వేడివేడిగా కేబినెట్ సమావేశం | Cabinet clears bill for creation of Telangana state | Sakshi
Sakshi News home page

వేడివేడిగా కేబినెట్ సమావేశం

Published Fri, Dec 6 2013 2:23 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

వేడివేడిగా కేబినెట్ సమావేశం - Sakshi

వేడివేడిగా కేబినెట్ సమావేశం

* సీమాంధ్రులను ఉన్నఫళంగా ఎలా పంపిస్తారని ప్రశ్నించిన కావూరి
* హైదరాబాద్‌ని యూటీ చేస్తే విభజనకు మాకేం అభ్యంతరం లేదు
* రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలని పట్టు
* రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలన్న కిశోర్ చంద్రదేవ్
* ఉన్నత విద్యాసంస్థల్లో సీమాంధ్రుల కోటాను పదేళ్లకు పెంచాలన్న పల్లంరాజు
* ప్రత్యేక తెలంగాణ 60 ఏళ్లుగా నలుగుతున్న సమస్యని చెప్పిన జైపాల్‌రెడ్డి
* అన్ని అంశాలనూ జీవోఎం విస్తృతంగా చర్చించిందని ప్రశంసించిన ప్రధాని
* ముగ్గురు మంత్రులు మినహా బిల్లుకు కేబినెట్ ఆమోదం
 
సాక్షి, న్యూఢిల్లీ:
రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రివర్గంలో హాట్‌హాట్‌గా చర్చ జరిగింది. మొత్తం కేబినెట్ సమావేశం మూడున్నరగంటలపాటు సాగగా అందులో 2.15 గంటలపాటు రాష్ట్ర విభజనపై చర్చించారు. ఈ చర్చలో రాష్ట్రానికి చెందిన తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత నలుగురు కేబినెట్ మంత్రులు ఎస్.జైపాల్‌రెడ్డి, కావూరి సాంబశివరావు, వి.కిశోర్ చంద్రదేవ్, ఎం.ఎం.పల్లంరాజుతోపాటు సమావేశానికి హాజరైన ప్రతి ఒక్క మంత్రి పాల్గొనడం గమనార్హం. చివరగా ప్రధాని మన్మోహన్‌సింగ్ మాట్లాడాక విభజన ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వంలోని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు కేబినెట్ సమావేశం ఈ తీరున సాగింది.
 
  గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన సమావేశంలో 6 గంటలవరకు అజెండాలోని ఇతర అంశాలన్నింటినీ చర్చించి నిర్ణయాలు చేసిన తర్వాత రాష్ట్ర విభజన అంశాన్ని చేపట్టారు. మొదటగా కేంద్ర హోంమంత్రి, విభజనపై జీవోఎం సారథి సుశీల్‌కుమార్ షిండే కేబినెట్ నోట్, బిల్లు, జీవోఎం నివేదికలోని ముఖ్యాంశాలను మంత్రివర్గ సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. ఆయన అన్ని విషయాలనూ ఏకరువుపెట్టిన మీదట కేబినెట్ సభ్యుల్లో మొదటగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కావూరి సాంబశివరావు మాట్లాడారు. విభజనపై తన అభ్యంతరాలను చారిత్రక అంశాల సాయంతో 35 నిమిషాలపాటు వినిపించారు. ఆనాడు రాష్ట్ర శాసనసభల్లో తీర్మానం ఆమోదించాకే తాము తెలంగాణతో కలిశామని, ఇక్కడికొచ్చి అభివృద్ధి చేశామని, అలాంటి సీమాంధ్రులను ఉన్నఫళంగా ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. తాము ఇక్కడి వనరుల్ని దోచుకున్నామని అంటున్నారని, కానీ వాస్తవానికి తమకున్నదంతా తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి కోసం పెట్టుబడిగా పెట్టామని వాదించారు.
 
