s.jaipal reddy
-
మాకూ సీఎం అభ్యర్థి కావాలి...!
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ను యూపీ సీఎం అభ్యర్థిగా ఆ పార్టీ అధిష్టానం ప్రకటించడం రాష్ట్రపార్టీ ముఖ్యనేతలకు కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టింది. ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించడం, వయోవృద్ధులను కీలక పదవుల్లో నియమించడం వంటి వాటికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.అయితే షీలా దీక్షిత్ విషయంలో ఆ రెండింటికీ తూచ్ అనడం వారిలో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీకి సంబంధించి ఇక ప్రయోగాలు చేయొద్దని కాంగ్రెస్ హైకమాండ్‌తో రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలు మొరపెట్టుకుంటున్నారట... రాష్ట్ర నాయకత్వం నియామకం విషయంలో అనుసరించిన విధానాలు, పద్ధతులను పక్కన పెట్టి సంప్రదాయ పద్ధతుల్లో కొత్త నేతను నియమించాలని విన్నవించుకుంటున్నారట. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని అర్థం చేసుకోకుండా హైకమాండ్ వ్యవహరిస్తే మాత్రం పార్టీలోని వారు ఎవరికి వారే యమునా తీరే చందం కావడం తథ్యమని పనిలో పనిగా హెచ్చరించేస్తున్నారట. అందువల్ల పార్టీలో సీనియర్‌నేత, మాజీ కేంద్ర మంత్రి అయిన ఎస్.జైపాల్‌రెడ్డిని టీపీసీసీ పగ్గాలు అప్పగిస్తే తెలంగాణలో పార్టీ దానంతట అదే సర్దుకుంటుందని కూడా నాయకత్వం చెవిలో ముఖ్యనేత ఒకరు ఒకటే రొదపెడుతున్నారట. ఇతర పార్టీల నుంచి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న వారిలో విశ్వాసాన్ని కలిగించేందుకు, అధికారపార్టీ టీఆర్ఎస్కు చెక్ పెట్టేందుకు, పార్టీని నడిపించేందుకు జైపాల్‌రెడ్డి వంటి నేత ఉంటే అంతా సర్దుకుం టుందని బల్లగుద్ది మరీ చెబుతున్నారట. తాము కూడా క్రియాశీలంగా వ్యవహరించి పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేలా కృషి చేసేందుకు ఇది దోహదపడుతుందంటూ రాష్ట్ర నాయకులు చేస్తున్న వాదనపై అధిష్టానం కూడా ఒకింత సానుకూల ధోరణిలోనే ఉన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది..! -
'సుష్మను డమ్మీ... అద్వానీని మమ్మీ చేశారు'
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. ఆ పార్టీలో కురువృద్ధుడు ఎల్ కే అద్వానీని మమ్మీ... సీనియర్ నేత, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్లను డమ్మీ చేశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మోదీ అసాధ్యమైన వాగ్దానాలు చేసి... అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారని జైపాల్ రెడ్డి విమర్శించారు. అసాధ్య హామీలను నెరవేర్చడంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ విఫలమయ్యారన్నారు. అబద్ధాలు చెప్పడంలో వారికి వారే సాటి అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ మొదటి నుంచి బీజేపీతో జత కట్టాలనుకున్నారని జైపాల్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాశ్మీర్ టెర్రరిస్టుల సాయంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీకి దేశ భక్తి ఎంత ఉందో దీని ద్వారా అర్థమవుతుందన్నారు. పాకిస్థాన్ విషయంలో మోదీ ఎన్నికల ముందు ప్రదర్శించిన దేశభక్తి ఇప్పుడు చూపడంలేదని జైపాల్‌రెడ్డి విమర్శించారు. -
జైపాల్‌రెడ్డితో కేసీఆర్ మంతనాలు
అపాయింటెడ్ డేను త్వరగా ప్రకటించేలా చూడాలని వినతి సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు బుధవారం ఉదయం హైదరాబాద్‌కు బయలుదేరే ముందు కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారని తెలిసింది. సుమారు 15 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో ఆయన ప్రధానంగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను త్వరితగతిన ముగించేలా చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరినట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అపాయింటెడ్ డేను ప్రకటించేలా చూడాలని, అలా అయితేనే ఎన్నికల్లో రెండు పార్టీలకు లబ్ధి చేకూరుతుందని, లేనిపక్షంలో ప్రజల్లో ఇంకా తెలంగాణ ఏర్పడలేదనే భావన ఉంటుందని వివరించినట్లు తెలిసింది. అది జరిగితే ప్రతిపక్షాలు దీన్ని అవకాశంగా తీసుకొని తప్పుడు ప్రచారం చేస్తాయని, అదే జరిగితే ఎన్నికల్లో నష్టం తప్పదని కేసీఆర్ వివరించినట్లు సమాచారం. దీనిపై సానుకూలంగా స్పందించిన జైపాల్‌రెడ్డి... ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అపాయింటెడ్ డేను ప్రకటించాలని తన స్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని తెలిపినట్లు చెబుతున్నారు. ప్రభుత్వంలోని పెద్దలతో ఈ విషయమై తానిప్పటికే టచ్‌లో ఉన్నానని, రెండు మూడు రోజుల్లో రాష్ట్రపతి సంతకం పెడతారనే సమాచారం ఉందని ఆయన వివరించినట్లు తెలిసింది. -
జైపాల్‌రెడ్డికే మళ్లీ చేవెళ్ల టికెట్
చేవెళ్ల, న్యూస్‌లైన్: చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి మళ్లీ పోటీచేసే అవకాశం ఉందని మేడ్చల్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక మోడల్ స్కూల్లో లీడ్ఇండియా ఆధ్వర్యంలో టీచర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధిష్టానం చేవెళ్ల ఎంపీ టికెట్‌ను మళ్లీ జైపాల్‌రెడ్డికే ఇచ్చేందు కు సుముఖంగా ఉన్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. ఒకవేళ ఆయన పోటీ చేయటానికి నిరాకరిస్తే తప్ప మరొకరికి అవకాశం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. జైపాల్‌రెడ్డి తిరిగి పోటీచేసే అవకాశం ఉన్నందువల్లే ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన పరిశీలకుల ముందు ఆశావహులు చాలామంది దరఖాస్తు చేసుకోలేదని పేర్కొన్నారు. కొంతమంది డబ్బున్న నాయకులు పదవులకోసం ఆరాట పడుతున్నారని, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎన్నికలను చూస్తే అవగతమవుతోందని ఆయన స్పష్టంచేశారు. అవినీతిపరులకు, పలు కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న వారికి టికెట్లు ఇవ్వరాదని అధిష్టానం ఇప్పటికే నిర్ణయించిందని ఆయన గుర్తుచేశారు. లీడ్ఇండియా ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో లీడ్ ఇండియా ఆధ్వర్యంలో సామాజిక