ఆండ్రియాస్ ల్యూబిట్జ్
అతడు తన ప్రాణం తాను తీసుకున్నాడు. అదే సమయంలో మరో 150 మంది ప్రాణాలు తీశాడు. అది ఆత్మహత్య. ఆ 150 మంది ప్రయాణికుల సామూహిక హత్య కూడా. ఇదే సూత్రం మీద ఇప్పుడు ఫ్రెంచ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గడచిన మంగళవారం ఫ్రెంచ్ ఆల్ప్స్ పర్వతశ్రేణులలో జర్మన్‌వింగ్స్ విమానం కూలడం గురించి, ఇందుకు కారకునిగా భావిస్తున్న కో-పైలట్ ఆండ్రియాస్ ల్యూబిట్జ్ గురించి గుండెలు బరువెక్కించే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ‘ఏదో ఒకరోజు నా పేరు ఈ విశ్వమంతటా మారు మోగిపోతుంది చూడు!’ అంటూ ఐదారు మాసాల క్రితమే తన మాజీ గర్ల్ ఫ్రెండ్‌తో అన్నమాటకు ల్యూబిట్జ్ ఇలా కార్యరూపమిచ్చాడు. నిజమే... ఇప్పు డు ప్రపంచం మొత్తం అతడి పేరునే స్మరిస్తోంది. బ్లాక్ బాక్సుల ద్వారా వెల్లడైన సమాచారం గగనయానం మీద కొత్త ప్రశ్నలను రేకెత్తించే విధంగా ఉంది.
ల్యూబిట్జ్ నుంచి విడిపోక తప్పని పరిస్థితి ఈ మధ్యే రావడం ఎంత మంచిదైందో ఆ మాజీ గర్ల్‌ఫ్రెండ్ తలుచుకుని ఇంత విషాదంలోనూ ఆనం దించి ఉండాలి. ఎందుకు విడిపోయారంటే, అప్పటికే అతడిలో ఏదో మానసిక సమస్యకు సంబంధించిన లక్షణాలు మొదలయ్యాయని చెప్పిందామె. ‘మనం పడిపోతున్నాం...మనం పడిపోతున్నాం...!’ అంటూ ల్యూబిట్జ్ చటుక్కున నిద్దట్లోనుంచి లేచిపోయి అరుస్తూ ఉండేవాడట. అతడికి ఎప్పుడూ పీడకలలే. కానీ తన ఆరోగ్య స్థితిని సంస్థ దృష్టికి రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా డు. విమానం కూలిన రోజు, ఆ ముందు రోజు కూడా అంటే,ఈ మార్చి 25, 26 తేదీలలో కూడా అతడు వైద్యులను కలసివచ్చాడు. అయితే ఆస్పత్రిలో ఇచ్చిన రిపోర్టులను అతడు చించిపారేశాడు.
నిజానికి ల్యూబిట్జ్ 2009లో పైలట్ శిక్షణ పొందుతున్నప్పుడే వ్యాధి బయటపడింది. 18 మాసాల వైద్యం తరువాత మళ్లీ చేరాడు. 2013 నుంచి ఇతడిలో వ్యాధి లక్షణాలు మరోసారి కనిపిం చాయి. అప్పుడే, 2015 వరకు కూడా ల్యూబిట్జ్ తరచూ వైద్యపరీక్షలు నిర్వహించుకోవాలని ఆస్పత్రి వర్గాలు సూచించాయి. ఇలా ఉండగానే ఈ సంవ త్సరం ఫిబ్రవరిలో అంతుచిక్కని వ్యాధికి అతనికి కొత్తగా చికిత్స మొదలయింది.
ల్యూబిట్జ్ వ్యక్తిగత జీవితం సంక్షోభభరితమైంది కావచ్చుననీ, దానితో పాటు కొన్ని ఇతర కారణాలు కూడా ఇంతటి విపరీత నిర్ణయం తీసుకోవడానికి దారి తీసి ఉండవచ్చునని జర్మనీ పత్రికలు విశ్లేషిస్తున్నాయి. ఈ దుర్ఘటనలో అస లు పైలట్‌ను కాక్‌పిట్‌లోకి రానివ్వకుండా లోపల తాళం పెట్టుకుని ల్యూబిట్జ్ విమానాన్ని భూమార్గం పట్టించాడు. ఇది పొరపాటుగా జరిగినది కూడా కాదనీ, ఎందుకంటే, ఏ మీట నొక్కితే విమానం కిందకు దూకుతుందో, అదే మీటను ల్యూబిట్జ్ నొక్కేశాడని నిపుణులు చెబుతున్నారు. ఆ తరువాత ఎనిమిది నిముషాల పాటు అతడు హాయిగా ఊపిరి తీసుకున్న విషయం కూడా కనుగొ న్నారు. మద్యపానం, మత్తుమందులతో వచ్చే సమస్యలు, వివాహ జీవితం భగ్నం కావడం, వ్యక్తిగత వైఫల్యాలు, గతంలో భరించిన లేదా ఇప్పుడు భరి స్తున్న పని ఒత్తిడి వంటి కారణాలు కూడా ఈ దారుణ చర్యకు దారితీయించే అవకాశం ఉందని అక్కడి పత్రికలు అంటున్నాయి. నిజానికి ఇందులో చాలా వరకు ల్యూబిట్జ్ జీవితంలో కనిపిస్తున్నాయి. కానీ అతడు మోంటాబార్ (జర్మ నీ పశ్చిమ ప్రాంతం) అనే చోట తల్లిదండ్రులతో కలసే ఉండడం విశేషం. కానీ డుసెల్‌డార్ఫ్‌లో ఒక అపార్టుమెంటు కొని, ఉద్యోగం కోసం అందులో ఉంటు న్నాడు. అయితే ఇది ఒక్క ల్యూబిట్జ్‌కు సంబంధించిన సమస్య కాదని మార్జోరీ వాలెస్ మాటలను బట్టి తెలుస్తోంది. చారిటీ సేన్ అనే మానసిక రుగ్మతల నివా రణ సంస్థ అధిపతిగా ఉన్న వాలెస్ చెబుతున్నది వింటే గుండె ఝల్లుమంటుం ది. ప్రస్తుతం ఒత్తిడికి వైద్యం చేయించుకుంటున్నవారు వేల సంఖ్యలో ఉన్నా రనీ, అందులో పైలట్లు కూడా ఉన్నారనీ ఆయన అంటున్నారు.
ఇంత జరిగాక ఇప్పుడు ఐరోపా విమానయాన భద్రతా సంస్థ (ఈఏఎస్‌ఏ) ఉలిక్కిపడి మార్చి 28 నుంచే కొత్త నిబంధనలు ప్రకటించింది. ఇక నుంచి కాక్‌పిట్‌లో ఎల్లవేళలా ఇద్దరు ఉండాలని ఆదేశించింది. ఈ పద్ధతిని అమెరికా ఇప్పుటికే పాటిస్తున్నది. పనిలో పనిగా ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ విమానయాన సంస్థ కూడా పైలట్లు తరచు మానసిక పరీక్షలు జరిపించుకోవాలని పిలుపునిచ్చింది. ఏమైనా ఒక హాలీవుడ్ హర్రర్ సినిమాకు తగిన విషాదాన్ని ప్రపంచానికి వదలిపెట్టి వెళ్లాడు ల్యూబిట్జ్.