
నకిలీ నోట్ల కేసులో భారీ శిక్షలు
నకిలీ కరెన్సీ కేసులో ఘజియాబాద్ సీబీఐ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
- ఫేక్ కరెన్సీ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు
ఘజియాబాద్: విడుదలై పట్టుమని పాతిక గంటలైనా కాకముందే కొత్త రూ.2000 నోట్లను కలర్ జిరాక్స్ తీసిన కర్ణాటక వ్యక్తి ఉదంతం కలకలం రేపడం, ఆ తర్వత మరి కొన్ని చోట్లా అలాంటి నేరాలు వెలుగులోకి రావడంతో అన్ని రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే నకిలీ నోట్లను చెలామణి చేస్తున్న వారిని పట్టుకున్న దాఖలాలు అక్కడక్కడ కనిపించినప్పటికీ పెద్ద ఎత్తున మన దేశంలోకి చొరబడిపోతున్న ఈ కరెన్సీని ప్రభుత్వాలు అడ్డుకోలేకపోయాయి. అక్కడక్కడ నకిలీ నోట్లను పట్టుకుంటున్నప్పటికీ వారికి తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవడంలో మాత్రం కట్టుదిట్టమైన చర్యలేవీ ఉండటం లేదు. ఈ నేపథ్యంలో 2012 నాటి నకిలీ కరెన్సీ కేసులో ఘజియాబాద్ సీబీఐ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నకిలీ నోట్లు చెలామణి చేసిన ఇద్దరికి కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. సరిహద్దు దేశాల నుంచి నకిలీ నోట్లు స్మగుల్ అవుతున్న ఆ కేసు వివరాలిలా ఉన్నాయి.
2012లో మొరాదాబాద్ రైల్వే స్టేషన్ లో నకలీ కరెన్సీని కలిగిన ఇద్దరు వ్యక్తులను సీబీఐ అరెస్టు చేసింది. పశ్చిమ బెంగాల్ మాల్దా జిల్లాకు చెందిన మొహబ్బత్ పూర్ కు చెందిన హమిదుల్ షేక్, నజీబుల్ హక్ అనే వ్యక్తుల నుంచి 8,49,500 నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఆ కరెన్సీని మరో వ్యక్తికి బదిలీ చేయడానికి వారు రైల్వే స్టేషన్ లో ఎదురుచూస్తుండగా సీబీఐ వారిని పట్టుకుంది. ఉత్తరప్రదేశ్ లోని రాయపూర్ జిల్లా శికర్ పూర్ గ్రామానికి చెందిన గుల్షన్ జహాన్ కు ఆ కరెన్సీని చేరవేయడానికి ఆ ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు.
దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత సీబీఐ వారిపై 2012 నవంబర్ 27 న చార్జిషీటు దాఖలు చేసింది. అప్పటి నుంచి కేసు ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ కు చెందిన సీబీఐ కోర్టులో విచారణ కొనసాగింది. నకిలీ కరెన్సీ రవాణా చేయడానికి ప్రయత్నించిన హమీదుల్ షేక్, నజీబుల్ హక్ లకు సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి శుక్రవారం ఒక్కొక్కరికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష 1.60 లక్షల ఫైన్ విధించింది. నకిలీ కరెన్సీ చెలామణికి ప్రయత్నించిన యూపీకి చెందిన గుల్షన్ జహాన్ కు ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 80 వేల రూపాయల ఫైన్ విధిస్తూ తీర్పు చెప్పినట్టు శుక్రవారం సీబీఐ ఒక ప్రకటనలో తెలిపింది.