చైతన్య కార్యక్రమాలను నిర్వహించినట్లు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. టీచర్లకు నిర్వహించిన లీడ్ఇండియా అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సుమారు 20శాతం మంది యువతను మంచి నాయకత్వ లక్షణాలున్న వ్యక్తులుగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. సమాజం లోని కుళ్లును ప్రక్షాళన చేయటానికి యువతరం నడుం బిగించాలని ఆయన పిలుపుని చ్చారు. సేవకులనే నాయకులుగా ఎన్నుకుంటే సమాజం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. -
జైపాల్‌రెడ్డి పోటీచేస్తే స్వాగతిస్తాం
చేవెళ్ల, న్యూస్‌లైన్: చేవెళ్ల పార్లమెంటు స్థానానికి సిట్టింగ్ ఎంపీ, కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి పోటీచేస్తే స్వాగతిస్తామని మాజీ హోంమంత్రి సబితారెడ్డి తనయుడు, యువజన కాంగ్రెస్ నాయకుడు పి.కార్తీక్‌రెడ్డి స్పష్టం చేశారు. చేవెళ్లలోని మార్కెట్‌యార్డులో శుక్రవారం చైర్మన్ మలిపెద్ది వెంకటేశంగుప్త అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండలంలోని కాంగ్రెస్‌పార్టీ సర్పంచులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ ఎంపీ జైపాల్‌రెడ్డి మరోమారు పోటీచేయాలని భావిస్తే అందరం స్వాగతిస్తామని, అందులో ఎలాంటి అనుమానాలు లేవని అన్నారు. ఆయన పోటీచేయకుంటే తాను తప్పనిసరిగా బరిలో ఉంటానన్నారు. జైపాల్‌రెడ్డితోపాటు ఇతర ముఖ్య నాయకుల ఆశీస్సులు కూడా తనకు ఉన్నాయన్నారు. వచ్చేనెల 5వతేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర పునర్మిర్మాణ యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. నగర శివార్లలోని ఆర్మీ మైసమ్మ దేవాలయం నుంచి చేవెళ్ల, వికారాబాద్ మీదుగా తాండూరు వరకు ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. ఎన్నికైన సర్పంచులు ప్రజల ఆశలను వమ్ముచేయకుండా వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. చేవెళ్ల సర్పంచ్ ఎం.నాగమ్మబాల్‌రాజ్, రాష్ట్ర ఎస్సీసెల్ కన్వీనర్ పి.వెంకటస్వామి, డీసీసీబీ వైస్‌చైర్మన్ పి.క్రిష్ణారెడ్డి, డెరైక్టర్ ఎస్.బల్వంత్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశంగుప్త, వైస్‌చైర్మన్ పి.గోపాల్‌రెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వీరేందర్‌రెడ్డి, ఇంద్రన్న యువసేన జిల్లా అధ్యక్షుడు జి.రవికాంత్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు ఎం.బాల్‌రాజ్, పర్మయ్య, మాజీ వైస్ ఎంపీపీ శివానందం, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.యాదగిరి తదితరులు మాట్లాడారు. చేవెళ్ల ఎంపీ టికెట్‌ను దివంగత మాజీ హోంమంత్రి పి.ఇంద్రారెడ్డి వారసుడు కార్తీక్‌రెడ్డికి కేటాయిస్తేనే విజయం తథ్యమని పేర్కొన్నారు. కార్తీక్‌రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలని సమావేశం తీర్మానించింది. మార్కెట్‌కమిటీ డెరైక్టర్లు ఎండీ అలీ, మాధవగౌడ్, పార్వతమ్మ, సర్పంచులు అనురాధ, నాగమ్మ, స్వర్ణ, స్వరూప, అనుసూజ, శశికళ, శ్రీనివాస్‌గౌడ్, జంగారెడ్డి, గోపాల్‌రెడ్డి, వెంకటనర్సింహు లు, హన్మంత్‌రెడ్డి, శ్యామలయ్య, జంగ య్య, మాజీ సర్పంచులు పి.ప్రభాకర్, ఎం.సరస్వతి, నాయకులు జి.చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటేశ్, అమర్నాధ్రెడ్డి, వనం మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
