న్యూఢిల్లీ: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ దేశంలో రెండో అతిపెద్ద బంగారం రుణాల కంపెనీగా అవతరించింది. మణప్పురం ఫైనాన్స్‌ను మూడో స్థానానికి నెట్టేసింది. ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ నిర్వహణలోని బంగారం రుణాల పోర్ట్‌ఫోలియో (ఏయూఎం) సెప్టెంబర్ చివరికి రూ.23,690 కోట్లను అధిగమించింది.
మణప్పురం ఫైనాన్స్ నిర్వహణలో బంగారం రుణాలు రూ.20,809 కోట్లుగానే ఉన్నాయి. ఆస్తుల నిర్వహణ పరంగా బంగారం రుణాల వితరణలో రెండో అతిపెద్ద సంస్థగా ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ తన స్థానాన్ని బలోపేతం చేసుకున్నట్టు బంగారం రుణాల హెడ్ సౌరభ్ కుమార్ తెలిపారు. బంగారం రుణాల మార్కెట్లో రూ.66,089 కోట్ల నిర్వహణ ఆస్తులతో ముత్తూట్ ఫైనాన్స్ మొదటి స్థానంలో ఉంది. ‘‘18.6 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు.
ఇందులో 70 శాతం మంది కస్టమర్లు మళ్లీ మళ్లీ మా సేవలను వినియోగించుకునే వారే. దీంతో ముందస్తు చెల్లింపులపై ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదు’’అని కుమార్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బంగారం రుణాల పోర్ట్‌ఫోలియో 25–27 శాతం వృద్ధి చెందుతుందని ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ భావిస్తోంది. దేశవ్యాప్తంగా 1,486 పట్టణాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు నడుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment