అన్ని రాష్ట్రాల మాదిరే ఏపీ, తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో తాము హామీ ఇచ్చి ఉన్నట్లయితే.. ఈ విషయంలో రాష్ట్రాలకు సాయం చేయడానికి కేంద్రం ముందుకొచ్చి ఉండేదని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ప్రస్తుతం ఈ విషయంలో సాయం చేయడంపై కేంద్రం అన్ని రాష్ట్రాల పట్ల ఎలా వ్యవహరిస్తుందో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయంలోనూ అంతేనని వ్యాఖ్యానించారు. పార్టీ నేతలు బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, కె.లక్ష్మణ్, చింతల రాంచంద్రారెడ్డి, ఎన్.రామచంద్రరావు, యడ్లపాటి రఘునాథబాబు తదితరులతో కలిసి ఆయన ఆదివారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులడిగిన ఓ ప్రశ్నకు పైవిధంగా బదులిచ్చారు.
ఉమ్మడి సమస్యలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కలిసి కూర్చొని చర్చించుకుంటే మంచిదని వెంకయ్య సలహా ఇచ్చారు. రెండు ప్రభుత్వాలు అభివృద్ధి, ప్రజలకిచ్చిన హామీల అమలుపైనే ప్రధానంగా దృష్టి పెట్టాలన్నారు. తెలుగువాడిగా, కేంద్రమంత్రిగా ఇది తన అభిప్రాయం మాత్రమేనన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలుకు 1956 స్థానికత నిబంధన తీసుకురావడంపై మాట్లాడనంటూనే. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా విద్యార్థులకు ఇబ్బంది కలిగించని రీతిన వ్యవహరించాలన్నారు. విద్యార్థులు చదువుకునేచోట ఒక విద్యార్థికి ప్రభుత్వపరంగా అందే అన్ని సౌకర్యాలను మిగిలిన వారికీ కల్పించడం సమన్యాయం అవుతుందన్నారు.
రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే.. ఏపీ కొత్త రాజధాని ఎక్కడనేది పూర్తిగా రాష్ట్రప్రభుత్వ నిర్ణయం మేరకు ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. కేంద్రం జోక్యం చేసుకోబోదని, ఒత్తిడి తీసుకురాదని స్పష్టం చేశారు.