వేడివేడిగా కేబినెట్ సమావేశం
* సీమాంధ్రులను ఉన్నఫళంగా ఎలా పంపిస్తారని ప్రశ్నించిన కావూరి * హైదరాబాద్‌ని యూటీ చేస్తే విభజనకు మాకేం అభ్యంతరం లేదు * రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలని పట్టు * రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలన్న కిశోర్ చంద్రదేవ్ * ఉన్నత విద్యాసంస్థల్లో సీమాంధ్రుల కోటాను పదేళ్లకు పెంచాలన్న పల్లంరాజు * ప్రత్యేక తెలంగాణ 60 ఏళ్లుగా నలుగుతున్న సమస్యని చెప్పిన జైపాల్‌రెడ్డి * అన్ని అంశాలనూ జీవోఎం విస్తృతంగా చర్చించిందని ప్రశంసించిన ప్రధాని * ముగ్గురు మంత్రులు మినహా బిల్లుకు కేబినెట్ ఆమోదం సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రివర్గంలో హాట్‌హాట్‌గా చర్చ జరిగింది. మొత్తం కేబినెట్ సమావేశం మూడున్నరగంటలపాటు సాగగా అందులో 2.15 గంటలపాటు రాష్ట్ర విభజనపై చర్చించారు. ఈ చర్చలో రాష్ట్రానికి చెందిన తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత నలుగురు కేబినెట్ మంత్రులు ఎస్.జైపాల్‌రెడ్డి, కావూరి సాంబశివరావు, వి.కిశోర్ చంద్రదేవ్, ఎం.ఎం.పల్లంరాజుతోపాటు సమావేశానికి హాజరైన ప్రతి ఒక్క మంత్రి పాల్గొనడం గమనార్హం. చివరగా ప్రధాని మన్మోహన్సింగ్ మాట్లాడాక విభజన ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వంలోని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు కేబినెట్ సమావేశం ఈ తీరున సాగింది. గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన సమావేశంలో 6 గంటలవరకు అజెండాలోని ఇతర అంశాలన్నింటినీ చర్చించి నిర్ణయాలు చేసిన తర్వాత రాష్ట్ర విభజన అంశాన్ని చేపట్టారు. మొదటగా కేంద్ర హోంమంత్రి, విభజనపై జీవోఎం సారథి సుశీల్‌కుమార్ షిండే కేబినెట్ నోట్, బిల్లు, జీవోఎం నివేదికలోని ముఖ్యాంశాలను మంత్రివర్గ సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. ఆయన అన్ని విషయాలనూ ఏకరువుపెట్టిన మీదట కేబినెట్ సభ్యుల్లో మొదటగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కావూరి సాంబశివరావు మాట్లాడారు. విభజనపై తన అభ్యంతరాలను చారిత్రక అంశాల సాయంతో 35 నిమిషాలపాటు వినిపించారు. ఆనాడు రాష్ట్ర శాసనసభల్లో తీర్మానం ఆమోదించాకే తాము తెలంగాణతో కలిశామని, ఇక్కడికొచ్చి అభివృద్ధి చేశామని, అలాంటి సీమాంధ్రులను ఉన్నఫళంగా ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. తాము ఇక్కడి వనరుల్ని దోచుకున్నామని అంటున్నారని, కానీ వాస్తవానికి తమకున్నదంతా తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి కోసం పెట్టుబడిగా పెట్టామని వాదించారు. హైదరాబాద్‌ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే విభజనకు తమకేం అభ్యంతరం లేదని, తాము యూటీ చేయమంటున్నది పదేళ్లవరకేనని, శాశ్వతంగా కాదని చెప్పారు. 