up cm candidate
-
‘మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం’
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిపై మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. సీఎం అభ్యర్థి ఎంపిక జరిగిపోయిందంటూ వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. లక్నోలో ఇవాళ సాయంత్రం ఎమ్మెల్యేలతో సమావేశం అవుతామని వెంకయ్య శనివారమిక్కడ తెలిపారు. ఈ భేటీలోనే శాసనసభ పక్షనేతను ఎన్నుకుంటామని వెంకయ్య వెల్లడించారు. కాగా కేంద్ర పరిశీలకులు వెంకయ్య, భూపీంద్ర సింగ్ సమక్షంలో సమావేశం కానున్న పార్టీ ఎమ్మెల్యేలు సీఎంను నిర్ణయించనున్నారు. ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అధిష్టిస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం రేసులో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, మనోజ్ సిన్హా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్లు వినబడుతున్నా.. తుది ఎంపికపై స్పష్టత రాలేదు. సాయంత్రం నాలుగు గంటలకు సీఎం ఎవరనే దానిపై స్పష్టం రానుంది. అలాగే ఉత్తరప్రదేశ్‌లో రుణమాఫీపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. యూపీలో రుణమాఫీ ప్రకటనతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన శనివారమిక్కడ తేల్చి చెప్పారు. ఆర్థిక వనరులను బట్టి ఆయా రాష్ట్రాలే రుణమాఫీ చేసుకోవాలని వెంకయ్య అన్నారు. ఈ విషయంలో ఉత్తర, దక్షిణ అనే భేదాభిప్రాయాలు తీసుకురావద్దని ఆయన పేర్కొన్నారు. -
యూపీ ముఖ్యమంత్రి... మరో చాయ్‌వాలా?
2014లో ఉత్తరప్రదేశ్‌లో మోదీ ప్రభంజనం వీచి.. రాష్ట్రంలోని 80 లోక్‌సభ స్థానాల్లో 73 సీట్లను ఆ పార్టీ గెలుపొందుతుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు మూడేళ్ల తర్వాత తిరిగి చూస్తే అదే మ్యాజిక్‌ను బీజేపీ పునరావృతం చేసింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండొంతుల స్థానాలను గెలుపొందింది. నాడు చాయ్‌వాలాగా పేరొందిన నరేంద్రమోదీ ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టారు. నేడు యూపీ అధినేతగా మరో చాయ్‌వాలా పగ్గాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 80శాతం సీట్లు గెలుపొందడం వెనుక ఒక 'చాయ్‌వాలా' కృషి ఉంది. ఆయనే కేశవ్‌ప్రసాద్ మౌర్య. చాయ్‌వాలా నుంచి ప్రస్థానం..! యూపీ కౌశంబి జిల్లాలోని ఓ పేద రైతు కుటుంబంలో కేశవ్ ప్రసాద్ మౌర్య జన్మించారు. ఆయన బాల్యమంతా పేదరికంలోనే గడిచిపోయింది. ప్రధాని మోదీలాగే కుటుంబానికి అండగా ఉండేందుకు మౌర్య కూడా టీ స్టాల్లో పనిచేశారు. న్యూస్‌పేపర్లు అమ్మారు. మారుమూల గ్రామాల్లో, పట్టణాల్లో టీ అమ్ముకొని జీవించడమంటే ఇప్పుడు రాజకీయాల్లో అదేమీ నామోషి కాదు. గుజరాత్ నుంచి వచ్చిన మోదీ తాను చాయ్ అమ్మిననాటి నిరాడంబర నేపథ్యాన్ని పదేపదే గుర్తుచేసుకుంటారు. అదేవిధంగా మౌర్య బాల్యంలో తాను అమ్ముకొని జీవితం వెళ్లదీసిన రోజులను గర్వంగా చెప్పుకుంటారు. ఈ విషయంలో తనకు, ప్రధాని మోదీతో సారూప్యముందని సంతోషపడతారు. రాజకీయ ప్రస్థానం..! చిన్నప్పటినుంచే మౌర్య ఆరెస్సెస్ బాల స్వయం సేవక్‌లో కొనసాగారు. ఆ తర్వాత విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), బజరంగ్ దళ్‌కు అనుబంధంగా పనిచేశారు. 12 ఏళ్లు ఈ రెండు సంస్థల్లో కొనసాగిన ఆయన వీహెచ్‌పీ సిద్ధాంతకర్త అశోక్సింఘాల్కు సన్నిహితుడిగా ముద్రపడ్డారు. ఆవేశపూరితమైన ఉపన్యాసాలకు పేరొందిన మౌర్య.. అయోధ్య, గోరక్షణ ఉద్యమాల్లో జైలుకు కూడా వెళ్లారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో అలహాబద్ సిరాతు సీటు నుంచి గెలుపొందిన ఆయన.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో.. దేశ ప్రథమ ప్రధాని నెహ్రూ నియోజకవర్గమైన ఫూల్పూర్ నుంచి విజయం సాధించారు. 2016 ఏప్రిల్‌లో మౌర్య యూపీ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. విజయం వెనుక మౌర్య పాత్ర ఏమిటి? యూపీలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయం వెనుక యాదవేతర ఓబీసీలు, జాటవేతర దళితులు కీలక పాత్ర పోషించారు. ఈ విషయాన్ని గుర్తించిన బీజేపీ ఓబీసీ ఉపకులానికి చెందిన మౌర్యకు పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించిన మౌర్య.. యాదవేతర ఓబీసీల మద్దతు బీజేపీకి కూడగట్టడంలో విజయం సాధించారు. కుశ్వాహా, కోయెరి, కుర్మీ, శాక్య, పటేల్ తదితర సామాజిక వర్గాల నేతలకు జిల్లా యూనిట్ చీఫ్ బాధ్యతలను అప్పగించి.. ఆయా వర్గాలను బీజేపీ వైపు తిప్పుకోగలిగారు. ఇప్పుడు సంపన్నుడే! ఒకప్పుడు మౌర్య పేదరికంలో ఉన్నారు కానీ, ఇప్పుడు ఆయన సంపన్నుడు. ఆయనకు, ఆయన భార్యకు అలహాబాద్ చుట్టూ కోట్లరూపాయలు విలువచేసే ఆస్తులు ఉన్నాయి. ఆయనపై 11 పోలీసు కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు యూపీ ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లలో మౌర్య కూడా ఉన్నారు. ఓబీసీల్లో గట్టి పట్టున్న నేతగా పేరొందిన మౌర్యకు బీజేపీ అధిష్టానం అవకాశమిస్తుందని ఆయన అనుచరులు భావిస్తున్నారు. -
మాకూ సీఎం అభ్యర్థి కావాలి...!