  హైదరాబాద్‌ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే విభజనకు తమకేం అభ్యంతరం లేదని, తాము యూటీ చేయమంటున్నది పదేళ్లవరకేనని, శాశ్వతంగా కాదని చెప్పారు. 10 సంవత్సరాలపాటు యూటీగా ఉంచితే అప్పటికల్లా ఆంధ్రప్రదేశ్‌కు పూర్తిస్థాయి రాజధాని ఏర్పాటవుతుందన్నారు. వివాదాస్పద అంశంగా మారిన భద్రాచలం డివిజన్ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, 1959వరకు ఆ ప్రాంతం ఆంధ్ర ప్రాంతంలో ఉన్న సంగతిని గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రం కావాలంటున్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తదితరులు సీమాంధ్రులను బెదిరిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌లోని సీమాంధ్రుల భద్రతకు ఎవరు పూచీ ఇస్తారని ప్రశ్నించారు. ఈ సమయంలో జైపాల్‌రెడ్డి ఆయన వాదనకు అడ్డుతగులుతూ, సీమాంధ్రులను వెళ్లగొట్టేలా, వారిని అభద్రతకు గురిచేసేలా పరిస్థితులున్నాయని చెప్పడం సరికాదని, అందుకు తగిన ఉదాహరణను ఒక్కటైనా చూపాలని అన్నట్టు సమాచారం. గోరంతలు కొండంతలు చేసి చెప్పడం తగదని కావూరిని ఉద్దేశించి ఆయనన్నారు. ఎవరో కొందరు నాయకులు రోడ్లపై మాట్లాడిన అంశాలను సీరియస్‌గా ఎలా తీసుకుంటారని, గత నాలుగేళ్లలో సీమాంధ్రుల భద్రతకు సమస్య ఉత్పన్నమైన ఒక్క సంఘటననైనా చూపాలని నిలదీశారు. ఆ తర్వాత కావూరి మళ్లీ మాట్లాడుతూ... రాష్ట్రాన్ని విభజించే పక్షంలో అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణతో కలిపి 12 జిల్లాలతో రాయల తెలంగాణను ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. రాయల తెలంగాణకు వ్యతిరేకంగా బంద్ నిర్వహించారని చెప్పి ఆ ప్రతిపాదనను మార్చేస్తారా? అని ప్రశ్నించారు.
 
  ఈ సమయంలో హోంమంత్రి షిండే కలగజేసుకుని రాయల తెలంగాణ ప్రతిపాదనను అసలు ఎప్పుడూ పరిగణనలోకి తీసుకోలేదని, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది పది జిల్లాలతో కూడిన తెలంగాణను ఏర్పాటుచేయాలని మాత్రమేనన్న సంగతిని గుర్తుచేశారు. అయినా సరే కావూరి వినకుండా రాయల తెలంగాణను ఏర్పాటుచేసి తీరాలని పట్టుబట్టారు. ఆ తర్వాత ఆయన, బిల్లు విషయంలో అభ్యంతరం చెబుతూ, ఇంత పెద్ద బిల్లును ముందుపెట్టి ఒక్కసారిగా అభిప్రాయం చెప్పండి, ఆమోదిద్దామనడం సరికాదని, ఒకటిరెండురోజులు సమావేశాన్ని వాయిదావేయాలని, అన్నీ కూలంకషంగా పరిశీలించిన తర్వాత కూర్చుని దానిపై చర్చించవచ్చన్నారు. టేబుల్ ఐటెమ్‌గా బిల్లును, నివేదికను పెట్టి దాన్ని సరిగ్గా చదవకుండానే నిర్ణయం చేయడంపై ఆయన అభ్యంతరపెట్టారు. అలాగే, ఇంత హడావుడిగా ప్రక్రియ పూర్తిచేస్తున్నారు, పార్లమెంట్‌లో బీజేపీ మద్దతు ఇవ్వకపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
 
 రాయలసీమను విడదీయవద్దు: కిశోర్‌చంద్రదేవ్
 కావూరి తర్వాత సీమాంధ్రకే చెందిన మరో సీనియర్ మంత్రి కిశోర్‌చంద్రదేవ్ మాట్లాడారు. ఆయన రాయలసీమను విడదీయరాదని, ఆ నాలుగు జిల్లాలను మరో రాష్ట్రంగా ఏర్పాటుచేయాలని డిమాండ్‌చేశారు. అలాగే, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా విజయనగరాన్ని చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టును ఇప్పుడున్న స్వరూపంలో ఆయన పూర్తిగా వ్యతిరేకించారు. ప్రాజెక్టు ప్రస్తుత డిజైన్‌ను మార్చి బ్యారేజీల నిర్మాణం ద్వారా గిరిజనులు నిరాశ్రయులు కాకుండా అదే ప్రయోజనాలను సాధించవచ్చని చెప్పారు. హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా పేర్కొనడాన్ని సైతం ఆయన ఆక్షేపించారు. పదేళ్లపాటు ఎందుకు హైదరాబాద్‌లో ఉండాలని, అసలు ఉమ్మడి రాజధాని అనే కాన్సెప్ట్ ఎక్కడా లేదని చెప్పారు.  
 
