హోదాపై చంద్రబాబు అసలు గుట్టు రట్టు
హైదరాబాద్: ప్రత్యేక హోదాకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుట్టును టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు రట్టు చేశారు. చెన్నైలో మీడియాతో తెర వెనుక మొత్తం రహస్యాన్ని ఆయన వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని సీఎం చంద్రబాబు ఏనాడు అడగలేదని ఆయన చెప్పారు. విభజన నాడు ఐదు లక్షల కోట్లు ఇవ్వాలని మాత్రమే చంద్రబాబు డిమాండ్ చేసినట్లు తెలిపారు. నేడు 2.25లక్షల కోట్లు ఇచ్చామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అంటున్నారని, మరి అన్ని కోట్లు ఇస్తే చంద్రబాబు ఏం చేసినట్లు అనే అనుమానం జనాలకు కలుగుతుందని చెప్పారు.
అసలు ప్రత్యేక హోదా అనేది కేవలం బీజేపీకి సంబంధించిన విషం మాత్రమేనని, విభజన సమయంలో వెంకయ్యనాయుడు హోదా ప్రస్తావన తీసుకురాకుంటే ఎవరికీ ఆ విషయం తెలిసేది కాదని, ఎవరూ అడిగేవారు కాదని అన్నారు. నాటి ప్రధాని ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటే వెంకయ్య, జైట్లీ మాత్రం పదేళ్లు అడిగారని గుర్తు చేశారు. చంద్రబాబు మాత్రం హోదా గురించి ప్రస్తావించకుండా ఇచ్చినవరకు తీసుకుపోదాం.. పోరాడడమెందుకని అన్నారని అసలు విషయం చెప్పారు. ఏపీ ప్రజలు దిక్కు లేకుండా, చెట్టుకింద ఉన్నారని, ఆదుకునే వాళ్లను ఎందుకు వద్దనాలి అని గాలి అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తే లాభం లేదని కేంద్రం అంటోందని, లాభం లేనప్పుడు ఇస్తే ఏ నష్టం వస్తుందని గాలి ప్రశ్నించారు. 14వ ఆర్థిక సంఘం కూడా ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పలేదని గాలి స్పష్టం చేశారు.