పోలీసు శాఖలో కదులుతున్న డొంక | gangster nayeem case: SIT speedups investigation | Sakshi
Sakshi News home page

పోలీసు శాఖలో కదులుతున్న డొంక

Published Thu, Sep 1 2016 2:39 AM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM

పోలీసు శాఖలో కదులుతున్న డొంక - Sakshi

పోలీసు శాఖలో కదులుతున్న డొంక

- పోలీసు అధికారుల అక్రమాస్తుల్ని గుర్తించిన సిట్

నల్లగొండ క్రైం:
నయూమ్‌తో అంటకాగిన జిల్లా పోలీస్ అధికారుల డొంక కదులుతోంది. ఇప్పటికే నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ సీఐని బాధ్యతల నుంచి తప్పించి డీసీఆర్‌బీకీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. ఆయన నయూమ్ అనుచరులతో చేతులు కలిపి హత్యలు, భూదందాల్లో సహకరించి మహబూబ్‌నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో స్థిరాస్తులు సంపాదించినట్లు సిట్ అధికారులు గుర్తించినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.

అక్రమంగా సంపాదించిన డబ్బుతో వ్యవసాయ భూములు, స్థిరాస్తులను కొనుగోలు చేసిన సీఐ తన కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఉద్యోగ విరమణ చేసి దేవరకొండ రోడ్డులోని ప్రేరణ కాన్సెప్ట్ స్కూల్ సమీపంలో నివాసముంటున్న ఓ సీఐ స్థారుు అధికారి కూడా  నయీమ్ అనుచరులను అడ్డం పెట్టుకుని ఇళ్లస్థలాలు తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు కూడా సిట్ గుర్తించినట్లు తెలిసింది. నయీం అనుచరులతో మరో ముగ్గురు సీఐలకు ఉన్న లింకును కూడా సిట్ గుర్తించినట్టు సమాచారం.

సిట్ పోలీసుల అదుపులో వలిగొండ ఎంపీపీ
వలిగొండ: నయీమ్ కేసులో నల్లగొండ జిల్లా వలిగొండ ఎంపీపీ శ్రీరాముల నాగరాజును హైదరాబాద్‌లో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఇంటి సమీపంలో సిట్ పోలీస్ అధికారులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం. అక్కడ నుంచి వలిగొండ పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నట్లు తెలిసింది. ఇక నయీమ్‌కు ప్రధాన అనుచరుడైన భువనగిరికి చెందిన పాశం శ్రీనుకు ఎంపీపీ నాగరాజు బంధువు.

కోర్టులో లొంగిపోయిన  శ్రీహరి
హైదరాబాద్ : నయీమ్ అనుచరుడు పి. శ్రీహరి (50) బుధవారం సైబరాబాద్ 14 వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో లొంగి పోయాడు. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో శ్రీహరి మూడో ముద్దాయిగా ఉన్నాడు. మేజిస్ట్రేట్ కోర్టు శ్రీహరికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కేసును ఈ నెల 14కు వాయిదా వేసింది.

భువనగిరి కోర్టుకు పాశం శ్రీను, సుధాకర్
భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరులు పాశం శ్రీను, సందెల సుధాకర్‌లను బుధవారం భువనగిరి కోర్టులో పీటీ వారంట్‌పై హాజరుపర్చారు. పీడీ యాక్టు నమోదుతో వరంగల్ జైలులో ఉన్న వీరిని భువనగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుల్లో బుధవారం ఉదయం కోర్టులో  హాజరుపర్చారు. అయితే ఇప్పటికే పాశం శ్రీనును తమకు అప్పగించాలని సిట్ పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌ను అంగీకరించి జడ్జి మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి నిచ్చారు. ఈనెల 3 వ తేదీ వరకు కస్టడీ పిటిషన్‌కు జడ్జి అనుమతి నిచ్చారు. దీంతో సిట్ పోలీసులు పాశం శ్రీను ను రహస్య ప్రాంతానికి తరలించి విచారణ ప్రారంభించారు. నయీమ్ అనుచరుడిగా పలు కేసుల్లో పాశం శ్రీను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement