అపాయింటెడ్ డేను త్వరగా
ప్రకటించేలా చూడాలని వినతి
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు బుధవారం ఉదయం హైదరాబాద్‌కు బయలుదేరే ముందు కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారని తెలిసింది. సుమారు 15 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో ఆయన ప్రధానంగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను త్వరితగతిన ముగించేలా చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరినట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అపాయింటెడ్ డేను ప్రకటించేలా చూడాలని, అలా అయితేనే ఎన్నికల్లో రెండు పార్టీలకు లబ్ధి చేకూరుతుందని, లేనిపక్షంలో ప్రజల్లో ఇంకా తెలంగాణ ఏర్పడలేదనే భావన ఉంటుందని వివరించినట్లు తెలిసింది.
అది జరిగితే ప్రతిపక్షాలు దీన్ని అవకాశంగా తీసుకొని తప్పుడు ప్రచారం చేస్తాయని, అదే జరిగితే ఎన్నికల్లో నష్టం తప్పదని కేసీఆర్ వివరించినట్లు సమాచారం. దీనిపై సానుకూలంగా స్పందించిన జైపాల్‌రెడ్డి... ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అపాయింటెడ్ డేను ప్రకటించాలని తన స్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని తెలిపినట్లు చెబుతున్నారు. ప్రభుత్వంలోని పెద్దలతో ఈ విషయమై తానిప్పటికే టచ్‌లో ఉన్నానని, రెండు మూడు రోజుల్లో రాష్ట్రపతి సంతకం పెడతారనే సమాచారం ఉందని ఆయన వివరించినట్లు తెలిసింది.
జైపాల్‌రెడ్డితో కేసీఆర్ మంతనాలు
Published Thu, Feb 27 2014 1:51 AM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM
Advertisement