- నిర్వహణలో స్థానికులకే ప్రాధాన్యం, రూ. 10 వేల వేతనం
- భద్రత సమస్యలపై దృష్టి పెట్టని సర్కారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ల ఆవరణలో 102 బాలికల హాస్టళ్లను త్వరలో ప్రారంభించబోతున్న ప్రభుత్వం.. వాటి నిర్వహణ బాధ్యతలను ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి అప్పగించేందుకు కసరత్తు చేస్తోంది. రూ. 5 వేలు గౌరవ వేతనం ఇస్తూ హాస్టళ్ల నిర్వహణ బాధ్యతలను ఆయా పాఠశాలల్లోని సీనియర్ మహిళా టీచర్‌కే అప్పగించాలని మొదట్లో భావించింది. టీచర్ తన కుటుంబాన్ని వది లేసి బాలికలతోపాటు హాస్టల్‌లో ఉండాలన్న నిబంధన నేపథ్యంలో ఎవరూ ముందుకు రాలేదు. ఔట్‌సోర్సింగ్‌పై ఒక్కో మహిళకు రూ. 10 వేల చొప్పున వేతనమిచ్చే ఏర్పాట్లు చేస్తోంది. డిగ్రీతోపాటు డీఎడ్ లేదా బీఎడ్ చేసి ఉన్నవారికే బాధ్యతలను అప్పగించేలా నిబంధనలను రూపొందిస్తోంది. 25 ఏళ్ల పైబడిన మహిళలకు కేర్ టేకర్ పేరుతో ఈ బాధ్యతలు అప్పగించాలని, స్థానిక మండలానికి చెందినవారికే ప్రాధాన్యం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. స్కూల్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎండీసీ) ఆధ్వర్యంలో వారిని నియమిం చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఒక్కో హాస్టల్‌లో 9 నుంచి 12వ తరగతి వరకు చదివే 100 మంది బాలికలకు ప్రవేశాలు కల్పిస్తారు.
ఈ హాస్టళ్లు ఉన్న ప్రాంతాలన్నీ శివారు ప్రాం తాలే. బాలికల భద్రత ఎలా అన్న అంశం ప్రధానసమస్యగా మారింది. జనావాసాలకు దూరంగా ఉన్నందునా రాత్రివేళల్లో మహిళా కేర్‌టేకర్‌కు మొత్తం బాధ్యతను అప్పగించడం వల్ల ఏమైనా సమస్యలు వస్తే ఏం చేయాలన్న దానిపై సర్కారు దృష్టి పెట్టలేదు. అనుకోని సంఘటనలు జరిగినపుడు కేర్ టేకర్‌పై ఎలాంటి చర్యలు చేపట్టవచ్చన్న దానిపైనా స్పష్టత లేదు. బాలికల హాస్టళ్లకు రాత్రివేళల్లో కచ్చితంగా మహిళా కానిస్టేబుళ్ల భద్రత అవసరమని అధికారులు పేర్కొంటున్నారు.