'సుష్మను డమ్మీ... అద్వానీని మమ్మీ చేశారు'
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్రెడ్డి బుధవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. ఆ పార్టీలో కురువృద్ధుడు ఎల్ కే అద్వానీని మమ్మీ... సీనియర్ నేత, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్లను డమ్మీ చేశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మోదీ అసాధ్యమైన వాగ్దానాలు చేసి... అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారని జైపాల్ రెడ్డి విమర్శించారు.
అసాధ్య హామీలను నెరవేర్చడంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ విఫలమయ్యారన్నారు. అబద్ధాలు చెప్పడంలో వారికి వారే సాటి అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ మొదటి నుంచి బీజేపీతో జత కట్టాలనుకున్నారని జైపాల్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాశ్మీర్ టెర్రరిస్టుల సాయంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీకి దేశ భక్తి ఎంత ఉందో దీని ద్వారా అర్థమవుతుందన్నారు. పాకిస్థాన్ విషయంలో మోదీ ఎన్నికల ముందు ప్రదర్శించిన దేశభక్తి ఇప్పుడు చూపడంలేదని జైపాల్రెడ్డి విమర్శించారు.