
భార్యను చంపి, శవాన్ని తీసుకెళ్లి అత్తపై కాల్పులు
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్‌లో ఘోరం జరిగింది. 35 ఏళ్ల వ్యక్తి తన భార్యను చంపి, అత్తను కాల్చి తీవ్రంగా గాయపరిచాడు. భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
ఘజియాబాద్‌లోని మసూరిలో సత్యేంద్ర టియెటియా తన భార్య రాజకుమారి, ముగ్గురు పిల్లలతో కలసి ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం సత్యేంద్ర కారులో భార్యను ఊరిబయటకు తీసుకెళ్లి కాల్చిచంపాడు. ఆ తర్వాత ఆమె శవాన్ని ఇంటి దగ్గరకు తీసుకువచ్చాడు. రక్తపు దుస్తులతో ఉన్న రాజకుమారిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించాడు. అతను కారులో ఆమె శవాన్ని తీసుకుని హపుర్ చుంగిలో ఉంటున్న అత్తింటికి వెళ్లాడు. అక్కడ అత్త ఇంద్రాణిపై రెండుమార్లు కాల్పులు జరిపాడు. అక్కడ నుంచి వెనుదిరిగిన సత్యేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకుని అతని భార్య శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. విషమ పరిస్థితుల్లో ఉన్న ఇంద్రాణిని ఆస్పత్రికి తరించారు. తనకు, తన భార్యకు మధ్య సంబంధాలు సరిగా లేవని, తనను అయిష్టంగా చూస్తోందని సత్యేంద్ర పోలీసుల విచారణలో చెప్పాడు. పీజీ చదవిన తాను ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్నానని చెప్పాడు. 2003లో వివాహం జరిగిందని, ఇద్దరు కుమార్తెలు, ఓ కొడుకు ఉన్నాడని తెలిపాడు.