కోహ్లి-ధోనీ పోరు: గంగూలీ మద్దతు ఎవరికి?
ముంబై: ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో భారత్ అద్భుత విజయంతో విరాట్ కోహ్లి-మహేంద్రసింగ్ ధోనీ మధ్య మళ్లీ కెప్టెన్సీ పోరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం వన్డేలు, టీ-20లకు నేతృత్వం వహిస్తున్న ధోని.. ఆ నాయకత్వ పగ్గాలు కోహ్లికి అప్పగించి.. ఆయన నాయకత్వంలో ఆడక తప్పదంటూ టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందిస్తూ టెస్టు సారథిగా కోహ్లి విజయవంతమవ్వడం సహజంగానే ధోనీపై ఒత్తిడి పెంచిందని చెప్పాడు. అయితే, కెప్టెన్‌గా కొంతకాలం ధోనీని కొనసాగించడమే మంచిందంటూ పేర్కొన్నాడు.
ధోనీ టెస్టు సారథి పగ్గాలు కోహ్లికి అప్పగించిన నాటినుంచి భారత్ వరుసగా ఐదు టెస్టు సిరీస్‌లు గెలుపొందింది. వరుసగా 18 టెస్టుల్లో పరాజయం అన్నదే ఎరుగకుండా కోహ్లిసేన దూసుకుపోతున్నది. పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు ధోనీ సారథ్యం వహిస్తున్నప్పటికీ కోహ్లి అసాధారణ దూకుడుతో ఆ పగ్గాలు కూడా అతనికే అప్పగించాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఈ నేపథ్యంలో గంగూలీ స్పందిస్తూ రానున్న ఇంగ్లండ్ వన్డే, టీ20 సరీస్ ధోనీకి అత్యంత కీలకమని వ్యాఖ్యానించాడు.
కోహ్లికి కెపెన్సీ బదలాయింపుపై స్పందిస్తూ 'ఇది సమర్థనీయమైన ప్రశ్నే. టెస్టుల్లో కోహ్లి విజయం సెలెక్టర్ల మీద ఒత్తిడి పెంచుతుంది. అయితే, విరాట్ కొంతకాలం వేచి ఉండకతప్పదు. ఒకరోజు అతను తప్పకుండా వన్డేలకు కూడా కెప్టెన్ అవుతాడు. కానీ కొంతకాలం ఆగాలి. ఇక సెలెక్టర్లు 2019 వరల్డ్ కప్‌కు ఎవరిని కెప్టెన్‌గా నియమించాలనేదానిపై ఇప్పటినుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కాబట్టి రానున్న ఇంగ్లండ్ వన్డే, టీ-20 సిరీస్ ధోనీకి కీలకం' అని గంగూలీ మీడియాతో చెప్పాడు.