10 సంవత్సరాలపాటు యూటీగా ఉంచితే అప్పటికల్లా ఆంధ్రప్రదేశ్‌కు పూర్తిస్థాయి రాజధాని ఏర్పాటవుతుందన్నారు. వివాదాస్పద అంశంగా మారిన భద్రాచలం డివిజన్ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, 1959వరకు ఆ ప్రాంతం ఆంధ్ర ప్రాంతంలో ఉన్న సంగతిని గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రం కావాలంటున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తదితరులు సీమాంధ్రులను బెదిరిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌లోని సీమాంధ్రుల భద్రతకు ఎవరు పూచీ ఇస్తారని ప్రశ్నించారు. ఈ సమయంలో జైపాల్‌రెడ్డి ఆయన వాదనకు అడ్డుతగులుతూ, సీమాంధ్రులను వెళ్లగొట్టేలా, వారిని అభద్రతకు గురిచేసేలా పరిస్థితులున్నాయని చెప్పడం సరికాదని, అందుకు తగిన ఉదాహరణను ఒక్కటైనా చూపాలని అన్నట్టు సమాచారం. గోరంతలు కొండంతలు చేసి చెప్పడం తగదని కావూరిని ఉద్దేశించి ఆయనన్నారు. ఎవరో కొందరు నాయకులు రోడ్లపై మాట్లాడిన అంశాలను సీరియస్‌గా ఎలా తీసుకుంటారని, గత నాలుగేళ్లలో సీమాంధ్రుల భద్రతకు సమస్య ఉత్పన్నమైన ఒక్క సంఘటననైనా చూపాలని నిలదీశారు. ఆ తర్వాత కావూరి మళ్లీ మాట్లాడుతూ... రాష్ట్రాన్ని విభజించే పక్షంలో అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణతో కలిపి 12 జిల్లాలతో రాయల తెలంగాణను ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. రాయల తెలంగాణకు వ్యతిరేకంగా బంద్ నిర్వహించారని చెప్పి ఆ ప్రతిపాదనను మార్చేస్తారా? అని ప్రశ్నించారు. ఈ సమయంలో హోంమంత్రి షిండే కలగజేసుకుని రాయల తెలంగాణ ప్రతిపాదనను అసలు ఎప్పుడూ పరిగణనలోకి తీసుకోలేదని, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది పది జిల్లాలతో కూడిన తెలంగాణను ఏర్పాటుచేయాలని మాత్రమేనన్న సంగతిని గుర్తుచేశారు. అయినా సరే కావూరి వినకుండా రాయల తెలంగాణను ఏర్పాటుచేసి తీరాలని పట్టుబట్టారు. ఆ తర్వాత ఆయన, బిల్లు విషయంలో అభ్యంతరం చెబుతూ, ఇంత పెద్ద బిల్లును ముందుపెట్టి ఒక్కసారిగా అభిప్రాయం చెప్పండి, ఆమోదిద్దామనడం సరికాదని, ఒకటిరెండురోజులు సమావేశాన్ని వాయిదావేయాలని, అన్నీ కూలంకషంగా పరిశీలించిన తర్వాత కూర్చుని దానిపై చర్చించవచ్చన్నారు. టేబుల్ ఐటెమ్‌గా బిల్లును, నివేదికను పెట్టి దాన్ని సరిగ్గా చదవకుండానే నిర్ణయం చేయడంపై ఆయన అభ్యంతరపెట్టారు. అలాగే, ఇంత హడావుడిగా ప్రక్రియ పూర్తిచేస్తున్నారు, పార్లమెంట్లో బీజేపీ మద్దతు ఇవ్వకపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాయలసీమను విడదీయవద్దు: కిశోర్‌చంద్రదేవ్ కావూరి తర్వాత సీమాంధ్రకే చెందిన మరో సీనియర్ మంత్రి కిశోర్‌చంద్రదేవ్ మాట్లాడారు. ఆయన రాయలసీమను విడదీయరాదని, ఆ నాలుగు జిల్లాలను మరో రాష్ట్రంగా ఏర్పాటుచేయాలని డిమాండ్‌చేశారు. అలాగే, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా విజయనగరాన్ని చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టును ఇప్పుడున్న స్వరూపంలో ఆయన పూర్తిగా వ్యతిరేకించారు. ప్రాజెక్టు ప్రస్తుత డిజైన్‌ను మార్చి బ్యారేజీల నిర్మాణం ద్వారా గిరిజనులు నిరాశ్రయులు కాకుండా అదే ప్రయోజనాలను సాధించవచ్చని చెప్పారు. హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా పేర్కొనడాన్ని సైతం ఆయన ఆక్షేపించారు. పదేళ్లపాటు ఎందుకు హైదరాబాద్‌లో ఉండాలని, అసలు ఉమ్మడి రాజధాని అనే కాన్సెప్ట్ ఎక్కడా లేదని చెప్పారు. సీమాంధ్రకు చెందిన మూడో మంత్రి ఎం.