 సీమాంధ్రకు చెందిన మూడో మంత్రి ఎం.ఎం.పళ్లంరాజు మాట్లాడుతూ, విభజన తర్వాత తెలంగాణలోని ఉన్నత విద్యాసంస్థల్లో సీమాంధ్ర విద్యార్థులకు అవకాశాలుకేవలం అయిదేళ్లపాటే ఉంటాయని పేర్కొనడం సరికాదని, ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేసే ఉన్నత విద్యాసంస్థలు అయిదేళ్లలో ఎలా పూర్తిరూపం తీసుకుంటాయని ప్రశ్నించారు. వాస్తవ పరిస్థితులను దృష్టిలోపెట్టుకుని ఇక్కడ విద్యాసంస్థల్లో అవకాశాలకు కాలపరిమితిని పదేళ్లకు పెంచాలని కోరారు. దీన్ని కేబినెట్ పరిగణనలోకి తీసుకుని బిల్లులో పేర్కొన్న ఐదేళ్ల కాలపరిమితిని సవరించి పదేళ్లకు పెంచింది.
 
 తెలంగాణ 60 ఏళ్ల సమస్య: జైపాల్‌రెడ్డి
 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది యూపీఏ డిమాండ్ కాదని, ఇది 60 ఏళ్లుగా నలుగుతున్న సమస్య అని చారిత్రక పరిణామాలను, వివిధ ఘట్టాలను జైపాల్‌రెడ్డి విశదీకరించారు. 1953లోనే తెలంగాణ ప్రజానీకం ప్రత్యేక రాష్ట్రాన్ని కావాలన్నారని గుర్తుచేశారు. పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణలో భూముల క్రయవిక్రయాలకు సంబంధించి స్పష్టమైన నిబంధనను పెట్టారని, అయితే ఆ నిబంధనను ఎవరూ గౌరవించిన పాపాన పోలేదని గుర్తుచేశారు. గడచిన 60 ఏళ్ల ప్రస్థానంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన సమయాలను, జై ఆంధ్ర, జై తెలంగాణ సందర్భాలను, గత పదిహేనేళ్లలో చోటుచేసుకున్న పరిణామాలను ఉదహరించారు. భద్రాచలం డివిజన్ గతంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మాట వాస్తవమేనని, అయితే అప్పట్లో ఆ ప్రాంత ప్రజలు వేరే ప్రపంచంలో ఉండేవారని, నాడు తమను ఎవరు పాలిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి వారిదని చెప్పారు. తెలంగాణతో కలిసిన తర్వాత ఆ ప్రాంత ప్రజలు జనజీవన స్రవంతిలోకి వచ్చారని, ఇప్పుడు వారే తెలంగాణలో అంతర్భాగంగా ఉంటామని కోరుతున్నారని తెలిపారు. అలాంటివారిని మళ్లీ తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్‌లో కలపడం సరికాదన్నారు.
 
  వారికి కాకినాడ ఎంత దూరమో వాస్తవికంగా ఆలోచించి చూడాలన్నారు. అయినా పోలవరం ప్రాజెక్టు కోసమని వారిని కొత్తగా వేరుచేయడం సరికాదని చెప్పారు. అయినా భారత ప్రభుత్వం పోలవరాన్ని చేపడుతున్నపుడు తెలంగాణలో ఉన్న ఏ ప్రభుత్వమైనా సరే చట్టాన్ని పాటించాల్సి ఉంటుందని, అందులో ఎలాంటి తేడా రాదని భరోసానిచ్చారు.  హైదరాబాద్‌ను అభివృద్ధిపర్చామని సీమాంధ్ర మంత్రులు చెప్పడం సరికాదని అభ్యంతరం వ్యక్తంచేశారు. రెండురాష్ట్రాలు కలిసి విశాలాంధ్ర ఏర్పడేనాటికే హైదరాబాద్ పెద్ద సిటీగా ఉందని, అందుకే అటువైపువారు ఇక్కడికి వచ్చారని, ఈ నగరాన్ని వారు మెరుగుపర్చామనడం ఏమిటని ప్రశ్నించారు. సీమాంధ్రుల భద్రత విషయంలో ఊహాగానాలు చేయడం సరికాదని, అనవసరంగా లేనిపోనివి సృష్టించి వాటిని పెద్ద అంశాలుగా లేవనెత్తరాదని విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్ ఉద్యమ పార్టీ అని, ఏ రాష్ట్రంలోనైనా సరే ఉద్యమ పార్టీలు దూకుడుగానే వ్యవహరిస్తాయని చెప్పారు.
 
