అఖిలేష్ యాదవ్కు సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లేకుంటే, పదవిలో ఉండేందుకు అనర్హులని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కు సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లేకుంటే, సీఎం పదవిలో ఉండేందుకు అనర్హులని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అఖిలేష్ సీఎం పదవికి రాజీనామా చేయాలని, అసెంబ్లీని రద్దు చేసి వెంటనే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములయాం సింగ్ యాదవ్ కుటుంబంలో ఏర్పడ్డ విబేధాలపై ఆయన స్పందించారు.
వ్యక్తిగత ప్రయోజనాలు, అధికారం కోసం జరుగుతున్న పోరాటంలో ఎస్పీ కార్యకర్తలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని మౌర్య విమర్శించారు. సమాజ్వాదీ పార్టీలో, అఖిలేష్ ప్రభుత్వంలో జరుగుతున్న హైడ్రామా బజారున పడిందని, ఇది శాంతిభద్రతలకు సవాల్గా మారిందని చెప్పారు. అఖిలేష్ సీఎం పదవి హోదాకు భంగం కలిగించారని మౌర్య అన్నారు. అఖిలేష్కు ఆయన బాబాయ్, యూపీ కేబినెట్ మంత్రి శివపాల్ యాదవ్కు విబేధాలు ఏర్పడటం, పార్టీ చీఫ్ ములయాం జోక్యం చేసుకుని రాజీ చేసిన సంగతి తెలిసిందే.