ఎం.పళ్లంరాజు మాట్లాడుతూ, విభజన తర్వాత తెలంగాణలోని ఉన్నత విద్యాసంస్థల్లో సీమాంధ్ర విద్యార్థులకు అవకాశాలుకేవలం అయిదేళ్లపాటే ఉంటాయని పేర్కొనడం సరికాదని, ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేసే ఉన్నత విద్యాసంస్థలు అయిదేళ్లలో ఎలా పూర్తిరూపం తీసుకుంటాయని ప్రశ్నించారు. వాస్తవ పరిస్థితులను దృష్టిలోపెట్టుకుని ఇక్కడ విద్యాసంస్థల్లో అవకాశాలకు కాలపరిమితిని పదేళ్లకు పెంచాలని కోరారు. దీన్ని కేబినెట్ పరిగణనలోకి తీసుకుని బిల్లులో పేర్కొన్న ఐదేళ్ల కాలపరిమితిని సవరించి పదేళ్లకు పెంచింది. తెలంగాణ 60 ఏళ్ల సమస్య: జైపాల్‌రెడ్డి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది యూపీఏ డిమాండ్ కాదని, ఇది 60 ఏళ్లుగా నలుగుతున్న సమస్య అని చారిత్రక పరిణామాలను, వివిధ ఘట్టాలను జైపాల్‌రెడ్డి విశదీకరించారు. 1953లోనే తెలంగాణ ప్రజానీకం ప్రత్యేక రాష్ట్రాన్ని కావాలన్నారని గుర్తుచేశారు. పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణలో భూముల క్రయవిక్రయాలకు సంబంధించి స్పష్టమైన నిబంధనను పెట్టారని, అయితే ఆ నిబంధనను ఎవరూ గౌరవించిన పాపాన పోలేదని గుర్తుచేశారు. గడచిన 60 ఏళ్ల ప్రస్థానంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన సమయాలను, జై ఆంధ్ర, జై తెలంగాణ సందర్భాలను, గత పదిహేనేళ్లలో చోటుచేసుకున్న పరిణామాలను ఉదహరించారు. భద్రాచలం డివిజన్ గతంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మాట వాస్తవమేనని, అయితే అప్పట్లో ఆ ప్రాంత ప్రజలు వేరే ప్రపంచంలో ఉండేవారని, నాడు తమను ఎవరు పాలిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి వారిదని చెప్పారు. తెలంగాణతో కలిసిన తర్వాత ఆ ప్రాంత ప్రజలు జనజీవన స్రవంతిలోకి వచ్చారని, ఇప్పుడు వారే తెలంగాణలో అంతర్భాగంగా ఉంటామని కోరుతున్నారని తెలిపారు. అలాంటివారిని మళ్లీ తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్‌లో కలపడం సరికాదన్నారు. వారికి కాకినాడ ఎంత దూరమో వాస్తవికంగా ఆలోచించి చూడాలన్నారు. అయినా పోలవరం ప్రాజెక్టు కోసమని వారిని కొత్తగా వేరుచేయడం సరికాదని చెప్పారు. అయినా భారత ప్రభుత్వం పోలవరాన్ని చేపడుతున్నపుడు తెలంగాణలో ఉన్న ఏ ప్రభుత్వమైనా సరే చట్టాన్ని పాటించాల్సి ఉంటుందని, అందులో ఎలాంటి తేడా రాదని భరోసానిచ్చారు. హైదరాబాద్‌ను అభివృద్ధిపర్చామని సీమాంధ్ర మంత్రులు చెప్పడం సరికాదని అభ్యంతరం వ్యక్తంచేశారు. రెండురాష్ట్రాలు కలిసి విశాలాంధ్ర ఏర్పడేనాటికే హైదరాబాద్ పెద్ద సిటీగా ఉందని, అందుకే అటువైపువారు ఇక్కడికి వచ్చారని, ఈ నగరాన్ని వారు మెరుగుపర్చామనడం ఏమిటని