తెరపైకి షీలా దీక్షిత్ పేరు?
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ పేరు తెరపైకి వచ్చింది. ఆమెను సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశముందని కాంగ్రెస్ పార్టీ ఉన్నత వర్గాలు వెల్లడించాయి. గురువారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఆమె భేటీ కావడంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి. కమల్ నాథ్ స్థానంలో పంజాబ్ కాంగ్రెస్ ఇంచార్జిగా ఆమె నియమించే అవకాశముందని మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై మాట్లాడేందుకు షీలా దీక్షిత్ నిరాకరించారు. పంజాబ్ ఇంచార్జిగా ఉండేందుకు కమల్ నాథ్ విముఖత చూపారు.
కాగా, యూపీ సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీ, గులాం నబీ ఆజాద్ పేర్లు ఇంతకుముందు వినిపించాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నికలకు ముందే ప్రకటించి కొత్త సంప్రదాయానికి తెర తీయాలని కాంగ్రెస్ భావిస్తోంది. 'ఎన్నికలకు ముందు మా వ్యూహాన్ని, అభ్యర్థిని ప్రకటిస్తాం' అని యూపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ ఆజాద్ ఇంతకుముందే తెలిపారు.