Manappuram gold loan
-
బంగారం రుణాల్లో రెండో స్థానానికి ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్
న్యూఢిల్లీ: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ దేశంలో రెండో అతిపెద్ద బంగారం రుణాల కంపెనీగా అవతరించింది. మణప్పురం ఫైనాన్స్‌ను మూడో స్థానానికి నెట్టేసింది. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ నిర్వహణలోని బంగారం రుణాల పోర్ట్‌ఫోలియో (ఏయూఎం) సెప్టెంబర్ చివరికి రూ.23,690 కోట్లను అధిగమించింది. మణప్పురం ఫైనాన్స్ నిర్వహణలో బంగారం రుణాలు రూ.20,809 కోట్లుగానే ఉన్నాయి. ఆస్తుల నిర్వహణ పరంగా బంగారం రుణాల వితరణలో రెండో అతిపెద్ద సంస్థగా ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ తన స్థానాన్ని బలోపేతం చేసుకున్నట్టు బంగారం రుణాల హెడ్ సౌరభ్ కుమార్ తెలిపారు. బంగారం రుణాల మార్కెట్లో రూ.66,089 కోట్ల నిర్వహణ ఆస్తులతో ముత్తూట్ ఫైనాన్స్ మొదటి స్థానంలో ఉంది. ‘‘18.6 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. ఇందులో 70 శాతం మంది కస్టమర్లు మళ్లీ మళ్లీ మా సేవలను వినియోగించుకునే వారే. దీంతో ముందస్తు చెల్లింపులపై ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదు’’అని కుమార్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బంగారం రుణాల పోర్ట్‌ఫోలియో 25–27 శాతం వృద్ధి చెందుతుందని ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ భావిస్తోంది. దేశవ్యాప్తంగా 1,486 పట్టణాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు నడుస్తున్నాయి. -
మూడు నెలల్లో రూ.404 కోట్ల విలువైన బంగారం వేలం
ముంబై: పసిడి రుణాల విషయంలో బ్యాంకింగ్‌లో ‘బబుల్’ ఆందోళనలు తలెత్తుతున్న పరిస్థితి కనిసిస్తోంది. మణప్పురం ఫైనాన్స్ వంటి పసిడి హామీగా రుణాలను మంజూరుచేసే బ్యాంకింగ్యేతర ఫైనాన్షియల్ సంస్థలు(ఎన్బీఎఫ్సీ) బంగారాన్ని పెద్ద ఎత్తున వేలం వేసే పరిస్థితి నెలకొంది. ఒక్క మణప్పురం ఫైనాన్స్ 2021 జనవరి-మార్చి మధ్య రికార్డు స్థాయిలో దాదాపు రూ.404 కోట్ల విలువైన టన్ను బంగారాన్ని వేలం వేసింది. కరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారన్న విషయాన్ని ఇది స్పష్టం చేస్తోంది. 2021-22 సెప్టెంబర్ త్రైమాసికం నుంచీ బ్యాంకింగ్‌కూ మొండిబకాయిల(ఎన్పీఏ) సెగ తీవ్రమయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. మహమ్మారి వల్ల ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రజానీకం కష్టాల నుంచి గట్టెక్కడానికి 2020లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పలు చర్యలు తీసుకుంది. తనఖాలకు సంబంధించి పసిడి విలువలో 90 శాతం వరకూ రుణాలను అందించవచ్చన్నది ఆర్బీఐ సడలించిన నిబంధనల్లో ఒకటి. బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో (ఆగస్టులో గ్రాముకు గరిష్టంగా రూ.5,600 పలికింది) కష్టకాలంలో ఈ మెటల్ ప్రజలను ఆదుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పసిడి పోర్ట్ ఫోలియోలూ భారీగా పెరిగాయి. 2020-21లో ఈ విలువ దాదాపు రూ.2 లక్షల కోట్లకు పెరిగింది. 2019-20లో ఈ విలువ రూ.1.6 లక్షల కోట్లు కావడం గమనార్హం. పసిడి రుణ పరిశ్రమ విలువ దాదాపు రూ.6 లక్షల కోట్లు. ఇందులో 75 శాతం వాటా అసంఘటిత, చిన్నపాటి రుణదాతలదే. బ్యాంకింగ్ వంటి వ్యవస్థీకృత సంస్థల వాటా కేవలం 25 శాతం (రూ.2 లక్షల కోట్లు). 2020-21లో వ్యవస్థీకృత రంగంలో బ్యాంకింగ్ పసిడి రుణ పోర్ట్‌ఫోలియో వాటా రూ.1.2 లక్షల కోట్లయితే, ఎన్‌బీఎఫ్‌సీల వాటా రూ.80,000 కోట్లు. ఇటీవల మోతీలాల్ ఓశ్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విడుదల చేసిన ఒక నివేదిక ఇక్కడ పరిశీలించాల్సి ఉంటుంది. ఈ నివేదిక ప్రకారం భారత్‌లో 2020 మహమ్మారి విసిరిన సవాళ్లలో (మొదటి వేవ్‌లో) ప్రైవేటు రంగమే 80 శాతం ఆదాయం నష్టపోయింది. ప్రభుత్వం భరించిన నష్టం 20 శాతమే. ఇందులోనూ కార్పొరేట్ రంగం కేవలం 12 నుంచి 16 శాతం భరిస్తే, మిగిలినది కుటుంబాలు భరించాయి. త్రైమాసికాల్లోనే టాప్... మార్చి త్రైమాసికంలో మేము దాదాపు రూ.404 కోట్ల విలువైన 1,000 కేజీల తనఖా బంగారాన్ని వేలం వేశాము. అంతక్రితం మూడు త్రైమాసికాల్లో కేవలం రూ.8 కోట్ల విలువచేసే పసిడినే వేలం వేశాం. ఒక త్రైమాసికంలో వేలం ద్వారా రూ.404 కోట్ల రికవరీ ఇదే తొలిసారి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రికవరీలు రికార్డు స్థాయిలో రూ.1,932 కోట్లు. ఇక ఇప్పటికి మా ఖజానాలో 300 టన్నుల పసిడి ఉంది. కాగా, బ్యాంకులు, ఇతర పోటీ సంస్థలు ఆరు నుంచి 12 నెలల కాలానికి పసిడీ రుణ కాలపరిమితులను అనుసరిస్తుండగా, మేము మూడు నెలల కాలపరిమితినే అనుసరిస్తున్నాం. అందువల్ల మేము ప్రతి నేలా పసిడి వేలం నిర్వహిస్తాము. నిజానికి 2020లో ధరలు భారీగా పెరిగాయి. పసిడి విలువలో 90 శాతం వరకూ రుణాలకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. అయితే ఇప్పుడు ధరలు అప్పటితో పోల్చితే భారీగా పడిపోయాయి. దీనితో ఈ రుణాల విషయంలో ‘బబుల్’ ఆందోళనలు తలెత్తుతున్నాయి. ఏడాది వరకూ రుణ కాలపరిమితి ఉన్నందున, బ్యాంకులు అలాగే ఇతర ఎన్బీఎఫ్సీలు తమ రుణ నాణ్యత సమస్యలపై మార్చి లేదా జూన్ త్రైమాసికం వరకూ తమ రుణ నాణ్యతను తెలియజేయవు. అయితే ఈ విషయంలో సెప్టెంబర్ త్రైమాసికం నుంచీ ఎన్పీఏల సెగ తీవ్రమయ్యే అవకాశం ఉంది. తమ గోల్డ్ రుణ పుస్తకంలో దాదాపు 90 శాతాన్ని బ్యాంకులు ప్రాధాన్యతా పూర్వక రుణంగా పేర్కొన్నాయి. - వీపీ నందకుమార్, మణప్పురం ఎండీ, సీఈఓ బ్యాంకులకు ఎన్పీఏల తీవ్రత! గ్రాము ధర రూ.5,600 ఉన్న గరిష్ట స్థాయిల నుంచి చూస్తే, ఇప్పుడు ధరలు 10 నుంచి 13 శాతం పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్ త్రైమాసికం నుంచీ బ్యాంకుల రుణ నాణ్యత సమస్యలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఇప్పటికి మా సంస్థ భారీ వేలాలు ఏవీ నిర్వహించలేదు. మా రుణ కాలపరిమితి 9 నుంచి 12 నెలలు ఉండడమే దీనికి కారణం. - థామస్ జాన్ ముత్తూట్, ముత్తూట్ గ్రూప్ చైర్మన్ -
ఆర్బీఐ: ఆభరణాలపై ఇక 90 శాతం రుణాలు
మూడు రోజుల పరపతి విధాన సమీక్షలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ యథాతథ రేట్ల కొనసాగింపునకే కట్టుబడింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో 4 శాతం వద్ద, రివర్స్ రెపో 3.35 శాతం వద్ద కొనసాగనున్నాయి. బ్యాంక్ రేటు సైతం 4.25 శాతంగా అమలుకానుంది. ఈ నిర్ణయాలతోపాటు బంగారు ఆభరణాలపై రుణాల పరిమితిని పెంచేందుకు ఆర్బీఐ నిర్ణయించింది. తద్వారా బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు ఆభరణాల విలువలో ఇకపై 90 శాతం వరకూ రుణాన్ని ఇచ్చేందుకు వీలు చిక్కనుంది. ఇప్పటివరకూ 75 శాతం విలువవరకూ రుణాల మంజూరీకి అనుమతి ఉంది. ఈ నిర్ణయాలు 2021 మార్చి వరకూ అమలుకానున్నట్లు తెలుస్తోంది. ధరలు తగ్గితే.. ప్రస్తుతం పసిడి ధరలు అనూహ్య ర్యాలీ చేస్తున్న విషయం విదితమే. దీంతో ఆభరణాలపై 90 శాతం రుణాలను మంజూరు చేస్తే బంగారం ధరలు తగ్గినప్పుడు రికవరీ సమస్యలు ఏర్పడగలవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పసిడి ఆభరణాలపై రుణాలిచ్చే ఫైనాన్షియల్ కౌంటర్లలో అమ్మకాలు తలెత్తినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. నేలచూపులో.. బంగారు ఆభరణాలపై రుణాలిచ్చే ముత్తూట్ ఫైనాన్స్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 5 శాతం పతనమై రూ. 1198 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1325 వరకూ ఎగసిన ఈ షేరు తదుపరి రూ. 1196 వరకూ నీరసించింది. ఈ బాటలో మణప్పురం ఫైనాన్స్ 1 శాతం క్షీణించి రూ. 158 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 169 వద్ద గరిష్టాన్నీ, రూ. 157 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఇక ముత్తూట్ క్యాపిటల్ 4 శాతం వెనకడుగుతో రూ. 358 వద్ద కదులుతోంది. ఒక దశలో రూ. 354 వరకూ నష్టపోయింది. -
మీ రుణం ‘బంగారం’ గాను..
