
ముంబై: గోల్డ్ లోన్ కంపెనీ ముత్తూట్ ఫైనాన్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో క్వార్టర్‌లో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 8 శాతం పుంజుకుని రూ. 1,002 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 926 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 2,821 కోట్ల నుంచి రూ. 3,052 కోట్లకు ఎగసింది. దీనిలో వడ్డీ ఆదాయం రూ. 2,729 కోట్ల నుంచి రూ. 3,003 కోట్లకు బలపడింది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో నిర్వహణలోని ఆస్తుల(రుణాలు) విలువ(ఏయూఎం) 17 శాతం ఎగసి రూ. 60,919 కోట్లను తాకింది. బంగారు రుణాలకు డిమాండ్ పెరగడం, పండుగల సీజన్ ప్రారంభంకావడం వంటి అంశాల నేపథ్యంలో ఈ ఏడాది ద్వితీయార్ధం (అక్టోబర్–మార్చి)లోనూ పటిష్ట పనితీరును చూపగలమని కంపెనీ ఎండీ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ పేర్కొన్నారు. ఈ ఏడాది 15 శాతం వృద్ధిని సాధించగలమని అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment