సీమాంధ్రుల పాత్ర కాదనలేనిది
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అభివృద్ధిలో సీమాంధ్ర ప్రజల పాత్ర కాదనలేనిదని, దానిని ఎవరూ కాదనకూడదని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి అన్నారు. ‘‘హైదరాబాద్‌కు దేశంలోనే అద్వితీయ స్థానం ఉంది. ఢిల్లీ, ముంబై, చెనై్న, కోల్‌కతా నగరాలన్నీ హైదరాబాద్ తర్వాత పుట్టినవే. హైదరాబాద్ అభివృద్ధికి ముస్లిం పాలకులే కాక మరాఠీలు, కండ్రిగలు, మార్వాడీలు చాలా సేవ చేశారు. ఈ అభివృద్ధిలో సీమాంధ్రుల పాత్ర కూడా ఉంది’’ అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలాంటి అణగారిన వర్గాల పరిస్థితి మెరుగుపడాలని, అప్పుడే రాష్ట్ర ఆదర్శం సాకారమవుతుందని చెప్పారు. బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అధ్యక్షతన ఆదివారం జైపాల్‌రెడ్డి నివాసంలో ప్రముఖ కవి వకుళాభరణం జగన్‌మోహన్‌రావు రచించిన పాటలతో కూడిన జననీ తెలంగాణ సీడీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
ఈ సీడీని ఆవిష్కరించిన అనంతరం జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లో ఉండే ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఇప్పుడున్న సీమాంధ్రులే కాకుండా కొత్త వాళ్లు కూడా వచ్చి హైదరాబాద్ అభివృద్ధికి సేవ చేయవచ్చని, అందరినీ ఆదరించే సంస్కారం, సంప్రదాయం హైదరాబాద్‌కు ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సీమాంధ్రుల ఓటమి కోణంలో చూడవద్దని ఈ సందర్భంగా జైపాల్ సూచించారు. విజయం సాధిస్తున్న తరుణంలో తెలంగాణవాదులకు వినమ్రత, ఔదార్యం అవసరమని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం 100 శాతం సఫలం అయిందని తాను భావించడం లేదని, అయితే చాలా వరకు సఫలమైందని చె ప్పారు. తెలంగాణ ప్రక్రియ పూర్తిగా అయ్యేంతవరకు వేచి చూడాలని, తెలంగాణ రాష్ట్ర సాధన కీర్తి త్యాగశీలులు, ప్రాణాలను అర్పిం చిన వారికే దక్కుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర అందరికన్నా గొప్పదని, కోట్లాది ప్రజలను కదిలించి, వారిలో భావనను రగిలించారని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తానెలాంటి పాత్ర పోషించాలన్నది ముందే నిర్ణయించుకున్నానని, మహారాష్ట్ర ఏర్పాటు సమయంలో యశ్వంతరావ్‌చవాన్ పోషించిన పాత్రనే తాను పోషిస్తానని చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతి ఎస్వీ.సత్యనారాయణ అనువదించిన జీవన్ ఏక్ సంఘర్‌ష అనే పుస్తకాన్ని కూడా జైపాల్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బస్వరాజు సారయ్య, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్, ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్, కాలువ మల్లయ్య, తూడి దేవేందర్‌రెడ్డి, మోత్కూరి రవితేజ తదితరులు పాల్గొన్నారు.