మోదీ ప్రసంగాల్లో ఉర్దూ సాహిత్యం
Published Wed, Jan 11 2017 5:30 PM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM
ఆరెస్సెస్ నేపథ్యం నుంచి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ హిందీలో ప్రసంగిస్తున్నప్పుడు సాధారణంగా ఉర్దూ పదాలు దొర్లకుండా జాగ్రత్తపడతారు. ఆయన ఇటీవల భావోద్వేగంతో మాట్లాడుతున్నప్పుడు ఉర్దూ పదాలను ఎక్కువగా ఉపయోగించడమే కాకుండా కొన్ని సందర్భాల్లో ఉర్దూ షాయరీలను కూడా ఉదహరిస్తున్నారు.
మోదీ ఇటీవల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో హిందుస్థాన్ (ఇండియా), అఫ్సత్ (అధికార యంత్రాంగం), బద్లావ్ (మార్పు), సజా (శిక్ష), కానూన్ (న్యాయం) లాంటి ఉర్దూ పదాలను ఉపయోగించారు. గతేడాది మార్చి నెలలో రాజ్యసభలో గొడవ చేస్తున్న కాంగ్రెస్ సభ్యులను వ్యూహాత్మకంగా ఎదుర్కొనేందుకు మోదీ ఓ షాయరీనే వినిపించారు. ‘జో చల్ సకోతో చలో, జో చల్ సకోతో చలో, సబీ హై భీడ్ మే, తుమ్ భీ నికల్ సకోతో చలో (నీవు నడవగలిగితే రా, నీవు నడవగలిగితే రా, అందరూ గుంపులోనే ఉన్నారు. వారి నుంచి బయటపడ గలిగితే రా)’ అన్న షాయరీని మోదీ వినిపించగానే పాలకపక్ష సభ్యులు బల్లలు చరుస్తూ హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.
ఆరెస్సెస్ నుంచి వచ్చిన మోదీయే కాదు ఆరెస్సెస్‌కు ప్రస్తుతం చీఫ్‌గా ఉన్న మోహన్ భగవత్ కూడా అప్పుడప్పుడు ఆకర్షణీయమైన భావ ప్రకటనకు ఉర్దూ పదాలను, ఉర్దూ షాయరీలను ఉపయోగిస్తారు. ఆయన నాగపూర్‌లో దసరా వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తూ భావద్వేగతంతో ఉర్దూ షాయరీ అందుకున్నారు. ‘యునాన్ హో మిసర్ హో రోమా సబ్ మిట్ గయే జహాసే అబతక్, మగర్ హై బాకీ నామో నిషానా హమారా, కుచ్ బాత్ హైకీ హస్తీ మిట్టీ నహీ హమారీ సడియోం రహా హు దుష్మన్ దార్ ఏ జమాన్ హమారా (ఈజిప్టు, రోమన్ నాగరికతలన్నీ కూడా ప్రపంచం నుంచి కనుమరుగయ్యాయి. అయినా మనం ఇక్కడే ఉన్నాం. లెక్కలేనంత మంది శత్రువుల మధ్య మనం ఇంకా బతికి ఉండడానికి ఈ మట్టిలో ఏదో ఉంది)’ అంటూ ప్రముఖ ఉర్దూ కవి అల్లమా ఇక్బాల్ షాయరీని వినిపించారు.
ఆరెస్సెస్ నేపథ్యం నుంచి వచ్చిన హిందీ మాట్లాడేవారు సాధారణంగా హిందీ భాషలో మిళితమైన ఉర్దూ పదాలకు బదులు సంస్కృత పదాలను ఉపయోగిస్తారు. భావోద్వేగంతో మాట్లాడుతున్నప్పుడు వారినుంచి కూడా తెలియకుండా ఉర్దూ పదాలు దొర్లుతాయని మోదీ, భగవత్ ప్రసంగాలను చూస్తే అర్థం అవుతుంది. అందకనే ఉర్దూను భాషకన్నా భావ వ్యక్తీకరణ ప్రక్రియగానే ఎక్కువమంది భావిస్తారు. మొగలుల అధికార భాష పర్షియన్ నుంచి వచ్చిన ఊర్దూ ఎంతో హృద్యంగా ఉండటమే కాదు.. హృదయాలకు ఎంతో సున్నితంగా హత్తుకుంటుంది. ఉర్దూకు జాతీయ భాష హోదాను కల్పించినా, ఉర్దూ భాషా ప్రచారానికి జాతీయ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసినా ఆదరణ తగ్గిపోతోంది. ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ఈజిప్టు, రోమన్ నాగరికతల్లా కాలగర్భంలో కలిసిపోతుందేమో!
Advertisement
Advertisement