గ్యాంగ్ రేప్ బాధితురాలి ఆత్మహత్య
స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ చేయడమే కాక, కేసు కాకుండా సెటిల్మెంటుకు రావాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తేవడంతో.. బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఈశాన్య ఢిల్లీలోని హర్ష్ విహార్ ప్రాంతంలో జరిగింది. 24 ఏళ్ల వ్యక్తి తన స్నేహితులతో కలిసి 22 ఏళ్ల అమ్మాయిపై దాదాపు నెల రోజుల క్రితం సామూహిక అత్యాచారం చేశాడు. ఇప్పుడు కోర్టు వెలుపల సెటిల్మెంటు చేసుకోవాలని ఆమె తల్లిదండ్రులపై ఒత్తిడి తేవడం మొదలుపెట్టాడు. ఇది భరించలేని ఆమె తన గదిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాత్రి తనగదిలోకి వెళ్లి పడుకున్న ఆమె పొద్దున్న ఎంత పిలిచినా లేవట్లేదు. దాంతో తల్లిదండ్రులు తలుపు పగలగొట్టి చూడగా, అప్పటికే ఆమె మరణించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన స్నేహితుడే తన మిత్రులతో కలిసి తనపై గ్యాంగ్ రేప్ చేశాడని బాధితురాలు మే నెలలో పోలీసులకు ఫిర్యాదుచేసింది. నిందితుడిని అరెస్టుచేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. బాధితురాలికి కౌన్సెలింగ్ చేయించినా, ఆమె తీవ్ర డిప్రెషన్ లోనే ఉంది.
అయితే స్థానికుల కథనం మరోలా ఉంది. తనను పెళ్లి చేసుకుంటానన్న వ్యక్తితో కలిసి ఆమె వెళ్లిపోయిందని, ఆమె కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసి పోలీసుల వద్దకు వెళ్లి అతడిపై కిడ్నాప్, రేప్ కేసు పెట్టారని అంటున్నారు. అతడి స్నేహితులలో ఒకరు కూడా తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు చె ప్పారు. తన వల్ల కుటుంబానికి వచ్చిన అప్రతిష్టను తాను తట్టుకోలేకపోతున్నానని, అందుకే తనువు చాలిస్తున్నానని సూసైడ్ లేఖలో తెలిపింది.