 అందరినీ మాట్లాడమన్న ప్రధాని...
 బిల్లుకు వ్యతిరేకంగా ఇద్దరు మంత్రులు కావూరి సాంబశివరావు, కిశోర్ చంద్రదేవ్ అభ్యంతరాలను వ్యక్తంచేసినందున సమావేశంలో పాల్గొన్న మిగతా మంత్రులందరినీ మాట్లాడాల్సిందిగా ప్రధాని కోరారని తెలిసింది. ఉన్నతస్థాయి వర్గాలు ఇచ్చిన వివరాల మేరకు ప్రధాని మాటను మన్నించి ఆంటోనీ, చిదంబరంతోపాటు హాజరైన ప్రతి ఒక్కరూ విభజనను సమర్థిస్తూ తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చగా, అన్ని అభిప్రాయాలను కేబినెట్ మినిట్స్‌లో రికార్డు చేశారు. విద్యారంగంలో అవకాశాలను పదేళ్లపాటు మాత్రమే సీమాంధ్రులకు కల్పించాలని, నిరవధికంగా ఉంచాలని కోరడం సరికాదన్నారు.
 
 అలా చేసినపక్షంలో రెండు రాష్ట్రాల్లో ఏదీ అభివృద్ధి చెందదని స్పష్టంచేశారు. జైరాం రమేశ్ మాట్లాడుతూ... భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రవాళ్లు కోరడం దేనికన్నారు. ముంపు ప్రాంతాలు ఉన్నాయని చెప్పి ఆ డివిజన్‌ను విడదీయాలని కోరడం సరికాదని చెప్పారు. ఒక దశలో సీమాంధ్ర మంత్రుల అభ్యంతరాలకు జీవోఎం సభ్యులు అడ్డుచెబుతూ... ఇంత ప్రక్రియ చేశామని, ఇప్పుడు దీన్ని ఆపడం వల్ల నిర్ణయం ఆలస్యం జరుగుతుందే తప్ప ఎవరికీ ఒరిగేది ఏం ఉండదని చెప్పారు. అంతేకాక, ఆలస్యమనేది సమస్యలను మరింత పెంచుతుందని ఆందోళన వెలిబుచ్చారు. మొయిలీ మాట్లాడుతూ... తాను ఇప్పటివరకూ ఎన్నో రాష్ట్రాల ఏర్పాటును చూశానని, అయితే ఇంత సవివరమైన అధ్యయనంతో ఒక రాష్ట్రాన్ని ఏర్పాటుచేస్తుండటం ఇదే ప్రథమమన్నారు. జీవోఎం సభ్యుల్లో షిండే, ఆంటోనీ తదితరులు మాట్లాడుతూ... ముసాయిదా బిల్లుపై ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన పనిలేదని చెప్పారు.
 
 ఈ ముసాయిదా బిల్లు రాష్ట్రపతి నుంచి అసెంబ్లీకి వెళ్లినపుడు అక్కడ చర్చ జరుగుతుందని, అనేక కొత్త ఆలోచనలు అక్కడ వెల్లడవుతాయని, ఆ తర్వాత పార్లమెంట్‌లో బిల్లు చర్చకు వచ్చినపుడు మరింత విస్తృత చర్చ జరుగుతుందని, ప్రతిపక్షాలు సవరణలను ప్రతిపాదించే అవకాశం ఉందని, కొన్నింటికి ప్రభుత్వం అక్కడికక్కడే ఆమోదం చెప్పే ఆస్కారమూ ఉందని, ఈ అంశాలన్నింటి దృష్ట్యా ముసాయిదా బిల్లును ఇప్పుడే ఆమోదించడం సరైన చర్య అవుతుందన్న అభిప్రాయం వ్యక్తంచేశారు. ఆర్‌ఎల్‌డీకి చెందిన కేంద్ర మంత్రి అజిత్‌సింగ్ మాట్లాడుతూ... ఎన్నేళ్లనుంచో పెండింగ్‌లో ఉన్న తెలంగాణ సమస్యపై ఇప్పుడే నిర్ణయం చేయడం ఎంతైనా అవసరమని చెప్పారు.
 
 ప్రధాని ఏమన్నారంటే...
 అందరూ అభిప్రాయాలను తెలిపిన తర్వాత ప్రధాని మన్మోహన్‌సింగ్ క్లుప్తంగా తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. జీవోఎం ఎంతో కష్టపడి పనిచేసిందని, అన్ని అంశాలనూ విస్తృతంగా చర్చించిందని ప్రశంసించారు. జూలై 30 నుంచి నేటివరకూ జరిగిన అధ్యయనం, చర్చ, సంప్రదింపులు సరిపోతాయన్నారు. ఈ తరుణంలో బిల్లు ఆమోదాన్ని ఒకటిరెండు రోజులు వాయిదావేయడం ఏవిధంగానూ తోడ్పడబోదని, అందువల్ల ఒక నిర్ణయాన్ని ఇప్పుడే తీసుకోవాలని సూచించారు. దీంతో ముసాయిదా బిల్లుకు ముగ్గురు మంత్రులు మినహా అందరూ ఆమోదం తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement