యూపీ ముఖ్యమంత్రి... మరో చాయ్‌వాలా?
2014లో ఉత్తరప్రదేశ్‌లో మోదీ ప్రభంజనం వీచి.. రాష్ట్రంలోని 80 లోక్‌సభ స్థానాల్లో 73 సీట్లను ఆ పార్టీ గెలుపొందుతుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు మూడేళ్ల తర్వాత తిరిగి చూస్తే అదే మ్యాజిక్‌ను బీజేపీ పునరావృతం చేసింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండొంతుల స్థానాలను గెలుపొందింది. నాడు చాయ్‌వాలాగా పేరొందిన నరేంద్రమోదీ ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టారు. నేడు యూపీ అధినేతగా మరో చాయ్‌వాలా పగ్గాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 80శాతం సీట్లు గెలుపొందడం వెనుక ఒక 'చాయ్‌వాలా' కృషి ఉంది. ఆయనే కేశవ్‌ప్రసాద్ మౌర్య.
చాయ్‌వాలా నుంచి ప్రస్థానం..!
యూపీ కౌశంబి జిల్లాలోని ఓ పేద రైతు కుటుంబంలో కేశవ్ ప్రసాద్ మౌర్య జన్మించారు. ఆయన బాల్యమంతా పేదరికంలోనే గడిచిపోయింది. ప్రధాని మోదీలాగే కుటుంబానికి అండగా ఉండేందుకు మౌర్య కూడా టీ స్టాల్‌లో పనిచేశారు. న్యూస్‌పేపర్లు అమ్మారు. మారుమూల గ్రామాల్లో, పట్టణాల్లో టీ అమ్ముకొని జీవించడమంటే ఇప్పుడు రాజకీయాల్లో అదేమీ నామోషి కాదు. గుజరాత్ నుంచి వచ్చిన మోదీ తాను చాయ్ అమ్మిననాటి నిరాడంబర నేపథ్యాన్ని పదేపదే గుర్తుచేసుకుంటారు. అదేవిధంగా మౌర్య బాల్యంలో తాను అమ్ముకొని జీవితం వెళ్లదీసిన రోజులను గర్వంగా చెప్పుకుంటారు. ఈ విషయంలో తనకు, ప్రధాని మోదీతో సారూప్యముందని సంతోషపడతారు.
రాజకీయ ప్రస్థానం..!
చిన్నప్పటినుంచే మౌర్య ఆరెస్సెస్ బాల స్వయం సేవక్‌లో కొనసాగారు. ఆ తర్వాత విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), బజరంగ్ దళ్‌కు అనుబంధంగా పనిచేశారు. 12 ఏళ్లు ఈ రెండు సంస్థల్లో కొనసాగిన ఆయన వీహెచ్‌పీ సిద్ధాంతకర్త అశోక్‌సింఘాల్‌కు సన్నిహితుడిగా ముద్రపడ్డారు. ఆవేశపూరితమైన ఉపన్యాసాలకు పేరొందిన మౌర్య.. అయోధ్య, గోరక్షణ ఉద్యమాల్లో జైలుకు కూడా వెళ్లారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో అలహాబద్ సిరాతు సీటు నుంచి గెలుపొందిన ఆయన.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో.. దేశ ప్రథమ ప్రధాని నెహ్రూ నియోజకవర్గమైన ఫూల్‌పూర్ నుంచి విజయం సాధించారు. 2016 ఏప్రిల్‌లో మౌర్య యూపీ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు.
విజయం వెనుక మౌర్య పాత్ర ఏమిటి?
యూపీలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయం వెనుక యాదవేతర ఓబీసీలు, జాటవేతర దళితులు కీలక పాత్ర పోషించారు. ఈ విషయాన్ని గుర్తించిన బీజేపీ ఓబీసీ ఉపకులానికి చెందిన మౌర్యకు పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించిన మౌర్య.. యాదవేతర ఓబీసీల మద్దతు బీజేపీకి కూడగట్టడంలో విజయం సాధించారు. కుశ్వాహా, కోయెరి, కుర్మీ, శాక్య, పటేల్ తదితర సామాజిక వర్గాల నేతలకు జిల్లా యూనిట్ చీఫ్ బాధ్యతలను అప్పగించి.. ఆయా వర్గాలను బీజేపీ వైపు తిప్పుకోగలిగారు.
ఇప్పుడు సంపన్నుడే!
ఒకప్పుడు మౌర్య పేదరికంలో ఉన్నారు కానీ, ఇప్పుడు ఆయన సంపన్నుడు. ఆయనకు, ఆయన భార్యకు అలహాబాద్ చుట్టూ కోట్లరూపాయలు విలువచేసే ఆస్తులు ఉన్నాయి. ఆయనపై 11 పోలీసు కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు యూపీ ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లలో మౌర్య కూడా ఉన్నారు. ఓబీసీల్లో గట్టి పట్టున్న నేతగా పేరొందిన మౌర్యకు బీజేపీ అధిష్టానం అవకాశమిస్తుందని ఆయన అనుచరులు భావిస్తున్నారు.