సోమవారం అయోధ్యలో రామ జన్మభూమి న్యాస్ వర్క్‌షాప్‌ను సందర్శిస్తున్న సాధువులు
అయోధ్య: అయోధ్యలో రామాలయ నిర్మాణ శంకుస్థాపనకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణానికి భూమి పూజ ఈ బుధవారం జరగనున్న విషయం తెలిసిందే. ఆలయ నిర్మాణం జరిగే రామ జన్మభూమి వద్ద సోమవారం 12 మంది పూజారులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. గణపతి పూజ జరిపారు.
అయోధ్యలోని హనుమాన్ గఢి ఆలయంలో మంగళవారం పూజాకార్యక్రమం నిర్వహిస్తారు. భూమి పూజ కార్యక్రమ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్, ట్రస్ట్ చీఫ్ నృత్య గోపాలదాస్ మహారాజ్, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రమే ఉంటారు.
కరోనా ముప్పు పొంచి ఉన్న పరిస్థితుల్లో ఆహ్వానితులు మాత్రమే భూమి పూజ కార్యక్రమానికి రావాలని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విజ్ఞప్తి చేశారు. ఆహ్వానాలు పంపిన 175 మందిలో 135 మంది పలు సంప్రదాయ మఠ, ఆధ్యాత్మిక గురువులేనని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర వెల్లడించింది. రామ మందిర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ నాయకురాలు ఉమా భారతి.. భూమిపూజ కార్యక్రమానికి హాజరు కావడం లేదని ప్రకటించారు.
ఉద్ధవ్ ఠాక్రే వెళ్లకపోవచ్చు
అయోధ్యలో రామాలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి బుధవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హాజరు కాకపోవచ్చని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ‘అయోధ్యలో కరోనా పరిస్థితి సీరియస్‌గా ఉంది. కోవిడ్–19తో ఒక యూపీ మంత్రి కూడా చనిపోయారు. మరో ముగ్గురు మంత్రులకు సోకింది. ఈ పరిస్థితుల్లో భూమి పూజ కార్యక్రమానికి ఎంత తక్కువ మంది వెళ్తే అంత మంచిది’ అన్నారు.
రత్నాలు పొదిగిన దుస్తులు
భూమి పూజ రోజు ‘రామ్‌లల్లా’కు అలంకరించే వస్త్రాలను శంకర్‌లాల్, భగవత్ లాల్ సోదరులు రూపొందిస్తున్నారు. మూడున్నర దశాబ్దాలుగా వారు బాల రాముడికి వ స్త్రాలను రూపొందిస్తున్నారు. ‘1985లో మా నాన్న బాబూలాల్ బాల రాముడికి వ స్త్రాలు రూపొందించడం ప్రారంభించారు. కుట్టుమిషన్‌తో పాటు రామజన్మభూమికి వెళ్లి, అక్కడే రామ్‌లల్లా విగ్రహం ముందే దుస్తులు కుట్టేవారు.
మా ఇద్దరిని కూడా వెంట తీసుకువెళ్లేవారు’ అని శంకర్‌లాల్ తెలిపారు. ‘5న రామ్‌లల్లాకు అలంకరించడం కోసం రెండు జతల దుస్తులను రూపొందిస్తున్నాం. మఖ్మల్ వస్త్రంతో బంగారు దారంతో నవ రత్నాలు పొదిగి ఒకటి ఆకుపచ్చ వర్ణంలో, మరొకటి నారింజ రంగులో సిద్ధం చేస్తున్నాం’ అని తలిపారు. కాగా, భూమి పూజ పనులను యూపీ సీఎం ఆదిత్య నాథ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
అది శ్రీరాముడి కోరిక
భూమి పూజ కార్యక్రమానికి తాను హాజరుకావడం శ్రీరామ చంద్రుడి కోరిక కావచ్చని అయోధ్య భూ వివాదంలో కక్షిదారు అయిన ఇఖ్బాల్ అన్సారీ వ్యాఖ్యానించారు. ఆలయ ట్రస్ట్ నుంచి తనకు ఆహ్వానం అందిందన్నారు. భూమిపూజ రోజు ప్రధాని మోదీకి రాముడి పేరు ఉన్న శాలువాను, రామచరిత మానస్ పుస్తకాన్ని బహూకరించాలనుకుంటున్నా అని
అన్నారు.
రామ్ లల్లా ఫొటోతో ముద్రితమైన ఆహ్వాన ప్రతి
Comments
Please login to add a commentAdd a comment