రుణమాఫీ ఫ్యాషనైపోయింది
వెంకయ్య వివాదాస్పద వ్యాఖ్యలు..విపక్షాల మండిపాటు
న్యూఢిల్లీ/ముంబై: రుణమాఫీ కోరడం ఫ్యాషనైపోయిందంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గురువారం చేసిన వ్యాఖ్యలు వివా దాస్పదం అయ్యాయి. వెంకయ్య వ్యాఖ్యలను పలు పార్టీల నేతలు ఖండించారు. అనంతరం తన పొరపాటును గుర్తించిన వెంకయ్య, ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. రుణమాఫీ కోరడం రాజకీయ పార్టీలకు ఫ్యాషనైపోయిందని తాను అన్నాననీ, రైతులను ఉద్దేశించి కాదని ఆయన స్పష్టం చేశారు. రుణమాఫీ వంటి స్వల్పకాలిక ప్రయోజనాలను ఇచ్చే వాటిని రాజకీయ పార్టీలు కోరడం మానేసి నిర్మాణాత్మక విధాన మార్పులను తీసుకురావడానికి కృషి చేయాలని వెంకయ్య పిలుపునిచ్చారు.
అంతకుముందు వెంకయ్య ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘రుణ మాఫీ కోరడం ఈ రోజుల్లో ఫ్యాషనైపోయింది. కానీ సమస్యకు అది పరిష్కారం కాదు. గత్యంతరం లేకపోతే తప్ప రుణమాఫీ చేయకూడదు’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్, శివసేన, ఆప్, వామపక్షాలు, సమాజ్‌వాదీ తదితర పార్టీలు మండిపడ్డాయి. బీజేపీ మిత్రపక్షమైన శివసేన వెంకయ్య వ్యాఖ్యలను అవమానకర, దురదృష్టకరమైనవిగా పేర్కొంది. ‘ఈ వ్యాఖ్యలు చేసే ముందు వెంకయ్య ఫ్యాషన్ షోకు గానీ వెళ్లి వస్తున్నారా? రైతులకు గిట్టుబాటు ధర దక్కక దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు.
ప్రభుత్వం రైతులకు వేతనాలు ఇవ్వట్లేదు. అందుకే రుణమాఫీ కోరుతున్నారు’ అని మహారాష్ట్ర మంత్రి దివాకర్ రౌతే అన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా మాట్లాడుతూ ‘రైతులు ప్రతిరోజూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే... వారి దుస్థితి వెంకయ్యకు ఫ్యాషన్‌లా కనిపిస్తోంది. అంతటి సీనియర్ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బీజేపీకి సిగ్గుచేటు’ అని అన్నారు. ధనికుల రుణాలను మాఫీ చేసినప్పుడు కనిపించని ఫ్యాషన్ రైతుల అప్పులను రద్దు చేయాలంటే కనిపిస్తోందా? అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు.