపాటు ములాయం వియ్యంకుడు, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ సహా ఇతర పార్టీల ముఖ్యులనూ సమాజ్ వాదీ పాతికేళ్ల వేడుకకు ఆహ్వానించనున్నట్లు శివపాల్ విలేకరులకు చెప్పారు. మరి 'కాంగ్రెస్ పార్టీ, బీజేపీలను కూడా ఆహ్వానిస్తారా?' అని ప్రశ్నించగా.. 'కేవలం సోషలిస్టు పార్టీలను మాత్రమే పిలుస్తున్నాం'అని బదులిచ్చారు. కొడుకు అఖిలేశ్ తిరుగుబావుటా సంకేతాల నేపథ్యంలో ములాయం.. పార్టీ పాతికేళ్ల వేడుకను కొత్త పొత్తులకు కేంద్రంగా మలుచుకుంటారనే ప్రచారం యూపీలో జోరుగా సాగుతోంది. -
అబ్బాయికి బాబాయ్ ఝలక్
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో ఏర్పడ్డ విబేధాలు ఆయన జోక్యంతో సమసిపోయినట్టు కనిపించినా అంతర్గత పోరు కొనసాగుతోంది. ములాయం కొడుకు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్.. ఆయన సోదరుడు, సీనియర్ కేబినెట్ మంత్రి, యూపీ ఎస్పీ చీఫ్ శివపాల్ సింగ్ యాదవ్‌ల మధ్య కొత్త వివాదం ఏర్పడింది. వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం శివపాల్ యాదవ్ తొమ్మిదిమంది ఎస్పీ అభ్యర్థులను ప్రకటించారు. మరో 14 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు. హత్య కేసులో నిందితుడిగా ఉన్న అమర్మణి త్రిపాఠి కుమారుడికి టికెట్ ఇచ్చారు. కాగా అఖిలేష్‌కు తెలియకుండానే ఈ జాబితాను విడుదల చేశారు. దీనిపై అఖిలేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అభ్యర్థుల ఎంపిక గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని, భవిష్యత్‌లో చాలా మంది అభ్యర్థులను మారుస్తామని చెప్పారు. కాగా ఈ రోజు ఉదయం ములాయం ఇంట్లో జరిగిన సమావేశంలో శివపాల్ యాదవ్, అఖిలేష్ పాల్గొన్నారు. అయినా అఖిలేష్‌కు తెలియకుండా శివపాల్ అభ్యర్థుల జాబితా ప్రకటించారు. -
ఎస్పీలో సమసిన సంక్షోభం
శివ్‌పాల్‌కు మద్దతుంటుందన్న అఖిలేశ్ లక్నో: సమాజ్‌వాదీ పార్టీలో బాబాయ్-అబ్బాయ్ మధ్య బలవంతంగా సంధి కుదిరినట్లు కనబడుతోంది. ఎన్నికలకు ముందు విభేదాలన్నీ పక్కనపెట్టి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం వరకు పరస్పర బహిరంగ విమర్శలు చేసుకోగా.. శనివారం అఖిలేశ్ మాట్లాడుతూ అంతా సర్దుకుంటుందన్న సంకేతాలిచ్చారు. బాబాయ్ శివ్‌పాల్‌కు పూర్తి మద్దతుంటుందన్నారు. యూపీ పార్టీ అధ్యక్షుడిగా శివ్‌పాల్ నియామకంతోనే వీరిద్దరి మధ్య గొడవ రోడ్డునపడడం తెలిసిందే. పార్టీ అధినేత ములాయం తీసుకున్న ఈ నిర్ణయం తనను బాధపెట్టిందని ఇటీవల చెప్పిన అఖిలేశ్.. శనివారం ‘యూపీ పార్టీ అధ్యక్షుడిని ఆయనింట్లో కలసి శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఏడాది జరిగే అభ్యర్థుల ఎంపికలో తన పాత్ర కీలకం కానుందని అఖిలేశ్ తెలిపారు. ‘వచ్చే ఎన్నికలు నాకు పరీక్ష. నేనో క్రీడాకారుడిని. ఫుట్‌బాల్, క్రికెట్ ఆడాను. సెల్ఫ్ గోల్ చేసుకోను’ అని అన్నారు. అంతకుముందు పలువురు పార్టీ కార్యకర్తలు ‘అఖిలేశ్‌ను అధ్యక్షుడిని చేయాల’నే డిమాండ్‌తో లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయం ముందు నినాదాలు చేశారు. వారిపై ములాయం సింగ్ మండిపడ్డారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన ములాయం.. నేరుగా కార్యకర్తల వద్దకు వెళ్లి ‘రెండ్రోజులుగా నెలకొన్న పరిస్థితి సద్దుమణిగించేందుకు ఎంత కష్టపడాల్సి వచ్చిందో నాకు తెలుసు. ఇలాంటి తమాషాలు ఇకపై కుదరవు’ అని అన్నారు. యూపీలో హంగ్! అతి పెద్ద పార్టీగా బీఎస్పీ ?: సర్వే న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాక త్రిశంకు సభ ఏర్పడే అవకాశాలున్నాయని, విపక్ష బీఎస్పీ అతిపెద్ద పార్టీగా నిలిచే సూచనలున్నాయని ఓ సర్వే పేర్కొంది. పార్లమెంటేరియన్ పత్రిక సర్వే ప్రకారం.. ఎస్పీ కోల్పోయే 150 సీట్లను బీజేపీ, బీఎస్పీ సమానంగా పంచుకుంటాయి. బీఎస్పీకి అదనంగా 89 సీట్లు దక్కుతాయి. బీజేపీకి ప్రస్తుతమున్న 47 సీట్లకు 88 జమవుతాయి. కాంగ్రెస్‌కున్న 28 సీట్లలో 13 తగ్గుతాయి. 39% మంది అఖిలేశ్ పనితీరు బాగుందన్నారు. 28% మంది మాయావతి సీఎం కావాలన్నారు. -