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ను యూపీ సీఎం అభ్యర్థిగా ఆ పార్టీ అధిష్టానం ప్రకటించడం రాష్ట్రపార్టీ ముఖ్యనేతలకు కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టింది. ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించడం, వయోవృద్ధులను కీలక పదవుల్లో నియమించడం వంటి వాటికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.అయితే షీలా దీక్షిత్ విషయంలో ఆ రెండింటికీ తూచ్ అనడం వారిలో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీకి సంబంధించి ఇక ప్రయోగాలు చేయొద్దని కాంగ్రెస్ హైకమాండ్‌తో రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలు మొరపెట్టుకుంటున్నారట... రాష్ట్ర నాయకత్వం నియామకం విషయంలో అనుసరించిన విధానాలు, పద్ధతులను పక్కన పెట్టి సంప్రదాయ పద్ధతుల్లో కొత్త నేతను నియమించాలని విన్నవించుకుంటున్నారట. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని అర్థం చేసుకోకుండా హైకమాండ్ వ్యవహరిస్తే మాత్రం పార్టీలోని వారు ఎవరికి వారే యమునా తీరే చందం కావడం తథ్యమని పనిలో పనిగా హెచ్చరించేస్తున్నారట. అందువల్ల పార్టీలో సీనియర్‌నేత, మాజీ కేంద్ర మంత్రి అయిన ఎస్.జైపాల్‌రెడ్డిని టీపీసీసీ పగ్గాలు అప్పగిస్తే తెలంగాణలో పార్టీ దానంతట అదే సర్దుకుంటుందని కూడా నాయకత్వం చెవిలో ముఖ్యనేత ఒకరు ఒకటే రొదపెడుతున్నారట. ఇతర పార్టీల నుంచి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న వారిలో విశ్వాసాన్ని కలిగించేందుకు, అధికారపార్టీ టీఆర్ఎస్కు చెక్ పెట్టేందుకు, పార్టీని నడిపించేందుకు జైపాల్‌రెడ్డి వంటి నేత ఉంటే అంతా సర్దుకుం టుందని బల్లగుద్ది మరీ చెబుతున్నారట. తాము కూడా క్రియాశీలంగా వ్యవహరించి పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేలా కృషి చేసేందుకు ఇది దోహదపడుతుందంటూ రాష్ట్ర నాయకులు చేస్తున్న వాదనపై అధిష్టానం కూడా ఒకింత సానుకూల ధోరణిలోనే ఉన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది..! -
తెరపైకి షీలా దీక్షిత్ పేరు?
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ పేరు తెరపైకి వచ్చింది. ఆమెను సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశముందని కాంగ్రెస్ పార్టీ ఉన్నత వర్గాలు వెల్లడించాయి. గురువారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఆమె భేటీ కావడంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి. కమల్ నాథ్ స్థానంలో పంజాబ్ కాంగ్రెస్ ఇంచార్జిగా ఆమె నియమించే అవకాశముందని మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై మాట్లాడేందుకు షీలా దీక్షిత్ నిరాకరించారు. పంజాబ్ ఇంచార్జిగా ఉండేందుకు కమల్ నాథ్ విముఖత చూపారు. కాగా, యూపీ సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీ, గులాం నబీ ఆజాద్ పేర్లు ఇంతకుముందు వినిపించాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నికలకు ముందే ప్రకటించి కొత్త సంప్రదాయానికి తెర తీయాలని కాంగ్రెస్ భావిస్తోంది. 'ఎన్నికలకు ముందు మా వ్యూహాన్ని, అభ్యర్థిని ప్రకటిస్తాం' అని యూపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ ఆజాద్ ఇంతకుముందే తెలిపారు.