మళ్లీ కస్సుమన్న బాబాయ్
లక్నో: పట్టుమని వారం రోజులైనా ప్రశాంతత నెలకొందోలేదో.. సమాజ్ వాదీ పార్టీలో మళ్లీ విమర్శల పర్వం మొదలైంది. పార్టీ కంటే ప్రభుత్వం గొప్పది కాదంటూ బాబాయ్ శివపాల్ యాదవ్.. అబ్బాయి అఖిలేశ్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం లక్నోలో మీడియాతో మాట్లాడిన శివపాల్.. '2019 ఎన్నికల్లో బీజేపీని నిలువరించేలా మహా కూటమి ఏర్పాటుచేయాలనుకున్నాం. కానీ పార్టీలోని కొందరు ఆ ప్రయత్నాలను విచ్ఛిన్నం చేశారు. పార్టీని చీల్చే కుట్రలు చేశారు. నన్ను ఎంత అవమానించినా భరిస్తా. కానీ నేతాజీ(ములాయం)ను ఒక్క మాటన్నా సహించను. తిరుగుబాటుదారుల అంతు చూస్తా'అని పరోక్షంగా అఖిలేశ్ వర్గానికి తీవ్ర హెచ్చరికలు చేశారు.
సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు ఇప్పటికే బాబాయ్, అబ్బాయ్ వర్గాలుగా చీలిపోయిన నేపథ్యంలో గురువారం(నవంబర్ 3) నుంచి ప్రారంభం కానున్న సీఎం అఖిలేశ్ రథయాత్ర ఏమేరకు విజయవంతం అవుతుందనేదానిపైనా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే మొదటి రోజు యాత్ర జరుగనున్న (లక్నో నుంచి ఉన్నావ్ వరకు) 60 కిలోమీటర్ల మార్గంలో ఇప్పటికే పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు ఏర్పాటయ్యాయి. శివపాల్ వర్గీయులు కూడా కొన్ని చోట్ల అఖిలేశ్ ను స్వాగతిస్తూ బ్యానర్లు ఏర్పాటుచేయడం గమనార్హం. 'శివపాల్ ఆశీస్సులతో అఖిలేశ్ కు మరోసారి పట్టాభిషేకం' అనే నినాదాలు పలు చోట్ల కనిపించాయి.
మరోవైపు సమాజ్ వాదీ సుప్రిమో ములాయం మహా కూటమి ఏర్పాటు యత్నాలను ముమ్మరం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మంగళవారం ములాయంతో దాదాపు రెండు గంటలపాటు సమావేశం అయ్యారు. నవంబర్ 5న సమాజ్ వాదీ పార్టీ రజతోత్సవ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఇప్పటికే జనతా పరివార్ పార్టీల ముఖ్యులందరికీ ఆహ్వానాలు అందాయి. ఎస్పీ యూపీ చీఫ్ శివపాల్ యాదవే స్వయంగా ఆహ్వానపత్రికలు అందజేశారు. ఆ వేదికపై నుంచే మహా కూటమి ఏర్పాటు ప్రకటన వెలువడుతుందని సమాచారం. అయితే జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్.. ఎస్పీ వేడుకలకు వెళ్లబోనని ప్రకటించిన దరిమిలా మహాకూటమి ఏర్పాటుపై సందిగ్ధత నెలకొంది. మరి కొద్ది గంటల్లో యూపీ ఎన్నికల్లో ఎవరెవరు కలిసి పోరాడేది తేలిపోనుంది.