ఎవరికైనా అత్యవసరంగా డబ్బులు అవసరం పడితే వెంటనే తెలిసిన వారి దగ్గర చేబదులు తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. పర్సనల్ లోన్‌కు వెళ్లాలంటే అందుకు కొన్ని రోజుల సమయం తీసుకుంటుంది. వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి రుణం తెచ్చుకోవడం వల్ల ఆర్థికంగా ఎంతో భారం పడుతుంది. ఇటువంటి అవసరాల్లో అన్నింటికంటే మెరుగైన మార్గంగా బంగారంపై రుణాన్ని చెప్పుకోవాలి. గోల్డ్‌లోన్ ఇతర రుణాలతో పోలిస్తే ఎన్నో విధాలుగా సౌకర్యమైనదే కాదు, మన డబ్బును కొంత ఆదా చేస్తుంది.
పర్సనల్ లోన్, ఇతర వ్యక్తిగత రుణాల్లో వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఇది 12.75 శాతం నుంచి 19 శాతం వరకు ఉండొచ్చు. అదే గోల్డ్ లోన్స్‌పై వడ్డీ రేటు 12 శాతం నుంచి ప్రారంభమవుతుంది. కనుక ఇతర రుణాలతో పోలిస్తే ఈ విషయంలో గోల్డ్‌లోన్ చౌక అని చెప్పుకోవాలి. ఇతర రుణాలతో పోలిస్తే ఆ మేరకు ఆదా చేసుకోవచ్చు. కాకపోతే బంగారం విలువలో గరిష్టంగా ఎంత మేరకు రుణాన్ని తీసుకుంటున్నారు? అనే అంశమే వడ్డీ రేటును నిర్ణయిస్తుంది.
ఉదాహరణకు మణప్పురం సంస్థ బంగారం విలువలో 45 శాతం వరకు రుణం తీసుకుంటే కేవలం 12 శాతం రేటునే చార్జ్ చేస్తోంది. ఇంకాస్త అదనంగా కావాలనుకుంటే అప్పుడు 18 శాతం వడ్డీ చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇక బంగారం విలువలో 75 శాతం వరకు రుణం కోరుకుంటే అప్పుడు 24–26 శాతం వరకు వడ్డీ రాబడుతోంది. కనుక రుణం తీసుకునే వారు ఈ అంశాన్ని గుర్తు పెట్టుకోవాలి. తమవద్దనున్న బంగారం విలువలో సగానికి మించకుండా రుణం తీసుకుంటే అధిక వడ్డీ బాదుడు ఉండదు.
గంటలోపే రుణం
వ్యక్తిగత రుణం తీసుకోవాలని భావిస్తే అందుకు ఎంతలేదన్నా కనీసం రెండు మూడు రోజుల సమయం తీసుకుంటుంది. మధ్యలో సెలవు రోజు ఉంటే ఇంకా ఒకటి రెండు రోజుల అదనపు సమయం తీసుకోవచ్చు. కానీ, బంగారంపై రుణానికి ఇంత సమయం వేచి ఉండక్కర్లేదు. మీ వద్దనున్న బంగారం, ఆధార్ కార్డు, మీ చిరునామా వివరాలతో ఎన్‌బీఎఫ్‌సీ సంస్థను ఆశ్రయిస్తే అరగంట నుంచి గంటలోపే రుణంతో తిరిగి వెళ్లిపోవచ్చు. ముత్తూట్ ఫైనాన్స్ అయినా మణప్పురం ఫైనాన్స్ అయినా గంటలోపే ప్రాసెస్ చేస్తున్నాయి.
ప్రాసెసింగ్ ఫీజు
పర్సనల్ లోన్‌పై కచ్చితంగా ప్రాసెస్ ఫీజు భరించాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు రుణం మొత్తంలో 1–2.5 శాతం వరకూ ఉండొచ్చు. గృహ, వాహన రుణాల్లోనూ ఈ చార్జీ తప్పదు. కానీ, బంగారంపై రుణానికి ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండకపోవడం ఎంతో వెసులుబాటు. కొన్ని సందర్భాల్లో చార్జీ తీసుకున్నా, ఆ మొత్తం రూ.10–50 మధ్యే ఉంటోంది.
క్రెడిట్ స్కోరు అవసరం లేదు
బంగారంపై రుణం అన్నది సెక్యూర్డ్ లోన్. పర్సనల్ లోన్ అన్నది అన్‌సెక్యూర్డ్ లోన్. బంగారంపై రుణం ఎగవేతకు అవకాశాలు చాలా చాలా తక్కువ. రుణ గ్రహీత చెల్లింపులు చేయడంలో విఫలమైతే సంస్థ తనఖాగా ఉంచిన బంగారాన్ని విక్రయించి రుణం కింద సర్దుబాటు చేసుకుంటుంది. అందుకే దీన్ని సెక్యూర్డ్ లోన్ అంటారు. తక్కువ వడ్డీ రేటుకు రుణం లభించడం ఇందువల్లే. ముఖ్యంగా ఇతర ఏ రుణానికైనా క్రెడిట్ స్కోరు చాలా కీలకం అవుతుంది. స్కోరు బాగాలేకపోతే దరఖాస్తును తిరస్కరించే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ, బంగారంపై రుణానికి క్రెడిట్ స్కోరుతో పనిలేదు. తనఖాగా బంగారం ఉంచితే చాలు.
ముందుగా రుణాన్ని తీర్చేయవచ్చు..
వ్యక్తిగత, వాహన, గృహ రుణాలను నిర్ణీత కాల వ్యవధికి ముందుగానే తీర్చివేస్తే అందుకు కొంత మొత్తం చార్జీలను భరించాల్సి వస్తుంది. అదే బంగారంపై రుణాన్ని ఈ రోజు తీసుకుని రేపు తీర్చివేసినా ఎటువంటి చార్జీల్లేకపోవడం మరో సానుకూలత.
గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంటే..
మణప్పురం, ముత్తూట్ వంటి సంస్థలు పట్టణాలకే పరిమితం. బ్యాంకులు మండల స్థాయి వరకు విస్తరించాయి. కనుక పట్టణాలకు కొంచెం దూరంలో ఉండే గ్రామీణులకు.. సమీపంలో ఉండే బ్యాంకుల నుంచి గృహ రుణం తీసుకోవడం కొంచెం సౌకర్యంగా ఉండొచ్చు.
ఇంటివద్దకే రుణం కావాలంటే..
రుపీక్ అనే స్టార్టప్ ఇంటి వద్దకే వచ్చి బంగారంపై రుణాన్ని ఆఫర్ చేస్తోంది. ఆరు నెలల నుంచి ఏడాది వరకు కాల వ్యవధిపై రుణాలను ఇస్తోంది. వడ్డీ చెల్లింపుల్లో విఫలమైతే వడ్డీరేటును పెంచే చర్యలను అమలు చేయడం లేదు. పైగా ఆరు నెలలకు ఒకేసారి చెల్లించే సదుపాయాన్ని కూడా ఇస్తోంది.
సేవల నాణ్యత
బంగారంపై రుణం కోరుకునే వారు సేవల నాణ్యతను కూడా చూడాల్సిందే. బ్యాంకులతో పోలిస్తే ఎన్‌బీఎఫ్‌సీల సేవలు కాస్త మెరుగ్గా ఉంటాయి. ముత్తూట్ వంటి సంస్థలు మొబైల్ అప్లికేషన్ ద్వారా రుణంపై వడ్డీ చెల్లింపులు, అసలు చెల్లింపు తదితర ఎన్నో సేవలను అందిస్తున్నాయి.
ఆదాయంతో కూడా పనిలేదు
రుణం కావాల్సిన వారిలో గృహిణులు, వితంతువులు, వృద్ధులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు కూడా ఉండొచ్చు. మరి రుణం కోసం ఆదాయ ధ్రువీకరణ చూపించడం అంటే వీరికి కష్టమే. పర్సనల్ లోన్, వాహన రుణం, గృహ రుణాలకు ఆదాయాన్ని (బ్యాంకు స్టేట్‌మెంట్, పేస్లిప్ తదితర) కూడా చూపించాలి. కానీ, బంగారంపై రుణానికి ఎటువంటి ఆదాయ ధ్రువీకరణలు కూడా అవసరం లేదు.
వడ్డీ వరకే..
బంగారంపై రుణంలో ఉన్న మరో సాకర్యం.. కేవలం వడ్డీ మాత్రమే చెల్లించే అవకా శం ఇవ్వడం. ఉదాహరణకు బంగారాన్ని తనఖా గా ఉంచి రూ.లక్ష రుణాన్ని తీసుకున్నారనుకోం డి. 12 శాతం వడ్డీ రేటు ఆధారంగా ప్రతీ నెలా రూ.1,000 మొత్తాన్ని చెల్లిస్తూ వెళ్లొచ్చు. అసలు మొత్తాన్ని బంగారం విడిపించుకోవాలనుకునే సమయంలో చెల్లించేందుకు అవకాశం ఉంది. కాకపోతే గోల్డ్ లోన్ 3 నెలలు, 6 నెలల కాల వ్యవధితో ఉంటుంటాయి.
లోన్ టర్మ్ అయిన తర్వాత మళ్లీ రెన్యువల్ చేసుకుంటే సరిపోతుంది. మణప్పురం, ముత్తూట్ వంటి ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల్లో ఇలా ఉంటుంది. అదే బ్యాంకుల్లో అలా కాదు అసలు, వడ్డీతో కలసిన ఈఎంఐ మొత్తాన్ని ప్రతీ నెలా చెల్లిస్తూ వెళ్లాలి. ఒకవేళ విఫలమైతే చార్జీలు బాదేస్తాయి. ప్రతీ నెలా క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే అవకాశం లేని వారికి ఇది ఇబ్బందే. అందుకే అటువంటి వారు ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల నుంచి తీసుకోవడం సౌకర్యం.
కాల వ్యవధి
బ్యాంకులు సాధారణంగా దీర్ఘకాలానికి అంటే – ఏడాది నుంచి మూడేళ్ల కాల వ్యవధికి బంగారం రుణాలను మంజూరు చేస్తుంటాయి. వ్యాపారానికి బంగారాన్ని తనఖాగా ఉంచి రుణా న్ని పొందే వారికి దీర్ఘకాలం అనుకూలం. కనుక అటువంటి వారికి బ్యాంకులే అనుకూలం.
వీటిని గమనించాలి..
► బంగారు ఆభరణాలు, బంగారం కాయిన్లపై బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. అయితే, మణప్పురం, ముత్తూట్ ఫైనాన్స్ వంటి సంస్థలు బంగారు ఆభరణాలపైనే రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. బంగారం స్వచ్ఛత 18–24 క్యారెట్ల మధ్య ఉండాలి.
► చిరునామా, గుర్తింపు ధ్రువీకరణలు, ఇందులో ఆధార్ తప్పనిసరి, ఒక పాస్‌పోర్ట్ సైజు ఫొటో తీసుకెళ్లాల్సి ఉంటుంది.
► ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల నుంచి తీసుకున్న బంగారం రుణంపై అసలు తర్వాత చెల్లించినా కానీ, వడ్డీని 30 రోజులు మించకుండా చెల్లించేయాలి. లేదంటే వడ్డీపై వడ్డీ పడుతుంది. అంతేకాదు, 12 శాతం వడ్డీ రేటు తీసుకుని 30 రోజులు దాటినా వడ్డీని చెల్లించకపోతే అప్పుడు ఆ రేటు కాస్తా 18 శాతానికి పెరిగిపోతుంది.
► అసలు, వడ్డీ చెల్లింపుల్లో విఫలమైతే మూడు, ఆరు నెలల పాటు వేచి చూసి అప్పటికీ చెల్లించకపోతే.. ఆ తర్వాత సంస్థలు వేలానికి వెళ్లొచ్చు.
► మీ వద్ద రూ.లక్ష బంగారం ఉంటే రూ.లక్ష రుణంగా లభించదు. బంగారం విలువలో 60–75 శాతం వరకు రుణంగా (లోన్ టు వ్యాల్యూ/ఎల్‌టీవీ) ఎన్‌బీఎఫ్‌సీలు ఇస్తున్నాయి. పెద్ద మొత్తంలో రుణం కోరుకుంటే అప్పుడు 60 శాతానికే పరిమితం చేస్తున్నాయి. అదే బ్యాంకులు అయితే బంగారం విలువలో 65 శాతానికే రుణాన్ని పరిమితం చేస్తున్నాయి.
► బ్యాంకులతో పోలిస్తే, సులభంగా, వేగంగా రుణం కోరుకుంటే గోల్డ్‌లోన్ కంపెనీలను ఆశ్రయించడమే మంచిది. కొన్ని బ్యాంకులు బంగారం రుణాలపైనా ప్రాసెసింగ్ చార్జీని రాబడుతున్నాయి.
► బంగారం రుణాలను టర్మ్ లోన్స్‌గానే బ్యాంకులు పరిగణిస్తున్నాయి. కనుక వడ్డీ, అసలు కలిపి వాయిదాలుగా చెల్లించాల్సి ఉంటుంది.
► బ్యాంకుల్లో బంగారం రుణాలపై వడ్డీ 14–18 శాతం మధ్య ఉంది. కానీ, ఎన్‌బీఎఫ్‌సీల్లో ఇది గరిష్టంగా 26 శాతం వరకు ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment