చుక్క పెడితే సమాప్తం అని కాదు. ఆఖరి చరణం పాడితే అది చరమ గీతం కాదు. ‘కట్’ అంటే ప్యాకప్ కాదు. ముకుళిత హస్తాలకు అర్థం ఇక సెలవని కాదు. అంతమే లేని వాటికి మధ్య మధ్య విరామాలు, ఆగి అలుపు తీర్చుకుంటున్న అలలు. ఈ ఏడాది సాహిత్య, సంగీత, సినీ, రాజకీయ, ఆథ్యాత్మిక రంగాలలోని కొందరు సుప్రసిద్ధ మహిళల్ని కోల్పోయాం. వాళ్లు లేని లోటు తీరనిదే అయినా, వాళ్లు మిగిల్చి వెళ్లినది తరగనిది.
కృష్ణాసోబ్తీ, రచయిత్రి
ప్రముఖ హిందీ రచయిత్రి, జ్ఞానపీఠ్, సాహిత్య అకాడమీ పురస్కారాల గ్రహీత అయిన కృష్ణా సోబ్తీ(93) ఢిల్లీలో జనవరి 25న కన్నుమూశారు. కృష్ణాసోబ్తీ రచించిన ‘మిత్రో మర్జానీ’ భారత సాహిత్యంలో నూతన శైలిని ప్రతిబింబిస్తుందని సాహితీప్రియులు అంటారు. కృష్ణాసోబ్తీ 2010 లో ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని తిరస్కరించి వార్తల్లో నిలిచారు. ఒక సృజనశీలిగా ప్రభుత్వ గుర్తింపులకు దూరంగా ఉండాలన్నది తన ఉద్దేÔ¶ మని ఆ సందర్భంగా ఆమె అన్నారు.
వింజమూరి అనసూయాదేవి, గాయని
ప్రముఖ జానపద, శాస్త్రీయ లలిత సంగీత గాయని, ప్రఖ్యాత కవి దేవులపల్లి కృష్ణశాస్తి మేనకోడలు వింజమూరి అనసూయాదేవి (99) అమెరికాలోని హ్యూస్టన్‌లో మార్చి 24 న తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 1920 మే 12న జన్మించిన అనసూయాదేవి ఆలిండియా రేడియో ద్వారా జానపద గీతాలకు ఎనలేని ప్రాచుర్యం కల్పించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన దేశభక్తి గీతం ‘జయజయజయ ప్రియ భారత’ పాటకు బాణీ కట్టింది అనసూయాదేవే.
విజయనిర్మల, సినీ నటి
ప్రముఖ నటి, దర్శకురాలు, సినీ నటుడు కృష్ణ సతీమణి ఘట్టమనేని విజయనిర్మల (73) జూన్ 26న తుదిశ్వాస విడిచారు. 1946 ఫిబ్రవరి 20న గుంటూరు జిల్లా నరసరావుపేటలో విజయనిర్మల జన్మించారు. పాండురంగ మహత్యం సినిమాతో చిత్రరంగంలో ప్రవేశించారు. 1971లో తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఆమె అసలు పేరు నిర్మల కాగా.. తనకు సినీరంగంలో తొలి అవకాశమిచ్చిన విజయా స్టూడియోకు కృతజ్ఞతగా విజయనిర్మల అని పేరు మార్చుకున్నారు.
షీలా దీక్షిత్, మాజీ ముఖ్యమంత్రి
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షీలా దీక్షిత్ (81) జూలై 20న కన్నుమూశారు. పంజాబ్‌లోని కపుర్తలాలో 1938 మార్చి 31వ తేదీన షీలా కపూర్ (షీలా దీక్షిత్) జన్మించారు. 1984–89 సంవత్సరాల మధ్య ఐక్యరాజ్య సమితిలో భారత్ రాయబారిగా షీలా సేవలందించించారు. రాజీవ్ హయాం లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1998 నుంచి వరసగా మూడు ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికై తిరుగులేని నేతగా ఎదిగారు. 2014లో కేరళ గవర్నర్‌గా అయిదు నెలలు కొనసాగారు.
మాంటిస్సోరి కోటేశ్వరమ్మ, విద్యాసంస్థల వ్యవస్థాపకురాలు
విజయవాడ మాంటిస్సోరి విద్యా సంస్థల వ్యవస్థాపకురాలు, అభ్యుదయవాది, స్త్రీ విద్య, మహిళా సాధికారతకు విశేష కృషి చేసిన డాక్టర్ వి.కోటేశ్వరమ్మ(94) జూన్ 30న విజయవాడలో కన్ను మూశారు. విజయవాడ సమీపంలోని గోశాలలో కోనేరు వెంకయ్య, మీనాక్షి దంపతులకు 1925 మార్చి 5న కోటేశ్వరమ్మ జన్మించారు. తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ చేసి నెల్లూరు, విజయవాడల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. మహిళలు చదువుకుంటేనే పురుషులతో సమానంగా రాణిస్తారన్న నమ్మకంతో 1955లో చిల్డన్స్ర్ మాంటిస్సోరి స్కూళ్లను స్థాపించారు.
ఛాయాదేవి, సాహితీవేత్త
ప్రముఖ సాహితీవేత్త, కథా రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి (85) జూన్ 28న హైదరాబాద్ లోని చండ్ర రాజేశ్వర్‌రావు వృద్ధాశ్రమంలో కన్నుమూశారు. గతంలో ఆమె కోరిన మేరకు ఆమె భౌతిక కాయాన్ని ఈఎస్‌ఐ వైద్య కళాశాలకు అప్పగించారు. అలాగే కళ్లను ఎల్వీ ప్రసాద్ వైద్యులు సేకరించారు. 1933 అక్టోబర్ 13న రాజమండ్రిలో మద్దాల వెంకటాచలం, రమణమ్మ దంపతులకు ఛాయదేవి జన్మించారు. ప్రముఖ రచయిత, విమర్శకుడు, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు అబ్బూరి వరదరాజేశ్వరరావు ఆమె భర్త. ఆయన చాలాకాలం క్రితమే చనిపోయారు. ఛాయాదేవి ఎన్నో కథలు రాశారు. బోన్‌సాయ్ బ్రతుకు అనే కథని 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో పెట్టింది. ఆమె రాసిన ’తన మార్గం’ కథా సంపుటికి 2005 లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. స్త్రీల జీవితాల్లోని దృక్కోణాలను తన కథల్లో ఛాయాదేవి ఆవిష్కరించారు.
కాంచన్ చౌదరి, తొలి మహిళా డీజీపీ
కాంచన్ చౌదరి భట్టాచార్య (72) ఆగస్టు 26న ముంబైలో కన్నుమూశారు. 1973 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన కాంచన్ దేశంలో తొలి మహిళా డీజీపీగా చరిత్ర సృష్టించారు. కిరణ్ బేడీ తరువాత దేశంలో రెండో మహిళా ఐపీఎస్ అధికారిగా నిలిచారు. హిమాచల్ ప్రదేశ్‌లో జన్మించిన కాంచన్ 2004 నుంచి 2007 అక్టోబర్ 31 వరకు ఉత్తరాఖండ్ డీజీపీగా పని చేశారు. సీఐఎస్‌ఎఫ్ అధిపతిగానూ పనిచేశారు.
సుష్మా స్వరాజ్, కేంద్ర మాజీమంత్రి
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ (67) ఆగస్టు 6న కన్ను మూశారు. 1952 ఫిబ్రవరి 14న హరియాణాలోని అంబాలాలో సుష్మ జన్మించారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి న్యాయవిద్య ముగించారు. 1975 జూలై 13న స్వరాజ్ కౌశల్‌ను వివాహమాడారు. కొన్నాళ్లు సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. 1977లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సుష్మ 1998లో ఢిల్లీ సీఎం అయ్యారు. 1996లో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు.
గీతాంజలి, నటి
ప్రముఖ నటి గీతాంజలి (72) అక్టోబర్ 31న కన్నుమూశారు. 1947లో కాకినాడలో జన్మించిన గీతాంజలి అసలు పేరు మణి. 1961లో ‘సీతారామ కల్యాణం’తో కథానాయికగా పరిచమయ్యారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ భాషలన్నిటిలో కలిపి 300 కు పైగా చిత్రాల్లో నటించారు. దేవత, సంబరాల రాంబాబు, పంతాలు పట్టింపులు, శ్రీకృష్ణ పాండవీయం, పొట్టి ప్లీడరు, తోడు నీడ వంటి చిత్రాలు గీతాంజలికి మంచి గుర్తింపును తెచ్చాయి.
నానమ్మాళ్, యోగా శిక్షకురాలు
తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన యోగా శిక్షకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత వి. నానమ్మాళ్ (99) అక్టోబర్ 26న కన్నుమూశారు. నానమ్మాళ్ కోయంబత్తూరు జిల్లా పొళ్లాచ్చి సమీపంలో ఉన్న జమీన్ కాళియపురంలో 1920లో రైతు కుటుంబంలో జన్మించారు. తాత మన్నర్‌స్వామి వద్ద యోగా శిక్షణ తీసుకున్న ఆమె.. చనిపోయే వరకు కఠినమైన యోగాసనాలు వేశారు. నానమ్మాళ్ వద్ద శిక్షణ పొందిన 600 మంది ప్రపంచవ్యాప్తంగా యోగా శిక్షకులుగా పనిచేస్తున్నారు. వీరిలో 36 మంది ఆమె కుటుంబసభ్యులే ఉన్నారు. నానమ్మాళ్‌ను కేంద్ర ప్రభుత్వం 2018లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment