
శాడిస్ట్ భర్త అకృత్యం
- భార్య జననావయవాలపై కత్తితో గాట్లు
- అనుమానంతో వైద్యపరీక్షలు
- ఘట్‌కేసర్‌లో వెలుగుచూసిన ఘటన.. కేసు నమోదు
ఘట్కేసర్: అనుమానం పెనుభూతమై భార్యతో రాక్షసంగా ప్రవర్తిస్తున్న భర్త ఉదంతం ఇది. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌కు చెందిన పి.ప్రియాంక(25)కు, వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రాంధన్ తండాకు చెందిన భూక్యా రవితో 2005లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఉద్యోగ రీత్యా రవి హైదరాబాద్ శివారు ఘట్‌కేసర్ మండలం అన్నోజిగూడలో కాపురంపెట్టాడు.
అయితే, రవికి భార్య ప్రవర్తనపై అనుమానం ఉంది. దీంతో ఆమెపై చపాతీ కర్రతో దాడి చేయటంతో తలకు మూడు కుట్లు పడ్డాయి. తాళలేక ఆమె పుట్టింటికి వెళ్లగా అక్కడి కెళ్లి మరీ దాడి చేశాడు. ఈ మేరకు అక్కడి పోలీస్‌స్టేషన్‌లో రవిపై గృహ హింస చట్టం కింద కేసు నమోదైంది. ఇకపై భార్యను తిట్టను, కొట్టను అంటూ పోలీసుల ముందు ఒప్పుకుని భార్యను అన్నోజిగూడకు తీసుకొచ్చి మళ్లీ వేధింపులు ప్రారంభించాడు.
ఆమె సున్నిత భాగాల్లో కత్తితో గాట్లు పెట్టడంతోపాటు..వేరేవారితో లైంగిక సంబంధం పెట్టుకుందంటూ వైద్య పరీక్షలు చేయించాడు. ఈ చర్యలతో విసిగిపోయిన ప్రియాంక ఈ నెల 24న పిల్లల్ని వెంటబెట్టుకుని బంధువుల ఇంటికి వెళ్లింది. కుమార్తె ఆచూకీ తెలియడం లేదంటూ తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు ఘట్‌కేసర్ పోలీసులు అదృశ్యం కేసు నమోదుచేశారు. దర్యాప్తులో భాగంగా ఆమె జనగాంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఘట్కేసర్ తీసుకొచ్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.