సొంత నిర్ణయాలు తీసుకోకుంటే రాజీనామా చేయాలి
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లేకుంటే, సీఎం పదవిలో ఉండేందుకు అనర్హులని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అఖిలేష్ సీఎం పదవికి రాజీనామా చేయాలని, అసెంబ్లీని రద్దు చేసి వెంటనే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములయాం సింగ్ యాదవ్ కుటుంబంలో ఏర్పడ్డ విబేధాలపై ఆయన స్పందించారు. వ్యక్తిగత ప్రయోజనాలు, అధికారం కోసం జరుగుతున్న పోరాటంలో ఎస్పీ కార్యకర్తలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని మౌర్య విమర్శించారు. సమాజ్‌వాదీ పార్టీలో, అఖిలేష్ ప్రభుత్వంలో జరుగుతున్న హైడ్రామా బజారున పడిందని, ఇది శాంతిభద్రతలకు సవాల్‌గా మారిందని చెప్పారు. అఖిలేష్ సీఎం పదవి హోదాకు భంగం కలిగించారని మౌర్య అన్నారు. అఖిలేష్‌కు ఆయన బాబాయ్, యూపీ కేబినెట్ మంత్రి శివపాల్ యాదవ్‌కు విబేధాలు ఏర్పడటం, పార్టీ చీఫ్ ములయాం జోక్యం చేసుకుని రాజీ చేసిన సంగతి తెలిసిందే. -
బాబాయ్ ఇంటికి వెళ్లిన అబ్బాయ్
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములయాం సింగ్ కుటుంబంలో ఏర్పడిన వివాదం టీ కప్పులో తుఫాన్‌లా సమసిపోయింది. యూపీ సీఎం అఖిలేష్ యాదవ్.. యూపీ సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌గా నియమితులైన బాబాయ్, యూపీ కేబినెట్ మంత్రి శివపాల్ సింగ్ యాదవ్‌ను అభినందించారు. అఖిలేష్ స్వయంగా శివపాల్ ఇంటికి వెళ్లి అభినందనలు తెలియజేశారు. అనంతరం అఖిలేష్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో విబేధాల్లేవని, తామందరం ఒక్కటేనని చెప్పారు. రాజకీయాలంటే ఆటలు కాదని, సీరియస్ విషయమని అన్నారు. యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై అఖిలేష్ వేటువేయడంతో అబ్బాయ్, బాబాయ్ మధ్య వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ములయాం జోక్యం చేసుకుని పలుమార్లు కొడుకు అఖిలేష్, తమ్ముడు శివపాల్‌తో చర్చించి సమస్యను పరిష్కరించారు. మంత్రి పదవికి శివపాల్ చేసిన రాజీనామాను అఖిలేష్ తిరస్కరించడంతో పాటు ఆయన్నుంచి వెనక్కు తీసుకున్న శాఖలను మళ్లీ అప్పగిస్తున్నట్ట ప్రకటించారు. అలాగే ములయాంకు సన్నిహితుడైన ప్రజాపతిని మళ్లీ కేబినెట్లోకి తీసుకున్నట్టు తెలిపారు. -
సీఎంను కలిసేందుకు వచ్చి విషం తాగాడు!
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ నివాసం వద్ద ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి సీఎం అఖిలేశ్‌ను కలిసేందుకు.. లక్నోలోని ఆయన నివాసం వద్ద పడిగాపులు కాశాడు. ఎంత వేచిచూసినా అతనికి సీఎంను కలిసే అవకాశం రాలేదు. దీంతో విసిగిపోయిన అతడు తన వెంట తెచ్చుకున్న విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీనిని స్థానికులు గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు లక్నోలో సీఎం అఖిలేశ్ విద్యార్థుల సద్భావన యాత్రకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్ర జమ్మూ కశ్మీర్ వరకు సాగనుంది.