పాక్ నుంచి 'గీత' వచ్చేస్తోంది
కరాచి: ఎట్టకేలకు గీత తిరిగి మాతృదేశం రాబోతుంది. పన్నేండేళ్ల తర్వాత తన తల్లిదండ్రుల ఒడిని చేరబోతుంది. పుట్టుకతోనే మూగ, చెవిటి లక్షణాలు ఉన్న గీత తన తల్లిదండ్రులను గుర్తించిందని, ఇక ఆమెను భారత్ రప్పించే ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరలోనే డాక్యుమెంట్ల కార్యక్రమాలు పూర్తి చేసి వారి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తామని ఢిల్లీ అధికారులు తెలిపారు. ఆమె తల్లి దండ్రులు ప్రస్తుతం బీహార్లో ఉన్నారని చెప్పారు. 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు(2003లో) గీత పొరపాటున సరిహద్దులో తప్పిపోయి ప్రస్తుతం పాకిస్థాన్ లోని కరాచీలో చిక్కిపోయింది.
ఆమెకు కరాచీలోని ఈది ఫౌండేషన్ అనే ఓ స్వచ్ఛంద సంస్ధ ఆశ్రయం ఇచ్చింది. ప్రస్తుతం ఆమెకు 20 ఏళ్లు దాటాయి. తిరిగి మాతృదేశం భారత్ కు రావాలనే ఆమె ఆకాంక్ష 'బజరంగీ భాయిజాన్' సినిమా విడుదలైన తర్వాత మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసిన సంగతి విదితమే. కాగా, ఈ కూతురు తమ కూతురంటే తమ కూతురని పంజాబ్కు చెందిన బధిర దంపతులు, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన మరో రెండు కుటుంబాలు పోలీసులను ఆశ్రయించాయి. అయితే, అలా ఆశ్రయించిన వారి ఫొటోలను ఇటీవల పాక్ లోని భారత హై కమిషన్ ఆమెకు చూపించగా వారిని గుర్తుపట్టింది. ఆమె గుర్తుపట్టిన కుటుంబ సభ్యులు ప్రస్తుతం బీహార్లో నివసిస్తున్నారు. దీంతో త్వరలోనే ఆమెను భారత్కు తీసుకొచ్చే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.