మాకూ సీఎం అభ్యర్థి కావాలి...!
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ను యూపీ సీఎం అభ్యర్థిగా ఆ పార్టీ అధిష్టానం ప్రకటించడం రాష్ట్రపార్టీ ముఖ్యనేతలకు కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టింది. ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించడం, వయోవృద్ధులను కీలక పదవుల్లో నియమించడం వంటి వాటికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.అయితే షీలా దీక్షిత్ విషయంలో ఆ రెండింటికీ తూచ్ అనడం వారిలో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తోంది.
ఈ నేపథ్యంలో టీపీసీసీకి సంబంధించి ఇక ప్రయోగాలు చేయొద్దని కాంగ్రెస్ హైకమాండ్‌తో రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలు మొరపెట్టుకుంటున్నారట... రాష్ట్ర నాయకత్వం నియామకం విషయంలో అనుసరించిన విధానాలు, పద్ధతులను పక్కన పెట్టి సంప్రదాయ పద్ధతుల్లో కొత్త నేతను నియమించాలని విన్నవించుకుంటున్నారట. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని అర్థం చేసుకోకుండా హైకమాండ్ వ్యవహరిస్తే మాత్రం పార్టీలోని వారు ఎవరికి వారే యమునా తీరే చందం కావడం తథ్యమని పనిలో పనిగా హెచ్చరించేస్తున్నారట.
అందువల్ల పార్టీలో సీనియర్‌నేత, మాజీ కేంద్ర మంత్రి అయిన ఎస్.జైపాల్‌రెడ్డిని టీపీసీసీ పగ్గాలు అప్పగిస్తే తెలంగాణలో పార్టీ దానంతట అదే సర్దుకుంటుందని కూడా నాయకత్వం చెవిలో ముఖ్యనేత ఒకరు ఒకటే రొదపెడుతున్నారట. ఇతర పార్టీల నుంచి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న వారిలో విశ్వాసాన్ని కలిగించేందుకు, అధికారపార్టీ టీఆర్‌ఎస్‌కు చెక్ పెట్టేందుకు, పార్టీని నడిపించేందుకు జైపాల్‌రెడ్డి వంటి నేత ఉంటే అంతా సర్దుకుం టుందని బల్లగుద్ది మరీ చెబుతున్నారట. తాము కూడా క్రియాశీలంగా వ్యవహరించి పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేలా కృషి చేసేందుకు ఇది దోహదపడుతుందంటూ రాష్ట్ర నాయకులు చేస్తున్న వాదనపై అధిష్టానం కూడా ఒకింత సానుకూల ధోరణిలోనే ఉన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది..!