‘మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం’
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ‍్యర్థిపై మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. సీఎం అభ్యర్థి ఎంపిక జరిగిపోయిందంటూ వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. లక్నోలో ఇవాళ సాయంత్రం ఎమ్మెల్యేలతో సమావేశం అవుతామని వెంకయ్య శనివారమిక్కడ తెలిపారు. ఈ భేటీలోనే శాసనసభ పక్షనేతను ఎన్నుకుంటామని వెంకయ్య వెల్లడించారు.
కాగా కేంద్ర పరిశీలకులు వెంకయ్య, భూపీంద్ర సింగ్ సమక్షంలో సమావేశం కానున్న పార్టీ ఎమ్మెల్యేలు సీఎంను నిర్ణయించనున్నారు. ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అధిష్టిస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం రేసులో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, మనోజ్ సిన్హా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్లు వినబడుతున్నా.. తుది ఎంపికపై స్పష్టత రాలేదు. సాయంత్రం నాలుగు గంటలకు సీఎం ఎవరనే దానిపై స్పష్టం రానుంది.
అలాగే ఉత్తరప్రదేశ్‌లో రుణమాఫీపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. యూపీలో రుణమాఫీ ప్రకటనతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన శనివారమిక్కడ తేల్చి చెప్పారు. ఆర్థిక వనరులను బట్టి ఆయా రాష్ట్రాలే రుణమాఫీ చేసుకోవాలని వెంకయ్య అన్నారు. ఈ విషయంలో ఉత్తర, దక్షిణ అనే భేదాభిప్రాయాలు తీసుకురావద్దని ఆయన పేర్కొన్నారు.