ఎవరికైనా అత్యవసరంగా డబ్బులు అవసరం పడితే వెంటనే తెలిసిన వారి దగ్గర చేబదులు తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. పర్సనల్ లోన్‌కు వెళ్లాలంటే అందుకు కొన్ని రోజుల సమయం తీసుకుంటుంది. వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి రుణం తెచ్చుకోవడం వల్ల ఆర్థికంగా ఎంతో భారం పడుతుంది. ఇటువంటి అవసరాల్లో అన్నింటికంటే మెరుగైన మార్గంగా బంగారంపై రుణాన్ని చెప్పుకోవాలి. గోల్డ్‌లోన్ ఇతర రుణాలతో పోలిస్తే ఎన్నో విధాలుగా సౌకర్యమైనదే కాదు, మన డబ్బును కొంత ఆదా చేస్తుంది. పర్సనల్ లోన్, ఇతర వ్యక్తిగత రుణాల్లో వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఇది 12.75 శాతం నుంచి 19 శాతం వరకు ఉండొచ్చు. అదే గోల్డ్ లోన్స్‌పై వడ్డీ రేటు 12 శాతం నుంచి ప్రారంభమవుతుంది. కనుక ఇతర రుణాలతో పోలిస్తే ఈ విషయంలో గోల్డ్‌లోన్ చౌక అని చెప్పుకోవాలి. ఇతర రుణాలతో పోలిస్తే ఆ మేరకు ఆదా చేసుకోవచ్చు. కాకపోతే బంగారం విలువలో గరిష్టంగా ఎంత మేరకు రుణాన్ని తీసుకుంటున్నారు? అనే అంశమే వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. ఉదాహరణకు మణప్పురం సంస్థ బంగారం విలువలో 45 శాతం వరకు రుణం తీసుకుంటే కేవలం 12 శాతం రేటునే చార్జ్ చేస్తోంది. ఇంకాస్త అదనంగా కావాలనుకుంటే అప్పుడు 18 శాతం వడ్డీ చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇక బంగారం విలువలో 75 శాతం వరకు రుణం కోరుకుంటే అప్పుడు 24–26 శాతం వరకు వడ్డీ రాబడుతోంది. కనుక రుణం తీసుకునే వారు ఈ అంశాన్ని గుర్తు పెట్టుకోవాలి. తమవద్దనున్న బంగారం విలువలో సగానికి మించకుండా రుణం తీసుకుంటే అధిక వడ్డీ బాదుడు ఉండదు. గంటలోపే రుణం వ్యక్తిగత రుణం తీసుకోవాలని భావిస్తే అందుకు ఎంతలేదన్నా కనీసం రెండు మూడు రోజుల సమయం తీసుకుంటుంది. మధ్యలో సెలవు రోజు ఉంటే ఇంకా ఒకటి రెండు రోజుల అదనపు సమయం తీసుకోవచ్చు. కానీ, బంగారంపై రుణానికి ఇంత సమయం వేచి ఉండక్కర్లేదు. మీ వద్దనున్న బంగారం, ఆధార్ కార్డు, మీ చిరునామా వివరాలతో ఎన్బీఎఫ్సీ సంస్థను ఆశ్రయిస్తే అరగంట నుంచి గంటలోపే రుణంతో తిరిగి వెళ్లిపోవచ్చు. ముత్తూట్ ఫైనాన్స్ అయినా మణప్పురం ఫైనాన్స్ అయినా గంటలోపే ప్రాసెస్ చేస్తున్నాయి. ప్రాసెసింగ్ ఫీజు పర్సనల్ లోన్‌పై కచ్చితంగా ప్రాసెస్ ఫీజు భరించాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు రుణం మొత్తంలో 1–2.5 శాతం వరకూ ఉండొచ్చు. గృహ, వాహన రుణాల్లోనూ ఈ చార్జీ తప్పదు. కానీ, బంగారంపై రుణానికి ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండకపోవడం ఎంతో వెసులుబాటు. కొన్ని సందర్భాల్లో చార్జీ తీసుకున్నా, ఆ మొత్తం రూ.10–50 మధ్యే ఉంటోంది. క్రెడిట్ స్కోరు అవసరం లేదు బంగారంపై రుణం అన్నది సెక్యూర్డ్ లోన్. పర్సనల్ లోన్ అన్నది అన్సెక్యూర్డ్ లోన్. బంగారంపై రుణం ఎగవేతకు అవకాశాలు చాలా చాలా తక్కువ. రుణ గ్రహీత చెల్లింపులు చేయడంలో విఫలమైతే సంస్థ తనఖాగా ఉంచిన బంగారాన్ని విక్రయించి రుణం కింద సర్దుబాటు చేసుకుంటుంది. అందుకే దీన్ని సెక్యూర్డ్ లోన్ అంటారు. తక్కువ వడ్డీ రేటుకు రుణం లభించడం ఇందువల్లే. ముఖ్యంగా ఇతర ఏ రుణానికైనా క్రెడిట్ స్కోరు చాలా కీలకం అవుతుంది. స్కోరు బాగాలేకపోతే దరఖాస్తును తిరస్కరించే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ, బంగారంపై రుణానికి క్రెడిట్ స్కోరుతో పనిలేదు. తనఖాగా బంగారం ఉంచితే చాలు. ముందుగా రుణాన్ని తీర్చేయవచ్చు.. వ్యక్తిగత, వాహన, గృహ రుణాలను నిర్ణీత కాల వ్యవధికి ముందుగానే తీర్చివేస్తే అందుకు కొంత మొత్తం చార్జీలను భరించాల్సి వస్తుంది. అదే బంగారంపై రుణాన్ని ఈ రోజు తీసుకుని రేపు తీర్చివేసినా ఎటువంటి చార్జీల్లేకపోవడం మరో సానుకూలత. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంటే.. మణప్పురం, ముత్తూట్ వంటి సంస్థలు పట్టణాలకే పరిమితం. బ్యాంకులు మండల స్థాయి వరకు విస్తరించాయి. కనుక పట్టణాలకు కొంచెం దూరంలో ఉండే గ్రామీణులకు.. సమీపంలో ఉండే బ్యాంకుల నుంచి గృహ రుణం తీసుకోవడం కొంచెం సౌకర్యంగా ఉండొచ్చు. ఇంటివద్దకే రుణం కావాలంటే.. రుపీక్ అనే స్టార్టప్ ఇంటి వద్దకే వచ్చి బంగారంపై రుణాన్ని ఆఫర్ చేస్తోంది. ఆరు నెలల నుంచి ఏడాది వరకు కాల వ్యవధిపై రుణాలను ఇస్తోంది. వడ్డీ చెల్లింపుల్లో విఫలమైతే వడ్డీరేటును పెంచే చర్యలను అమలు చేయడం లేదు. పైగా ఆరు నెలలకు ఒకేసారి చెల్లించే సదుపాయాన్ని కూడా ఇస్తోంది. సేవల నాణ్యత బంగారంపై రుణం కోరుకునే వారు సేవల నాణ్యతను కూడా చూడాల్సిందే. బ్యాంకులతో పోలిస్తే ఎన్‌బీఎఫ్‌సీల సేవలు కాస్త మెరుగ్గా ఉంటాయి. ముత్తూట్ వంటి సంస్థలు మొబైల్ అప్లికేషన్ ద్వారా రుణంపై వడ్డీ చెల్లింపులు, అసలు చెల్లింపు తదితర ఎన్నో సేవలను అందిస్తున్నాయి. ఆదాయంతో కూడా పనిలేదు రుణం కావాల్సిన వారిలో గృహిణులు, వితంతువులు, వృద్ధులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు కూడా ఉండొచ్చు. మరి రుణం కోసం ఆదాయ ధ్రువీకరణ చూపించడం అంటే వీరికి కష్టమే. పర్సనల్ లోన్, వాహన రుణం, గృహ రుణాలకు ఆదాయాన్ని (బ్యాంకు స్టేట్మెంట్, పేస్లిప్ తదితర) కూడా చూపించాలి. కానీ, బంగారంపై రుణానికి ఎటువంటి ఆదాయ ధ్రువీకరణలు కూడా అవసరం లేదు. వడ్డీ వరకే.. బంగారంపై రుణంలో ఉన్న మరో సాకర్యం.. కేవలం వడ్డీ మాత్రమే చెల్లించే అవకా శం ఇవ్వడం. ఉదాహరణకు బంగారాన్ని తనఖా గా ఉంచి రూ.లక్ష రుణాన్ని తీసుకున్నారనుకోం డి. 12 శాతం వడ్డీ రేటు ఆధారంగా ప్రతీ నెలా రూ.1,000 మొత్తాన్ని చెల్లిస్తూ వెళ్లొచ్చు. అసలు మొత్తాన్ని బంగారం విడిపించుకోవాలనుకునే సమయంలో చెల్లించేందుకు అవకాశం ఉంది. కాకపోతే గోల్డ్ లోన్ 3 నెలలు, 6 నెలల కాల వ్యవధితో ఉంటుంటాయి. లోన్ టర్మ్ అయిన తర్వాత మళ్లీ రెన్యువల్ చేసుకుంటే సరిపోతుంది. మణప్పురం, ముత్తూట్ వంటి ఎన్బీఎఫ్సీ సంస్థల్లో ఇలా ఉంటుంది. అదే బ్యాంకుల్లో అలా కాదు అసలు, వడ్డీతో కలసిన ఈఎంఐ మొత్తాన్ని ప్రతీ నెలా చెల్లిస్తూ వెళ్లాలి. ఒకవేళ విఫలమైతే చార్జీలు బాదేస్తాయి. ప్రతీ నెలా క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే అవకాశం లేని వారికి ఇది ఇబ్బందే. అందుకే అటువంటి వారు ఎన్బీఎఫ్సీ సంస్థల నుంచి తీసుకోవడం సౌకర్యం. కాల వ్యవధి బ్యాంకులు సాధారణంగా దీర్ఘకాలానికి అంటే – ఏడాది నుంచి మూడేళ్ల కాల వ్యవధికి బంగారం రుణాలను మంజూరు చేస్తుంటాయి. వ్యాపారానికి బంగారాన్ని తనఖాగా ఉంచి రుణా న్ని పొందే వారికి దీర్ఘకాలం అనుకూలం. కనుక అటువంటి వారికి బ్యాంకులే అనుకూలం. వీటిని గమనించాలి.. ► బంగారు ఆభరణాలు, బంగారం కాయిన్లపై బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. అయితే, మణప్పురం, ముత్తూట్ ఫైనాన్స్ వంటి సంస్థలు బంగారు ఆభరణాలపైనే రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. బంగారం స్వచ్ఛత 18–24 క్యారెట్ల మధ్య ఉండాలి. ► చిరునామా, గుర్తింపు ధ్రువీకరణలు, ఇందులో ఆధార్ తప్పనిసరి, ఒక పాస్‌పోర్ట్ సైజు ఫొటో తీసుకెళ్లాల్సి ఉంటుంది. ► ఎన్బీఎఫ్సీ సంస్థల నుంచి తీసుకున్న బంగారం రుణంపై అసలు తర్వాత చెల్లించినా కానీ, వడ్డీని 30 రోజులు మించకుండా చెల్లించేయాలి. లేదంటే వడ్డీపై వడ్డీ పడుతుంది. అంతేకాదు, 12 శాతం వడ్డీ రేటు తీసుకుని 30 రోజులు దాటినా వడ్డీని చెల్లించకపోతే అప్పుడు ఆ రేటు కాస్తా 18 శాతానికి పెరిగిపోతుంది. ► అసలు, వడ్డీ చెల్లింపుల్లో విఫలమైతే మూడు, ఆరు నెలల పాటు వేచి చూసి అప్పటికీ చెల్లించకపోతే.. ఆ తర్వాత సంస్థలు వేలానికి వెళ్లొచ్చు. ► మీ వద్ద రూ.లక్ష బంగారం ఉంటే రూ.లక్ష రుణంగా లభించదు. బంగారం విలువలో 60–75 శాతం వరకు రుణంగా (లోన్ టు వ్యాల్యూ/ఎల్టీవీ) ఎన్బీఎఫ్సీలు ఇస్తున్నాయి. పెద్ద మొత్తంలో రుణం కోరుకుంటే అప్పుడు 60 శాతానికే పరిమితం చేస్తున్నాయి. అదే బ్యాంకులు అయితే బంగారం విలువలో 65 శాతానికే రుణాన్ని పరిమితం చేస్తున్నాయి. ► బ్యాంకులతో పోలిస్తే, సులభంగా, వేగంగా రుణం కోరుకుంటే గోల్డ్‌లోన్ కంపెనీలను ఆశ్రయించడమే మంచిది. కొన్ని బ్యాంకులు బంగారం రుణాలపైనా ప్రాసెసింగ్ చార్జీని రాబడుతున్నాయి. ► బంగారం రుణాలను టర్మ్ లోన్స్గానే బ్యాంకులు పరిగణిస్తున్నాయి. కనుక వడ్డీ, అసలు కలిపి వాయిదాలుగా చెల్లించాల్సి ఉంటుంది. ► బ్యాంకుల్లో బంగారం రుణాలపై వడ్డీ 14–18 శాతం మధ్య ఉంది. కానీ, ఎన్బీఎఫ్సీల్లో ఇది గరిష్టంగా 26 శాతం వరకు ఉండడం గమనార్హం. -
మణప్పురంలో మాయాజాలం
తాడిపత్రి అర్బన్: మణప్పురం గోల్డ్‌లోన్ కార్యాలయంలో సిబ్బంది బంగారు ఆభరణాలు తూకం వేయడంలో మాయాజాలం ప్రదర్శించారు. పరిమాణం తగ్గించి చెప్పడంతో బాధితుడు అనుమానం వచ్చి తనకు బంగారు నగ విక్రయించిన వ్యాపారి ద్వారా ‘ధర్మ కాటా’ వేయించడంతో అసలు విషయం తెలిసింది. వివరాల్లోకెళ్తే.. తాడిపత్రి పట్టణంలోని అశోక్‌పిల్లర్ వద్ద తోపుడుబండిపై పండ్ల వ్యాపారం చేసుకున్న పెద్దన్నకు డబ్బు అవసరమై బంగారు నెక్లెస్‌ను తాకట్టు పెట్టేందుకు సోమవారం యల్లనూరు రోడ్డు సర్కిల్లో ఉన్న మణప్పురం గోల్డ్‌లోన్ కార్యాలయానికి వెళ్లాడు. సిబ్బంది సదరు నగను తూకం వేసి రెండు తులాలు ఉందని తెలిపి, ఎంత నగదు కావాలి అని అడిగారు. మూడు తులాల నగను రెండు తులాలే ఉందంటున్నారేంటి..? మీ తూకం తప్పు చూపిస్తోందంటూ పెద్దన్న ప్రశ్నించాడు. అయితే తమది కచ్చితమైన తూకమంటూ సిబ్బంది బుకాయించారు. అనుమానం వచ్చిన పెద్దన్న తనకు నగ తయారు చేయించి ఇచ్చిన దుకాణాదారుడి వద్దకు వెళ్లి తూకం తక్కువ ఉందని వాగ్వాదానికి దిగాడు. అతడు ధర్మకాటాలో తూకం వేయించగా నగ మూడు తులాల పరిమాణం చూపించింది. దీంతో వారిద్దరూ కలసి మణప్పురం గోల్డ్‌లోన్ కార్యాలయానికి వెళ్లి సిబ్బందిని నిలదీశారు. ఈ లోపు పరిస్థితిని ముందే పసిగట్టిన కార్యాలయ సిబ్బంది ఇదివరకు ఉపయోగించిన త్రాసును మార్చి కొత్తది ఉంచారు. ఈ సందర్భంగా అక్కడికొచ్చిన మీడియా ప్రతినిధులను సిబ్బంది లోనికి రాకుండా అడ్డుకున్నారు. బాధితుడి సమక్షంలో బ్రాంచ్ మేనేజర్ రామభక్తరెడ్డి, సిబ్బందిని వివరణ అడిగేందుకు ప్రయత్నించగా ‘మేము ఇక్కడ ఏమీ మాట్లాడం. ఇంతకు మునుపే పోలీసు అధికారులతో మాట్లాడాం’ అని చెప్పడం గమనార్హం. ఉచిత సలహాతో సరి.. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ చిన్న గోవిందు మణప్పురం కార్యాలయం వద్దకు వచ్చారు. అక్కడ బాధితుడితో మాట్లాడారు. కార్యాలయం సిబ్బందితో ఆయన బయటే మాట్లాడారు. తూకాల్లో తేడా కాబట్టి తూనికలు, కొలతల శాఖ అధికారుల పరిధిలోని అంశమని తేల్చి, బాధితుడు పెద్దన్నను స్టేషన్‌కు రావలసిందిగా సూచించారు. మార్గమధ్యలోనే బాధితుడితో ఎందుకు వచ్చి న గొడవ అంటూ సంయమనం పాటించి మిన్నకుండాలని చెప్పి పంపించి వేసినట్లు తెలుస్తోంది. -
అందాల రాణి
జ్యోతినగర్, న్యూస్‌లైన్: మణప్పురం గోల్డ్‌లోన్ ఆధ్వర్యంలో దక్షిణ భారత మిస్ ఇండియా పోటీలు కోయంబత్తూర్‌లో జరిగాయి. అందం, మేధాశక్తి, ఆన్లైన్ ఓటింగ్ ఆధారంగా జరిగిన ఈ పోటీల ఫలితాలను శనివారం రాత్రి వెల్లడయ్యాయి. 16 మంది యువతులతో పోటీపడిన రశ్మీ క్వీన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ సాధించి, ఫెమినా మిస్ ఇండియా పోటీలకు అర్హత సాధించినట్లు నిర్వాహకులు ప్రకటించారు. అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే.. రశ్మీ ఠాకూర్ ఆదివారం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ.. మిస్ క్వీన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ‘అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే పోటీల్లో పాల్గొన్నానను. మిస్ ఇండియా టైటిల్ సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాను. గతంలో నిర్వహించిన అందాల పోటీల్లో బికినీలు ధరించే అంశం ఉండడంతో ఈ ప్రాంతంలోని అమ్మాయిలు వెళ్లలేకపోయారు. ప్రస్తుతం జరిగిన అందాల పోటీల్లో బికినీ అంశం తొలగించడంతో పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది. నిర్వాహకులు సంస్కృతీ సంప్రదాయాలకు అనుణంగా పోటీలను నిర్వహించడం ఏర్పాటు చేయడంహర్షిందగిన విషయం. పోటీలు చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగాయి. టైటిల్ సాధించిన ఆ క్షణాల్లో ఆనందభాష్పాలు రాలాయి’ అని వివరించింది. ఫ్యాషన్ డిజైనర్, మోడల్.. ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్లో వ్యాపారం నిర్వహించే భగత్‌సింగ్-ప్రసన్నలక్ష్మీ దంపతుల పెద్ద కుమార్తె రశ్మీ ఠాకూర్. హైదరాబాద్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లొమా పూర్తి చేసి, పలు అడ్వర్టయిజ్మెంట్లలో మోడల్‌గా వ్యవహరించింది. -
పోలీసు వేషాల్లో వచ్చి.. 15 కిలోల బంగారం, 3 లక్షల నగదు దోపిడీ
ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంత పెద్ద చోరీ ఒకటి మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగింది. పోలీసు వేషాల్లో వచ్చి, 15 కిలోల బంగారం, మూడు లక్షల రూపాయల నగదును దోచుకెళ్లిపోయారు. మణప్పురం గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ కార్యాలయంలో ఈ దోపిడీ జరిగింది. నాసిక్ రోడ్డులో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఉన్న మణప్పురం గోల్డ్ లోన్ కార్యాలయానికి ఐదుగురు వ్యక్తులు పోలీసు దుస్తుల్లో వచ్చారు. ముందుగా వాళ్లు సీసీటీవీ, టెలిఫోన్, సైరన్ లైన్లను కట్ చేశారు. సిబ్బందిని తుపాకులతో బెదిరించారు. మొత్తం అందరివద్ద ఉన్న సెల్ఫోన్లు లాక్కుని తర్వాత స్ట్రాంగ్ రూంలోకి వెళ్లారు. అక్కడినుంచి 15 కిలోల బంగారం, 3 లక్షల నగదు తీసుకెళ్లిపోయారని డిప్యూటీ కమిషనర్ సాహెబ్ రావు పాటిల్ తెలిపారు. తర్వాత సిబ్బంది అందరినీ స్ట్రాంగ్ రూంలో పెట్టి బంధించి, షట్టర్లు కిందకి లాగేసి పారిపోయారు. షట్టర్లు తాళం వేయకుండానే కార్యాలయం మూసి ఉందేంటని కొందరు కస్టమర్లు చూసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు స్ట్రాంగ్ రూం తలుపులను రాత్రి పది గంటలకు పగలగొట్టిన తర్వాత మాత్రమే ఉద్యోగుఉల బయటకు రాగలిగారు. ఈ దోపిడీ విషయమై మణప్పురం గోల్డ్ లోన్ కార్యాలయ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాసిక్ నగరం నుంచి బయటికెళ్లే మార్గాలన్నింటినీ సీల్ చేసి, ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.