ప్రశ్నించారు. సీమాంధ్రుల భద్రత విషయంలో ఊహాగానాలు చేయడం సరికాదని, అనవసరంగా లేనిపోనివి సృష్టించి వాటిని పెద్ద అంశాలుగా లేవనెత్తరాదని విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అని, ఏ రాష్ట్రంలోనైనా సరే ఉద్యమ పార్టీలు దూకుడుగానే వ్యవహరిస్తాయని చెప్పారు. అందరినీ మాట్లాడమన్న ప్రధాని... బిల్లుకు వ్యతిరేకంగా ఇద్దరు మంత్రులు కావూరి సాంబశివరావు, కిశోర్ చంద్రదేవ్ అభ్యంతరాలను వ్యక్తంచేసినందున సమావేశంలో పాల్గొన్న మిగతా మంత్రులందరినీ మాట్లాడాల్సిందిగా ప్రధాని కోరారని తెలిసింది. ఉన్నతస్థాయి వర్గాలు ఇచ్చిన వివరాల మేరకు ప్రధాని మాటను మన్నించి ఆంటోనీ, చిదంబరంతోపాటు హాజరైన ప్రతి ఒక్కరూ విభజనను సమర్థిస్తూ తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చగా, అన్ని అభిప్రాయాలను కేబినెట్ మినిట్స్‌లో రికార్డు చేశారు. విద్యారంగంలో అవకాశాలను పదేళ్లపాటు మాత్రమే సీమాంధ్రులకు కల్పించాలని, నిరవధికంగా ఉంచాలని కోరడం సరికాదన్నారు. అలా చేసినపక్షంలో రెండు రాష్ట్రాల్లో ఏదీ అభివృద్ధి చెందదని స్పష్టంచేశారు. జైరాం రమేశ్ మాట్లాడుతూ... భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రవాళ్లు కోరడం దేనికన్నారు. ముంపు ప్రాంతాలు ఉన్నాయని చెప్పి ఆ డివిజన్‌ను విడదీయాలని కోరడం సరికాదని చెప్పారు. ఒక దశలో సీమాంధ్ర మంత్రుల అభ్యంతరాలకు జీవోఎం సభ్యులు అడ్డుచెబుతూ... ఇంత ప్రక్రియ చేశామని, ఇప్పుడు దీన్ని ఆపడం వల్ల నిర్ణయం ఆలస్యం జరుగుతుందే తప్ప ఎవరికీ ఒరిగేది ఏం ఉండదని చెప్పారు. అంతేకాక, ఆలస్యమనేది సమస్యలను మరింత పెంచుతుందని ఆందోళన వెలిబుచ్చారు. మొయిలీ మాట్లాడుతూ... తాను ఇప్పటివరకూ ఎన్నో రాష్ట్రాల ఏర్పాటును చూశానని, అయితే ఇంత సవివరమైన అధ్యయనంతో ఒక రాష్ట్రాన్ని ఏర్పాటుచేస్తుండటం ఇదే ప్రథమమన్నారు. జీవోఎం సభ్యుల్లో షిండే, ఆంటోనీ తదితరులు మాట్లాడుతూ... ముసాయిదా బిల్లుపై ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన పనిలేదని చెప్పారు. ఈ ముసాయిదా బిల్లు రాష్ట్రపతి నుంచి అసెంబ్లీకి వెళ్లినపుడు అక్కడ చర్చ జరుగుతుందని, అనేక కొత్త ఆలోచనలు అక్కడ వెల్లడవుతాయని, ఆ తర్వాత పార్లమెంట్లో బిల్లు చర్చకు వచ్చినపుడు మరింత విస్తృత చర్చ జరుగుతుందని, ప్రతిపక్షాలు సవరణలను ప్రతిపాదించే అవకాశం ఉందని, కొన్నింటికి ప్రభుత్వం అక్కడికక్కడే ఆమోదం చెప్పే ఆస్కారమూ ఉందని, ఈ అంశాలన్నింటి దృష్ట్యా ముసాయిదా బిల్లును ఇప్పుడే ఆమోదించడం సరైన చర్య అవుతుందన్న అభిప్రాయం వ్యక్తంచేశారు. ఆర్ఎల్డీకి చెందిన కేంద్ర మంత్రి అజిత్‌సింగ్ మాట్లాడుతూ... ఎన్నేళ్లనుంచో పెండింగ్‌లో ఉన్న తెలంగాణ సమస్యపై ఇప్పుడే నిర్ణయం చేయడం ఎంతైనా అవసరమని చెప్పారు. ప్రధాని ఏమన్నారంటే... అందరూ అభిప్రాయాలను తెలిపిన తర్వాత ప్రధాని మన్మోహన్సింగ్ క్లుప్తంగా తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. జీవోఎం ఎంతో కష్టపడి పనిచేసిందని, అన్ని అంశాలనూ విస్తృతంగా చర్చించిందని ప్రశంసించారు. జూలై 30 నుంచి నేటివరకూ జరిగిన అధ్యయనం, చర్చ, సంప్రదింపులు సరిపోతాయన్నారు. ఈ తరుణంలో బిల్లు ఆమోదాన్ని ఒకటిరెండు రోజులు వాయిదావేయడం ఏవిధంగానూ తోడ్పడబోదని, అందువల్ల ఒక నిర్ణయాన్ని ఇప్పుడే తీసుకోవాలని సూచించారు. దీంతో ముసాయిదా బిల్లుకు ముగ్గురు మంత్రులు మినహా అందరూ ఆమోదం తెలిపారు. -
సీమాంధ్రుల పాత్ర కాదనలేనిది
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అభివృద్ధిలో సీమాంధ్ర ప్రజల పాత్ర కాదనలేనిదని, దానిని ఎవరూ కాదనకూడదని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి అన్నారు. ‘‘హైదరాబాద్‌కు దేశంలోనే అద్వితీయ స్థానం ఉంది. ఢిల్లీ, ముంబై, చెనై్న, కోల్‌కతా నగరాలన్నీ హైదరాబాద్ తర్వాత పుట్టినవే. హైదరాబాద్ అభివృద్ధికి ముస్లిం పాలకులే కాక మరాఠీలు, కండ్రిగలు, మార్వాడీలు చాలా సేవ చేశారు. ఈ అభివృద్ధిలో సీమాంధ్రుల పాత్ర కూడా ఉంది’’ అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలాంటి అణగారిన వర్గాల పరిస్థితి మెరుగుపడాలని, అప్పుడే రాష్ట్ర ఆదర్శం సాకారమవుతుందని చెప్పారు. బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అధ్యక్షతన ఆదివారం జైపాల్‌రెడ్డి నివాసంలో ప్రముఖ కవి వకుళాభరణం జగన్మోహన్రావు రచించిన పాటలతో కూడిన జననీ తెలంగాణ సీడీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సీడీని ఆవిష్కరించిన అనంతరం జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లో ఉండే ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఇప్పుడున్న సీమాంధ్రులే కాకుండా కొత్త వాళ్లు కూడా వచ్చి హైదరాబాద్ అభివృద్ధికి సేవ చేయవచ్చని, అందరినీ ఆదరించే సంస్కారం, సంప్రదాయం హైదరాబాద్‌కు ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సీమాంధ్రుల ఓటమి కోణంలో చూడవద్దని ఈ సందర్భంగా జైపాల్ సూచించారు. విజయం సాధిస్తున్న తరుణంలో తెలంగాణవాదులకు వినమ్రత, ఔదార్యం అవసరమని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం 100 శాతం సఫలం అయిందని తాను భావించడం లేదని, అయితే చాలా వరకు సఫలమైందని చె ప్పారు. తెలంగాణ ప్రక్రియ పూర్తిగా అయ్యేంతవరకు వేచి చూడాలని, తెలంగాణ రాష్ట్ర సాధన కీర్తి త్యాగశీలులు, ప్రాణాలను అర్పిం చిన వారికే దక్కుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర అందరికన్నా గొప్పదని, కోట్లాది ప్రజలను కదిలించి, వారిలో భావనను రగిలించారని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తానెలాంటి పాత్ర పోషించాలన్నది ముందే నిర్ణయించుకున్నానని, మహారాష్ట్ర ఏర్పాటు సమయంలో యశ్వంతరావ్చవాన్ పోషించిన పాత్రనే తాను పోషిస్తానని చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతి ఎస్వీ.సత్యనారాయణ అనువదించిన జీవన్ ఏక్ సంఘర్ష అనే పుస్తకాన్ని కూడా జైపాల్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బస్వరాజు సారయ్య, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్, ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్, కాలువ మల్లయ్య, తూడి దేవేందర్‌రెడ్డి, మోత్కూరి రవితేజ తదితరులు పాల్గొన్నారు.