ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంత పెద్ద చోరీ ఒకటి మహారాష్ట్రలోని నాసిక్లో జరిగింది. పోలీసు వేషాల్లో వచ్చి, 15 కిలోల బంగారం, మూడు లక్షల రూపాయల నగదును దోచుకెళ్లిపోయారు. మణప్పురం గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ కార్యాలయంలో ఈ దోపిడీ జరిగింది. నాసిక్ రోడ్డులో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఉన్న మణప్పురం గోల్డ్ లోన్ కార్యాలయానికి ఐదుగురు వ్యక్తులు పోలీసు దుస్తుల్లో వచ్చారు.
ముందుగా వాళ్లు సీసీటీవీ, టెలిఫోన్, సైరన్ లైన్లను కట్ చేశారు. సిబ్బందిని తుపాకులతో బెదిరించారు. మొత్తం అందరివద్ద ఉన్న సెల్ఫోన్లు లాక్కుని తర్వాత స్ట్రాంగ్ రూంలోకి వెళ్లారు. అక్కడినుంచి 15 కిలోల బంగారం, 3 లక్షల నగదు తీసుకెళ్లిపోయారని డిప్యూటీ కమిషనర్ సాహెబ్ రావు పాటిల్ తెలిపారు. తర్వాత సిబ్బంది అందరినీ స్ట్రాంగ్ రూంలో పెట్టి బంధించి, షట్టర్లు కిందకి లాగేసి పారిపోయారు.
షట్టర్లు తాళం వేయకుండానే కార్యాలయం మూసి ఉందేంటని కొందరు కస్టమర్లు చూసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు స్ట్రాంగ్ రూం తలుపులను రాత్రి పది గంటలకు పగలగొట్టిన తర్వాత మాత్రమే ఉద్యోగుఉల బయటకు రాగలిగారు. ఈ దోపిడీ విషయమై మణప్పురం గోల్డ్ లోన్ కార్యాలయ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాసిక్ నగరం నుంచి బయటికెళ్లే మార్గాలన్నింటినీ సీల్ చేసి, ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.
పోలీసు వేషాల్లో వచ్చి.. 15 కిలోల బంగారం, 3 లక్షల నగదు దోపిడీ
Published Wed, Oct 2 2013 11:24 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement