మూడు రోజుల పరపతి విధాన సమీక్షలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ యథాతథ రేట్ల కొనసాగింపునకే కట్టుబడింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో 4 శాతం వద్ద, రివర్స్ రెపో 3.35 శాతం వద్ద కొనసాగనున్నాయి. బ్యాంక్ రేటు సైతం 4.25 శాతంగా అమలుకానుంది. ఈ నిర్ణయాలతోపాటు బంగారు ఆభరణాలపై రుణాల పరిమితిని పెంచేందుకు ఆర్‌బీఐ నిర్ణయించింది. తద్వారా బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు ఆభరణాల విలువలో ఇకపై 90 శాతం వరకూ రుణాన్ని ఇచ్చేందుకు వీలు చిక్కనుంది. ఇప్పటివరకూ 75 శాతం విలువవరకూ రుణాల మంజూరీకి అనుమతి ఉంది. ఈ నిర్ణయాలు 2021 మార్చి వరకూ అమలుకానున్నట్లు తెలుస్తోంది.
ధరలు తగ్గితే..
ప్రస్తుతం పసిడి ధరలు అనూహ్య ర్యాలీ చేస్తున్న విషయం విదితమే. దీంతో ఆభరణాలపై 90 శాతం రుణాలను మంజూరు చేస్తే బంగారం ధరలు తగ్గినప్పుడు రికవరీ సమస్యలు ఏర్పడగలవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పసిడి ఆభరణాలపై రుణాలిచ్చే ఫైనాన్షియల్ కౌంటర్లలో అమ్మకాలు తలెత్తినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
నేలచూపులో..
బంగారు ఆభరణాలపై రుణాలిచ్చే ముత్తూట్ ఫైనాన్స్ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 5 శాతం పతనమై రూ. 1198 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1325 వరకూ ఎగసిన ఈ షేరు తదుపరి రూ. 1196 వరకూ నీరసించింది. ఈ బాటలో మణప్పురం ఫైనాన్స్ 1 శాతం క్షీణించి రూ. 158 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 169 వద్ద గరిష్టాన్నీ, రూ. 157 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఇక ముత్తూట్ క్యాపిటల్ 4 శాతం వెనకడుగుతో రూ. 358 వద్ద కదులుతోంది. ఒక దశలో రూ. 354 వరకూ నష్టపోయింది.
Comments
Please login to add a commentAdd a comment